మిషన్ కాకతీయ, భగీరథ భేష్
♦ ప్రశంసించిన నీతి ఆయోగ్
♦ 12న హైదరాబాద్‌లో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చేపట్టిన ఈ పథకాలు ఆదర్శమని కితాబిచ్చింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇటీవలే లేఖలు రాశారు. సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ అమలు చేస్తున్న ఈ పథకాలను నమూనాగా తీసుకొని కార్యక్రమాలు చేపడితే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గత ఏడాది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీరుతెన్నులు పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం రాష్ట్రంలో పర్యటించింది.
మరోసారి ఈ పథకాల పురోగతిని సమీక్షించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న పనగారియా రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్ర సాగునీటి పారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో సమాలోచనలు జరుపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పథకాల పురోగతిపై సమీక్ష జరగనుండటంతో ఆర్థిక సాయం చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ సమావేశానికి పనగారియాతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి సలహాదారు అశోక్‌కుమార్ జైన్, ఇరిగేషన్ సలహాదారు జితేంద్రకుమార్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విబాగం ఉప సలహాదారు పీకే ఝూ తదితరులు హాజరు కానున్నారు.