శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...
కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్‌మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్‌మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్‌ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.
చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.
ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.
సమాజం అనే పుస్తకాన్ని చదివి..
హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.
అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!
‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్‌సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్‌సింగ్.
ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
Comments
Please login to add a commentAdd a comment