ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం
రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాలి: జి.కిషన్ రెడ్డి
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం భువనగిరిలో జరిగిన యాదాద్రిభువనగిరి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఎన్ ఆర్‌ఈజీఎస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, హరితహారం వంటి పలు కార్యక్రమాలకు దారి మళ్లిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా కొత్త రేషన్ కార్డుల ఇవ్వలేకపోయిందన్నారు.
త్వరలో ఇచ్చే కార్డులపై సీఎం కేసీఆర్ ఫొటోతో పాటు ప్రధాని మోదీ ఫొటో కూడా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాలను అనుసంధానం చేస్తూ వంద శాతం కేంద్ర నిధులతో ఇన్నర్‌రింగ్ రోడ్డును చేపడతామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి ఇవ్వనందునే మంజూరు కాలేదన్నారు. ఎంఎంటీఎస్ పనుల కోసం రాష్ట్ర వాటా మంజూరు చేయకపోవడంతో జాప్యమవుతుందని వివరించారు.