ఇష్టంగా నేర్చుకోవాలే కానీ మట్టి కూడా పాఠాలు నేర్పుతుంది. కొత్త ఆవిష్కరణలతో పాటు ఉపాధికీ బాటలు వేస్తుంది. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో ఉంటున్న సంగిశెట్టి సంగీత తన కళ ద్వారా ఈ విషయాన్ని మనందరికీ చాటుతోంది. సరదాగా నేర్చుకున్న కళ ద్వారా ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
‘‘కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్.. ఆర్టిస్ట్‌గా నాకు నేను గుర్తింపు సంపాదించుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. నేటి రోజులకు తగినట్టు స్టాచ్యూ, త్రీడీ ఎఫెక్ట్స్, క్యూబిజమ్, జపనీస్ ఆర్ట్, మల్టీపర్పస్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారుచేస్తుంటాను. ఇవన్నీ మట్టితో రూపొందించేవే. ఎకో, పాటరీ క్లే, పాలిమర్ క్లే, మోడలింగ్ క్లేతో కళారూపాల రూపకల్పన ఉంటుంది.
ఇవి ఎప్పటికీ పాడవవు. నీటిలో కరగవు, కిందపడినా పగిలిపోవు. ఇల్లు, ఆఫీసులలో అలంకరణ వస్తువులుగా క్లే ఆర్ట్ కళాకృతులను ఎక్కువ వినియోగిస్తుంటారు. డిజైన్ బట్టి ధర ఉంటుంది. రెయిజన్ మెటీరియల్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, షాడో బాక్స్‌లు.. పెళ్లి, పుట్టిన రోజులు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆర్డర్స్‌ని బట్టి డిజైన్స్ చేస్తుంటాను. పెన్సిల్, చార్కోల్, మ్యూరల్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా నా రోజు వారి వర్క్‌లో భాగమే.
వర్క్‌షాప్స్
ఎం.కామ్. వరకు చదువుకున్నాను. పెళ్లి, పిల్లలు జీవితంలో ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకొని, హాబీకే టైమ్ కేటాయించాను. ఇదే ఉపాధిగా మారుతుందని ముందు అనుకోలేదు. కానీ, ఇష్టమైన పనే ఆదాయమార్గాన్ని కూడా చూపిస్తుందని వచ్చిన ఆర్డర్స్ ద్వారా అర్థమైంది. ‘డూడుల్ బగ్స్ పేరుతో ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశాను. ఆన్‌లైన్ ద్వారా అమెరికా, కెనడాలోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు గృహిణులు గ్రూపుగా ఏర్పడి తమకు ఈ క్లే ఆర్ట్ నేర్పించమని అడుగుతారు. ఐదారుగురు గ్రూప్‌గా ఉన్నా వారి కోసం వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను. ఇప్పటికి వందల సంఖ్యలో మహిళలు శిక్షణ తీసుకున్నవారున్నారు. ప్రతిరోజూ సాయంకాలాలు క్లే ఆర్ట్ ట్రెయినింగ్ క్లాసులు తీసుకుంటాను. వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు ఇస్తుంటాను.
రికార్డులు తెచ్చిన ఆర్ట్
రెండేళ్ళ క్రితం పిస్తా పొట్టుపై చేసిన మైక్రో క్లే ఆర్ట్ మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. పండ్లు, కూరగాయలు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు 150 కంటే ఎక్కువ రకాలు పిస్తాపొట్టుపై 74 గంటలలో చేసి చూపించాను. ఈ సూక్ష్మ కళా నైపుణ్యాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు వచ్చేలా చేసింది. వర్చువల్ అవార్డులూ వరించాయి.
సాధనమున..
ఆసక్తి ఉండి, ఫీజు చెల్లించలేం అనుకునేవారికి మెటీరియల్ ఇచ్చి మరీ ఈ వర్క్స్ నేర్పిస్తుంటాను. ఏ కళ అయినా సాధన చేస్తూ ఉంటే కొత్త కొత్త నైపుణ్యాలు వచ్చి చేరుతాయి. అవే ఉపాధికి మార్గం చూపుతాయి. అందుకే, వర్క్ నేర్చుకున్నవాళ్లను మోటివేట్ చేస్తూ, తమను తాము బిల్డ్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తుంటాను. నాకు ఇష్టమైన పని కావడంతో మరింత కొత్తదనం కోసం సాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కళారంగంలో ఇష్టమే పెట్టుబడి అవుతుంది’’ అని వివరిస్తుంది ఈ హార్టిస్ట్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment