బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!
కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్‌ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!
మోదీ 3.0 కేబినేట్‌లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.
మధ్యయుగాల్లో..
భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.
గూంగీ గుడియా..
మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్‌మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్‌గా పిలిచే స్ఫూర్తిని చాటారు.
కరోనాతో మరోసారి..
రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.
మరిన్ని రూపాల్లో..
యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!
అత్యంత సంపన్న మహిళ..
33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్‌పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ
రాణిస్తున్నారు.
సమస్యల వలయం..
హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.
కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.
వరల్డ్ విడోస్ డే..
ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.
మెహినీ గిరి..
మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.
వార్ విడోస్ అసోసియేషన్..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.
దాడులు..
ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.
వితంతు రక్షణ చట్టాలు..
వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్
Comments
Please login to add a commentAdd a comment