టీఆర్‌ఎస్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబసభ్యులు, రాష్ట్ర మంత్రులు చేసిన విమర్శలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశంలతో కలసి మాట్లాడారు. ఎన్నికల ముందు తెలంగాణను గుజరాత్‌లా అభివృద్ధి చేస్తామని చెప్పిన కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని పదే పదే చెప్పినా ముఖ్యమం త్రి, మంత్రులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకమన్నట్లుగా దుష్ర్పచారం చేశారని ధ్వజమెత్తారు. ఆలస్యంగానైనా కేసీఆర్ స్పందించి ప్రధాని మోడీని ఢిల్లీలో కలసి చర్చించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సానుకూలంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలన్నారు. ఎంఐఎం చెప్పినట్లు వ్యవహరిస్తున్నందు వల్లే తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు.