‘మిషన్’పై అశ్రద్ధ
⇒ నత్తనడకన సాగుతున్న మిషన్ కాకతీయ పనులు
⇒ 555 చెరువులకు గాను 340 చెరువుల్లో సర్వే పనులు కొలిక్కి
⇒ అందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారు
⇒ జూన్ నాటికి తొలివిడత పనులు పూర్తయ్యేది అనుమానమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే వర్షాకాలం నాటికి చెరువులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని సర్కారు భావించినప్పటికీ.. జిల్లాలో మాత్రం అధికారుల ఉదాసీనత వల్ల సర్వే పనులు ముందుకుసాగడం లేదు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,747 చెరువులున్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు పొలాలకు నీరు అందించి సాగులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా తొలివిడత 20శాతం చెరువులను ఎంపిక చేసుకుని వాటి మరమ్మతులు, కొత్తగా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా నీటిపారుదల విభాగాలను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో 555 చెరువులను గుర్తించిన అధికారులు.. వాటి సర్వే పనుల్లో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలోగా నిర్దేశించిన చెరువులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
మూడోవంతు చెరువులకే..
జిల్లాలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలివిడత 555 చెరువులను గుర్తించారు. ఈ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. ఇందుకుగాను ముందుగా ఆయా చెరువులను సర్వే చేసి అంచనాలను సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా సర్వే పనులను ఉపక్రమించిన అధికారులు.. ఇప్పటివరకు కేవలం 340 చెరువుల సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఇందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల చెరువులు 77 ఉండగా, వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు 110 ఉన్నాయి.
రూ.113 కోట్లకు ఓకే..
సర్వే పనులు పూర్తిచేసి ప్రణాళికలను ప్రభుత్వానికి పంపితే అందుకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది. ఈక్రమంలో జిల్లాలో 555 చెరువులకుగాను ఇప్పటివరకు 187 చెరువుల ప్రణాళికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఆయా పనులను ఆమోదిస్తూ పరిపాలన పరమైన అనుమతులిచ్చింది. ఈ 187 చెరువుల మరమ్మతులకుగాను రూ.113 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
గడువులోగా పూర్తయ్యేనా..
వచ్చే ఏడాదిలో వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా నిర్దేశించిన చెరువుల పునరుద్ధరణ పూర్తికావాలి. జిల్లాలో 555 చెరువులు గుర్తించగా.. ఇప్పటివరకు 187 చెరువుల పనుల అంశం కొలిక్కి వచ్చింది. మిగతా చె రువులకు సంబంధించి సర్వే, ప్రణాళికల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వ ఆమోదం లభిస్తే గడువులోగా పనులు పూర్తిచేసే వీలుండేది. కానీ అధికారుల ఉదాసీనవైఖరితో ప్రణాళికల తయారీ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో వానాకాలంలోగా నిర్దేశించిన చెరువులు పునరుద్ధరణ అనుమానమే.