‘కేసీఆర్‌తోపాటు మోదీ బొమ్మ కూడా ముద్రించాలి’
భువనగిరి: రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందటం లేదని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులను ముద్రించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ముద్రించబోయే వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటే ప్రధానమంత్రి మోదీ చిత్రం కూడా ముద్రించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొరత లేకుండా ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.50 వేల కోట్ల జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రప్రభుత్వం చేపట్టిందని వివరించారు. హైదరాబాద్ చుట్టూ పది జిల్లాలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో వేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షకు పైగా పక్కా ఇళ్లను పేదలకోసం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఇళ్లను కూడా కేటాయించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని ఆరోపించారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున నివేదించగా సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు.