Clay works
-
ఇష్టాన్నే ఉపాధిగా మార్చుకున్న గృహిణి.. ఆదాయంతో పాటు అవార్డులు కూడా
ఇష్టంగా నేర్చుకోవాలే కానీ మట్టి కూడా పాఠాలు నేర్పుతుంది. కొత్త ఆవిష్కరణలతో పాటు ఉపాధికీ బాటలు వేస్తుంది. హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో ఉంటున్న సంగిశెట్టి సంగీత తన కళ ద్వారా ఈ విషయాన్ని మనందరికీ చాటుతోంది. సరదాగా నేర్చుకున్న కళ ద్వారా ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ‘‘కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్.. ఆర్టిస్ట్‌గా నాకు నేను గుర్తింపు సంపాదించుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. నేటి రోజులకు తగినట్టు స్టాచ్యూ, త్రీడీ ఎఫెక్ట్స్, క్యూబిజమ్, జపనీస్ ఆర్ట్, మల్టీపర్పస్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారుచేస్తుంటాను. ఇవన్నీ మట్టితో రూపొందించేవే. ఎకో, పాటరీ క్లే, పాలిమర్ క్లే, మోడలింగ్ క్లేతో కళారూపాల రూపకల్పన ఉంటుంది. ఇవి ఎప్పటికీ పాడవవు. నీటిలో కరగవు, కిందపడినా పగిలిపోవు. ఇల్లు, ఆఫీసులలో అలంకరణ వస్తువులుగా క్లే ఆర్ట్ కళాకృతులను ఎక్కువ వినియోగిస్తుంటారు. డిజైన్ బట్టి ధర ఉంటుంది. రెయిజన్ మెటీరియల్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, షాడో బాక్స్‌లు.. పెళ్లి, పుట్టిన రోజులు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆర్డర్స్‌ని బట్టి డిజైన్స్ చేస్తుంటాను. పెన్సిల్, చార్కోల్, మ్యూరల్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా నా రోజు వారి వర్క్‌లో భాగమే. వర్క్‌షాప్స్ ఎం.కామ్. వరకు చదువుకున్నాను. పెళ్లి, పిల్లలు జీవితంలో ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకొని, హాబీకే టైమ్ కేటాయించాను. ఇదే ఉపాధిగా మారుతుందని ముందు అనుకోలేదు. కానీ, ఇష్టమైన పనే ఆదాయమార్గాన్ని కూడా చూపిస్తుందని వచ్చిన ఆర్డర్స్ ద్వారా అర్థమైంది. ‘డూడుల్ బగ్స్ పేరుతో ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశాను. ఆన్లైన్ ద్వారా అమెరికా, కెనడాలోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు గృహిణులు గ్రూపుగా ఏర్పడి తమకు ఈ క్లే ఆర్ట్ నేర్పించమని అడుగుతారు. ఐదారుగురు గ్రూప్‌గా ఉన్నా వారి కోసం వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను. ఇప్పటికి వందల సంఖ్యలో మహిళలు శిక్షణ తీసుకున్నవారున్నారు. ప్రతిరోజూ సాయంకాలాలు క్లే ఆర్ట్ ట్రెయినింగ్ క్లాసులు తీసుకుంటాను. వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు ఇస్తుంటాను. రికార్డులు తెచ్చిన ఆర్ట్ రెండేళ్ళ క్రితం పిస్తా పొట్టుపై చేసిన మైక్రో క్లే ఆర్ట్ మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. పండ్లు, కూరగాయలు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు 150 కంటే ఎక్కువ రకాలు పిస్తాపొట్టుపై 74 గంటలలో చేసి చూపించాను. ఈ సూక్ష్మ కళా నైపుణ్యాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు వచ్చేలా చేసింది. వర్చువల్ అవార్డులూ వరించాయి. సాధనమున.. ఆసక్తి ఉండి, ఫీజు చెల్లించలేం అనుకునేవారికి మెటీరియల్ ఇచ్చి మరీ ఈ వర్క్స్ నేర్పిస్తుంటాను. ఏ కళ అయినా సాధన చేస్తూ ఉంటే కొత్త కొత్త నైపుణ్యాలు వచ్చి చేరుతాయి. అవే ఉపాధికి మార్గం చూపుతాయి. అందుకే, వర్క్ నేర్చుకున్నవాళ్లను మోటివేట్ చేస్తూ, తమను తాము బిల్డ్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తుంటాను. నాకు ఇష్టమైన పని కావడంతో మరింత కొత్తదనం కోసం సాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కళారంగంలో ఇష్టమే పెట్టుబడి అవుతుంది’’ అని వివరిస్తుంది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
రోడ్డుకు మొరం.. కార్యకర్తలకు వరం
►రూ.384 కోట్లతో 11,212 రోడ్ల అభివృద్ధి ►14,657 కిలోమీటర్ల మేర మట్టి పనులు హైదరాబాద్: మొరం, మట్టి పనుల పేరుతో కోట్లాది నిధులను రోడ్లపై వెదజల్లేందుకు రంగం సిద్ధమైంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధిలో భాగంగా భారీ ఎత్తున మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన చేపట్టాలన్న సాకుతో పార్టీ శ్రేణులకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ద్వారాలు తెరిచింది. ఇందుకోసం ఇటీవలే రూ. 384.61 కోట్లను సర్కారు కేటాయించింది. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్(ఎంఆర్ఆర్) గ్రాంటు నుంచి ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో రాష్ట్రవ్యాప్తంగా 11,212 రోడ్ల మరమ్మతుల్లో భాగంగా దాదాపు 14,657.23 కిలోమీటర్ల మేర మట్టి, మొరం పోసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ రూ.5 లక్షలలోపు విలువైన పనులు కావడంతో నిబంధనల ప్రకారం వీటిని నామినేషన్ పద్ధతిన అప్పగిస్తారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ పేరిట తీర్మానం చేసిన కాంట్రాక్టర్లే ఈ పనులు దక్కించుకుంటారు. దీంతో మండల, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీ నేతలకు పనుల పండుగ మొదలైంది. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే తతంగం కావడంతో నిధులన్నీ ‘గులాబీ’ కాంట్రాక్టర్లకే పంచిపెట్టనున్నారు. మొరం, మట్టి పోసే పనులు కావడంతో ఆనవాళ్లు లేకుండా ఈ నిధులను పార్టీ కార్యకర్తలకు ఫలహారంగా పంచి పెట్టడం ఖాయమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే పంచాయతీరాజ్ విభాగం ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.20 లక్షలకు మించి అంచనా వ్యయమయ్యే రోడ్ల పనులను సైతం రూ.5 లక్షల విలువైన పనులుగా విభజించిన తీరు ఈ పంపకాల లోగుట్టును బయటపెడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం మండలంలో గంగాపూర్ నుంచి బీర్నాడీ ఎర్రచింతల్ వరకు రూ.15.88 లక్షల ఖర్చుతో అంచనా వేసిన ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పనులను నాలుగు బిట్లుగా విడగొట్టారు. రూ.5 లక్షల అంచనా వ్యయం దాటకుండా ఒకే పనిని నాలుగు పనులుగా మంజూరీ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శాత్రాజుపల్లి నుంచి కొండన్నపేట రోడ్డు పనులను రూ.5 లక్షలు మించకుండా మూడు బిట్లుగా విడగొట్టారు. ఇదే తీరుగా ప్రతి జిల్లాలో వందలాది పనులను వేలాది పనులుగా విభజించి పంపిణీకి అనువుగా పరిపాలక ఉత్తర్వులను జారీ చేశారు. కార్యకర్తలకు కరువు తీరా.. గతంలో మండలం యూనిట్‌గా పనులను విభజించి కోటికిపైగా అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ విభాగం రూపొందించిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదించింది. భారీ ప్యాకేజీలతో బడా కాంట్రాక్టర్లు, బీటీ హాట్‌మిక్స్ ప్లాంట్లు ఉన్న వారు మాత్రమే టెండర్లలో పాల్గొనే లా నిబంధనలను సవరించింది. దీంతో రాజకీయ నేతలకు సంబంధించిన కాంట్రాక్టు ఏజెన్సీలే ఈ పనులను సునాయాసంగా దక్కించుకున్నాయి. దీనికితోడు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను పంచుకునేందుకు అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే పోటీపడ్డారు. దీంతో గ్రామస్థాయిలో చోటామోటా కాంట్రాక్టర్లకు పనుల కరువు ఏర్పడింది. కిందిస్థాయి కార్యకర్తల్లోని అసంతృప్తిని గమనించిన సర్కారు తాజాగా గ్రామీణ రోడ్ల పనులకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం మరమ్మతు చేపట్టే రోడ్లలో 30 శాతం ఇప్పటికే కంకర(మెటల్) రోడ్లుగా మారాయి. ఇప్పటికే రూ.225.11 కోట్లతో ఈ రోడ్ల అభివృద్ధి జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈజీఎస్ అప్‌గ్రేడేషన్ పేరుతో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. అయితే ఇప్పటికే మెటల్ రోడ్లుగా మారిన వాటిని సైతం తాజాగా మట్టి పనులు చేపట్టే రోడ్ల జాబితాలో ఉన్నాయి. వీటిని రద్దు చేస్తారా లేక మట్టి పోసినట్లు బిల్లులు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే చేపట్టిన పనులుంటే రద్దు చేయాల్సి ఉంది. కానీ నిధుల పంపిణీ కోసమే చేపట్టిన పనులు కావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పంచాయతీరాజ్ విభాగం అధికారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లా రోడ్ల సంఖ్య కిలోమీటర్లు నిధులు(రూ. కోట్లలో) ఆదిలాబాద్ 1,169 1,363.20 43.87 కరీంనగర్ 1,386 1,833.03 53.43 ఖమ్మం 883 978.70 33.02 మహబూబ్‌నగర్ 1,587 2,421.56 51.98 మెదక్ 1,340 1,458.09 48.08 నల్గొండ 1,562 2,399.59 49.00 నిజామాబాద్ 1,059 1,207.77 33.99 రంగారెడ్డి 933 1,269.91 28.69 వరంగల్ 1,293 1,725.38 42.55 ----------------------------------------------- మొత్తం 11,212 14,657.23 384.61 ---------------------------------------------- అధికార పార్టీ శ్రేణులకు పనుల పండుగ రోడ్ల మరమ్మతులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఫలహారంలా నిధుల పంపిణీకి ఎత్తుగడ రూ.5 లక్షల్లోపు బిట్లుగా పనుల విభజన నామినేషన్ పద్ధతిన గులాబీ నేతలకు కట్టబెట్టే వ్యూహం