రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం | ruling party cadres to work in the distribution of funds | Sakshi
Sakshi News home page

రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం

Published Thu, Apr 30 2015 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం - Sakshi

రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం

రూ.384 కోట్లతో  11,212 రోడ్ల అభివృద్ధి
 14,657  కిలోమీటర్ల మేర మట్టి పనులు

 
 హైదరాబాద్: మొరం, మట్టి పనుల పేరుతో కోట్లాది నిధులను రోడ్లపై వెదజల్లేందుకు రంగం సిద్ధమైంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో భాగంగా భారీ ఎత్తున మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన చేపట్టాలన్న సాకుతో పార్టీ శ్రేణులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ద్వారాలు తెరిచింది. ఇందుకోసం ఇటీవలే రూ. 384.61 కోట్లను సర్కారు కేటాయించింది. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్(ఎంఆర్‌ఆర్) గ్రాంటు నుంచి ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో రాష్ట్రవ్యాప్తంగా 11,212 రోడ్ల మరమ్మతుల్లో భాగంగా దాదాపు 14,657.23 కిలోమీటర్ల మేర మట్టి, మొరం పోసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులు కావడంతో నిబంధనల ప్రకారం వీటిని నామినేషన్ పద్ధతిన అప్పగిస్తారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ పేరిట తీర్మానం చేసిన కాంట్రాక్టర్లే ఈ పనులు దక్కించుకుంటారు.

దీంతో మండల, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీ నేతలకు పనుల పండుగ మొదలైంది. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే తతంగం కావడంతో నిధులన్నీ ‘గులాబీ’ కాంట్రాక్టర్లకే పంచిపెట్టనున్నారు. మొరం, మట్టి పోసే పనులు కావడంతో ఆనవాళ్లు లేకుండా ఈ నిధులను పార్టీ కార్యకర్తలకు ఫలహారంగా పంచి పెట్టడం ఖాయమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ విభాగం ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.20 లక్షలకు మించి అంచనా వ్యయమయ్యే రోడ్ల పనులను సైతం రూ.5 లక్షల విలువైన పనులుగా విభజించిన తీరు ఈ పంపకాల లోగుట్టును బయటపెడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలంలో  గంగాపూర్ నుంచి బీర్నాడీ ఎర్రచింతల్ వరకు రూ.15.88 లక్షల ఖర్చుతో అంచనా వేసిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పనులను నాలుగు బిట్లుగా విడగొట్టారు. రూ.5 లక్షల అంచనా వ్యయం దాటకుండా ఒకే పనిని నాలుగు పనులుగా మంజూరీ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి నుంచి కొండన్నపేట రోడ్డు పనులను రూ.5 లక్షలు మించకుండా మూడు బిట్లుగా విడగొట్టారు. ఇదే తీరుగా ప్రతి జిల్లాలో వందలాది పనులను వేలాది పనులుగా విభజించి పంపిణీకి అనువుగా పరిపాలక ఉత్తర్వులను జారీ చేశారు.

కార్యకర్తలకు కరువు తీరా..

గతంలో మండలం యూనిట్‌గా పనులను విభజించి కోటికిపైగా అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ విభాగం రూపొందించిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదించింది. భారీ ప్యాకేజీలతో బడా కాంట్రాక్టర్లు, బీటీ హాట్‌మిక్స్ ప్లాంట్లు ఉన్న వారు మాత్రమే టెండర్లలో పాల్గొనే లా నిబంధనలను సవరించింది. దీంతో రాజకీయ నేతలకు సంబంధించిన కాంట్రాక్టు ఏజెన్సీలే ఈ పనులను సునాయాసంగా దక్కించుకున్నాయి. దీనికితోడు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను పంచుకునేందుకు అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే పోటీపడ్డారు. దీంతో గ్రామస్థాయిలో చోటామోటా కాంట్రాక్టర్లకు పనుల కరువు ఏర్పడింది. కిందిస్థాయి కార్యకర్తల్లోని అసంతృప్తిని గమనించిన సర్కారు తాజాగా గ్రామీణ రోడ్ల పనులకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం మరమ్మతు చేపట్టే రోడ్లలో 30 శాతం ఇప్పటికే కంకర(మెటల్) రోడ్లుగా మారాయి. ఇప్పటికే రూ.225.11 కోట్లతో ఈ రోడ్ల అభివృద్ధి జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈజీఎస్ అప్‌గ్రేడేషన్ పేరుతో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. అయితే ఇప్పటికే మెటల్ రోడ్లుగా మారిన వాటిని సైతం తాజాగా మట్టి పనులు చేపట్టే రోడ్ల జాబితాలో ఉన్నాయి. వీటిని రద్దు చేస్తారా లేక మట్టి పోసినట్లు బిల్లులు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే చేపట్టిన పనులుంటే రద్దు చేయాల్సి ఉంది. కానీ నిధుల పంపిణీ కోసమే చేపట్టిన పనులు కావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పంచాయతీరాజ్ విభాగం అధికారులు ఇరకాటంలో పడ్డారు.
 

జిల్లా                       రోడ్ల సంఖ్య         కిలోమీటర్లు      నిధులు(రూ. కోట్లలో)

ఆదిలాబాద్                 1,169          1,363.20        43.87
కరీంనగర్                   1,386          1,833.03        53.43
ఖమ్మం                       883            978.70           33.02
మహబూబ్‌నగర్        1,587           2,421.56        51.98
మెదక్                      1,340           1,458.09        48.08
నల్గొండ                    1,562           2,399.59        49.00
నిజామాబాద్            1,059           1,207.77        33.99
రంగారెడ్డి                     933           1,269.91        28.69
వరంగల్                  1,293           1,725.38        42.55
 -----------------------------------------------
 మొత్తం                11,212           14,657.23      384.61
 ----------------------------------------------
 
 
అధికార పార్టీ శ్రేణులకు పనుల పండుగ   రోడ్ల మరమ్మతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఫలహారంలా నిధుల పంపిణీకి ఎత్తుగడ రూ.5 లక్షల్లోపు బిట్లుగా పనుల విభజన నామినేషన్ పద్ధతిన గులాబీ నేతలకు కట్టబెట్టే వ్యూహం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement