
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య(54) ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సోమవారం ప్రధాని దినేశ్ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్స నాయకే మంగళవారం జరిగిన ఒక కార్య క్రమంలో హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.
ఎన్‌పీపీకే చెందిన విజితా హెరత్, లక్ష్మణ్ నిపుణ రచ్చిలతోపాటు అధ్యక్షుడు దిస్సనాయకే కూడా మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం. నవంబర్ 14∙పార్లమెంట్ ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక కేబినెట్ పనిచేస్తుంది. పార్లమెంటును రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే మంగళవారం రాత్రి నిర్ణయం ఉత్తర్వులు జారీ చేశారు.
బండారునాయకే తర్వాత: సిరిమావో బండారు నాయకే (2000) తర్వాత శ్రీలంక ప్రధాని అయిన తొలి మహిళగా హరిణి నిలిచారు. ఆమె హక్కుల కార్యకర్త. యూనివర్సిటీ లెక్చరర్‌గా చేస్తున్నారు.
డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..
శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్య డిగ్రీ చదివింది ఢిల్లీ యూనివర్సిటీ లోనే. ఇక్కడి హిందూ కాలేజీలో 1991– 1994 సంవత్సరాల్లో సోషియాలజీలో బీఏ పూర్తి చేశారు. హిందూ కాలేజీ పూర్వ విద్యార్థిని శ్రీలంక ప్రధాని కావడం తమకెంతో గర్వకారణమని కాలేజీ ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ హర్షం వ్యక్తం చేశారు. హరిణి బ్యాచ్‌మేట్, బాలీవుడ్ డైరెక్టర్ నళినీ రంజన్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment