"బస్తర్.. కొండకోనల్లో.. వాగువంకల్లో ఒదిగిన ఈ ప్రాంతానికి లోకం పోకడలతో పెద్దగా పరిచయం లేదు! కాని దానికి సంబంధించిన ఏదో ఒక వార్తను ఈ ప్రపంచం నిత్యం వింటూనే ఉంటుంది! బస్తర్‌ను కమ్యూన్స్‌కి నమూనాగా మలచాలని మావోయిస్ట్‌లు.. మోడర్న్ వరల్డ్‌కి అనుసంధించాలని ప్రభుత్వాలు.. ఏ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తోందో.. ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అక్కడి జనమే చెప్పాలి! కానీ రెండు పరస్పర విరుద్ధమైన తీరులు.. తరీఖాల మధ్యనున్న బస్తర్ వాసులు గుంభనంగానే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే భయంగా ఉంటారు! ఆ భయాన్ని పోగొట్టి.. వారి మంచిచెడులను అడిగే దళం ఒకటి అక్కడి గూడేల తలుపులు తడుతుంది! ఆ దళంలో ఉన్నవాళ్లంతా ఆదీవాసీల కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లే! వాళ్లకు శిక్షణనిచ్చి సాయుధులుగా పంపిస్తోంది ప్రభుత్వమే! అయినా ఆ బిడ్డలను చూస్తే ఆ గిరిజనులకు ఒక భరోసా.. భద్రత!
ఆ విశ్వాసం పొందడానికి ఈ బిడ్డలు సర్కారు నమూనాను అనుసరించట్లేదు.. ఆత్మీయతను పంచుతున్నారు! అనునయిస్తున్నారు. తమ జనానికి ఏం కావాలో.. ఏం అవసరమో తెలుసు కాబట్టి ఆ దిశలో నడుస్తున్నారు.. నడిపిస్తున్నారు! ఇది జనతన సర్కార్‌కి.. సర్కార్‌కి మధ్య పోరును వివరించే వ్యాసం కాదు! ఆ రెండిటి నడుమ ఘర్షణకు గురై.. తలుపులు మూసేసుకున్న జనాలను అక్కున చేర్చుకుని సర్కారు అభివృద్ధిలో తమ వాటాను వారు అందుకునేలా చేస్తున్న ఆ కూతుళ్లు.. అక్కాచెల్లెళ్ల గురించి! మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఈ విమెన్ పవర్ గురించి! వివరాల్లోకి వెళ్లేముందు బస్తర్ చరిత్రనూ తెలుసుకుందాం క్లుప్తంగా.."
రామాయణంలో దండకారణ్యంగా చెప్పుకునే దట్టమైన అటవీ ప్రాంతం తెలంగాణకు ఆవల ఛత్తీస్‌గఢ్‌లో గోదావరి, ఇంద్రావతి, శబరి నదుల నడుమ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనే అంశాలపై రెండు దశాబ్దాల కిందటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. అక్బర్ కాలంలో తొలిసారి, ఆ తర్వాత బ్రిటిష్ హయాంలో మరోసారి ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకునేందుకు కొంత ప్రయత్నం జరిగింది. అయితే దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రయత్నాలు తుదివరకు సాగలేదు. ఇక్కడి ఆదివాసీ తెగ ప్రజలకు అడవే లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. వీళ్లకు దేవుడైనా, దయ్యమైనా ప్రకృతే! ఆ తర్వాత బ్రిటిష్ వారి రాక, వారు రూపొందించిన కఠినమైన చట్టాల ఆసరాతో అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి అడుగు పెట్టారు. దీంతో ఆదివాసీలపై అటవీశాఖ ఆగడాలు శ్రుతి మించాయి. అటవీశాఖ సిబ్బంది అంటే అడవుల్లో ఆదివాసీల జీవనానికి అడ్డుతగిలే వారుగా ముద్ర పడిపోయారు.
జనతన సర్కార్..
తెలంగాణలో 1980వ దశకంలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెలు అన్నలకు అడ్డాలుగా మారాయి. ఇదే క్రమంలో 1982లో కొందరు మావోయిస్ట్‌లు ఏటూరునాగారం వద్ద గోదావరి తీరం దాటి బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయారు. అటవీశాఖ సిబ్బంది అణచివేతతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచారు. వారు మాట్లాడే భాష నేర్చుకున్నారు. వారి తిండికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆదివాసీలను ఐక్యం చేసి, అటవీశాఖ సిబ్బంది ఆగడాలను నిలదీయడం నేర్పారు. ఫలితంగా ఈ శతాబ్దం ఆరంభానికి వచ్చేసరికి ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 92 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించిన బస్తర్ ఏరియా అన్నల నీడలోకి వెళ్లింది. గ్రామాల వారీగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన విద్య, వైద్య, రక్షణ కమిటీలు పరిపాలనలో చురుగ్గా వ్యవహరించసాగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యేటప్పటికి బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అనధికారిక పాలకులుగా మారారు.
బస్తర్‌తో బంధం..
'ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయులు తమ రాజధాని ఏకశిలా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గోదావరి తీరం దాటి ఇంద్రావతి ఒడ్డున విస్తరించిన అడవుల్లోకి వెళ్లి, బస్తర్ కేంద్రంగా మరో రాజ్యాన్ని స్థాపించారు. రాచరిక పాలన అంతమైనా నేటికీ అక్కడ మన కాకతీయుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడే భావజాల వ్యాప్తిలో భాగంగా ఆనాటి అన్నలు గోదావరి తీరం దాటి బస్తర్‌లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సహకారంతో జనతన సర్కార్‌ను నడిపించడం ప్రారంభించారు. కాలాలు మారినా అలా బస్తర్‌తో తెలుగువారికి బంధం కొనసాగుతూనే ఉంది.'
సల్వాజుడుం..
ఆరంభంలో బాగున్నా, బస్తర్ అడవులు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. అడవుల్లోని గ్రామాలకు సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆధునాతన విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ్స అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అడవుల్లోకి అభివృద్ధిని తెస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అడవుల్లోని సహాజ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు అడవుల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయంటూ మావోయిస్ట్‌లు ఎదురుతిరిగారు. దీంతో మావోయిస్ట్‌ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిదశలో 2005లో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అప్పటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. అయితే అది వికటించి, అడవుల్లో అన్నలకు మరింత పట్టు పెరిగింది. దాంతో అటవీశాఖ సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
గ్రీన్‌హంట్..
2012లో బస్తర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ గిరిజనులు మావోయిస్ట్‌లనే తమ పాలకులుగా భావిస్తున్నారని తేలింది. ఈ ఫలితం సంచలనం రేపింది. దాంతో మావోయిస్ట్‌లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలించింది. కేవలం మావోయిస్ట్‌ల కోసమే కోబ్రా దళాలను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సీఏఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ)ని ఏర్పాటు చేసింది. బస్తర్ పరిధిలో ఉన్న సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు ఎలాగైనా అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంగా ఉక్కుపాదాలతో ముందుకు సాగింది ప్రభుత్వ యంత్రాంగం. ఫలితంగా గత పదిహేనేళ్లుగా గోదావరి, ఇంద్రావతి, శబరి నదులు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని పచ్చని అడవులు మరింతగా రక్తసిక్తమయ్యాయి.
ఇబ్బంది లేదు..
'చిన్నప్పుడే మావోయిస్టుల్లో కలసిపోయాను. ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవితం గడచింది. అక్కడ అనారోగ్యం పాలయ్యాను. నేనక్కడ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇక్కడ నా కుటుంబానికి అండగా ఎవరూ లేరు. దాంతో అడవుల్లోంచి బయటకు వచ్చాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్స్‌లో మహిళా కమెండోగా పని చేస్తున్నాను. నా కుటుంబానికి అండగా ఉంటున్నాను. అలవాటైన పని కావడంతో ఆయు«ధంతో అడవుల్లో పని చేయడం ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు.' – సబిత (పేరు మార్చాం) మహిళా కమెండో
భయం నీడన..
మైదానప్రాంత గిరిజనులు సైతం ఇతరులతో అంత సులువుగా కలసిపోరు. ఇక కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలైతే తమ గ్రామాల దగ్గరికి ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే ముడుచుకుపోతారు. అలాంటిది ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్ ధరించి ఆయుధాలతో వచ్చిన భద్రతా దళాలను చూసేసరికి మరింతగా కుంచించుకుపోయారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు గిరిజనుల నుంచి కనీస సమాచారం అందడం కూడా దుర్లభమైంది. అడవుల్లో తమను చూసి బెదిరిపోయే ఆదివాసీలు.. మావోయిస్ట్‌లకు అండగా ఉంటున్నారనే అపోహ భద్రతా దళాల్లో పెరిగిపోయింది. బలవంతంగా తమ నోరు విప్పించేందుకు భద్రతా దళాలు చేసే ప్రయత్నాలు ఆదివాసీలను మరింతగా బెదరగొట్టాయి. దాంతో ఇటు భద్రతా దళాలు, అటు ఆదీవాసీలు ఒకనొకరు విశ్వసించుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎదురు కాల్పులు, కోవర్టుల ఘాతుకాలు, ఇన్ ఫార్మర్ల హత్యలతో హింసాకాండ పెరిగింది.
హక్కుల ఉల్లంఘన
దట్టమైన అడవుల్లోకి వెళ్లినప్పుడు సెర్చింగ్ పేరుతో ఆదివాసీ గూడేలపై అకృత్యాలకు, అమానవీయ చర్యలకు పాల్పాడుతున్నారనే ఆరోపణలు భద్రతా దళాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా కమెండోల (మగవాళ్లు) చర్యలు ఉంటున్నాయనే విమర్శలు పెల్లుబికాయి. భద్రతా దళాలను చూస్తేనే ఆదివాసీ గూడేలు గడగడలాడిపోతున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అప్పటికే చెలరేగుతున్న హింసకు మానవ హక్కుల హననం అనే ఆరోపణలు తోడవడంతో ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి.
మానవీయ కోణం..
భద్రతా దళాల సంఖ్యను పెంచినా, అధునాతన ఆయుధాలు అందించినా.. సరికొత్త వ్యూహాలను అమలు చేసినా అడవుల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యపడలేదు ప్రభుత్వాలకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఆయుధాలతో ఆదివాసీల మనసులను గెలుచుకోవడం కష్టమని భావించారు అధికారులు. దాంతో తమ పట్ల, తాము వినిపిస్తున్న అభివృద్ధి నినాదం పట్ల గిరిజనానికి విశ్వాసం కలగాలంటే వారిపట్ల సహానుభూతి అవసరమని గ్రహించారు. మానవీయకోణం లేని ప్రయత్నాలు వ్యర్థమని అర్థం చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనే నినాదానికి మానవీయ కోణం జత చేయాలనే వ్యూహానికి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చారు.
దంతేవాడలో తొలి అడుగు!
పారా మిలటరీ దళాల్లో మహిళలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నంత ఈజీగా అమలు సాగలేదు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కష్ట సాధ్యమైంది. అప్పటికే మావోయిస్ట్‌లు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో వందల మంది చనిపోయారు. దాంతో ఆలివ్‌గ్రీన్ దుస్తులు ధరించి, భుజాన తుపాకి మోసేందుకు ముందుకొచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంతే మిగిలారు. ఆ వచ్చిన కొద్దిమంది కూడా అప్పటికే అక్కడ చెలరేగుతున్న హింసలో పెద్దదిక్కును కోల్పోయిన వారు, లొంగిపోయిన మావోయిస్టులే! అలా 2019లో దంతెవాడ జిల్లాలో తొలి విమెన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళం ఏర్పడింది.
మూడు నెలల శిక్షణ
ఫ్రంట్ లైన్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్‌లో భాగంగా ప్రారంభమైన తొలి దళంలో పదిమంది లొంగిపోయిన మహిళా మావోయిస్టులు, పదిమంది సల్వాజుడుం పూర్వసభ్యులు ఉండగా మిగిలిన పదిమంది రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా నియమితులయ్యారు. అలా మొత్తం ముపై ్ప మందిని తీసుకున్నారు. మావోయిస్ట్‌లకు వ్యతిరేకంగా చేపట్టే జంగిల్ వార్‌ఫేర్‌లో వారికి మూడు నెలల కఠిన శిక్షణ ఇచ్చారు. దాంతోపాటుగా దట్టమైన అడవుల్లో సురక్షితంగా వాహనాలు నడపడం, మ్యాప్ రీడింగ్, కౌంటర్ ఆంబుష్ స్ట్రాటజీ, ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ నేతల ప్రొఫైల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారువేషాల్లో మెరుపుదాడులు చేయడంలోనూ మెలకువలు నేర్పించి, కార్యక్షేత్రంలోకి దింపారు.
అర్థం చేసుకోవడం తేలిక..
'నేను ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ మహిళను. గతంలో మా గ్రామంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వస్తే గ్రామమంతా వణికిపోయేది. ఆ భయం నుంచే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అడవిబాట పట్టాం. ఇప్పుడు భద్రతాదళంలో మహిళా కమెండోగా పని చేస్తున్నా. భద్రతా దళాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజల మానసిక స్థితి ముఖ్యంగా మహిళలు ఎలా భయపడతారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టి భరోసా కల్పించడం ఎలాగో మాకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అందువల్లే మహిళా కమెండోలు వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు, భద్రతా దళాలకు మధ్య సంబంధాలు∙మెరుగవుతున్నాయి గతంతో పోలిస్తే!' – జయంతి (పేరు మార్చాం) మహిళా కమెండో
మహిళా కమెండోలు..
ఈ మహిళా దళ సభ్యులను బృందాలుగా వేరు చేస్తారు. వీరు మెన్ స్క్వాడ్ కూంబింగ్‌కు వెళ్లినప్పుడు వారి వెంట అడవుల్లోకి వెళ్తారు. ఉదాహరణకు పాతిక మంది కమెండోల బృందం అడవుల్లోకి వెళితే అందులో నలుగురైదురుగు మహిళా కమెండోలు ఉండేలా కూర్పు చేశారు. వీరు అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు, దారిలో ఏదైనా గూడెం వస్తే మహిళా కమెండోలు గూడెం లోపలికి వెళ్తారు. అక్కడున్న వారితో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తీర్చగలిగే సమస్య అయితే అక్కడిక్కడే తమ సామర్థ్యం మేరకు పరిష్కారం చూపుతారు. అక్కడికి రావడం వెనుక తమ ఉద్దేశం ఏంటో చెబుతారు, సహకరించాలని కోరుతారు.
స్త్రీల సమస్యలు..
మహిళా కమెండోలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లిళ్లు, పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడే ఛత్తీస్‌గఢ్ మహిళలు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత, గైనిక్ సమస్యలపై తమకున్న అవగాహన మేరకు వారికి తోడ్పాటును అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి తమ కిట్లలో ఉండే మాత్రలు, టానిక్స్‌ను వారికి అందిస్తుంటారు. దీంతో బస్తర్ ప్రాంతంలోని ప్రజలకు భద్రతా దళాలపై ఉండే అపారమైన భయం స్థానంలో క్రమంగా నమ్మకం చిగురించసాగింది.
మార్పు మొదలైంది..
మహిళా కమెండోలు వచ్చాక మార్పు మొదలైందంటున్నారు ఛత్తీస్‌గఢ్ గ్రామీణులు. ‘ఇంతకుముందు భద్రతా దళాలు మా ఊళ్లవైపు వస్తున్నాయని తెలిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం అడవుల్లోకి పరుగెట్టేవాళ్లం. ఆరోగ్యం బాగాలేని వారు, ముసలి వాళ్లు మాత్రమే ఊళ్లల్లో ఉండేవారు. భద్రతా దళాలు మా ఊళ్లను విడిచిపెట్టాయని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. అయితే వాళ్లు వస్తున్నారని తెలిసి ఉన్నపళంగా ఊరంతా ఖాళీ అయ్యేసరికి ఏదో జరగబోతోందనే అనుమానంతో జవాన్లు ఊళ్లల్లోనే తిష్టవేసే వాళ్లు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారంటూ ఊళ్లల్లో ఉన్న వారిని గదమాయించే వారు.
దాంతో మా పల్లెల్లో ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ మహిళా కమెండోలు వచ్చిన తర్వాత భద్రతా దళాల మాటతీరులో మార్పు వచ్చింది. మా మీద భద్రతా దళాలకు చెందిన మగ కమెండోలు దాష్టీకాలు చేయకుండా అడ్డుకునే మహిళా కమెండోలు ఉన్నారనే నమ్మకం కలిగింది. మా బాధలు చెబితే అర్థం చేసుకునే మనుషులకు భద్రతా దళాల్లో స్థానం ఉందనే భరోసా వచ్చింది. రోజులు గడిచే కొద్దీ, నెలలు ముగిసే కొద్దీ భద్రతా దళాలను చూసి అడవుల్లోకి పారిపోయే పరిస్థితి తగ్గిపోయింది. సర్కారుకు, మాకు మధ్య వారధిగా నిలుస్తున్నారు మహిళా జవాన్లు’ అని చెప్పుకొచ్చారు స్థానిక జనం.
పట్టాలపైకి అభివృద్ధి!
చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజలతో భద్రతా దళాలు మమేకం అవడం మొదలైన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ముందుగా మహిళా జవాన్లతో కూడిన భద్రతా దళాలు అడవుల్లోకి వెళ్లి, వాళ్లు అక్కడి ప్రజలతో కలసిపోతారు. ఆ తర్వాత అక్కడ భద్రతా దళాల క్యాంప్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఆ గ్రామానికి కరెంటు వస్తుంది. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు మొదలవుతాయి. వీటికి సమాంతరంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ కొంతమంది సభ్యులను ఉంచేసి మిగిలిన దళ సభ్యులు ముందుకు సాగుతారు. రోడ్డు, కరెంటు సౌకర్యాలు వచ్చిన గ్రామాల్లోకి దశల వారీగా స్కూళ్లు, ఆస్పత్రులు తదితర వసతులూ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. మానవ హక్కుల సంఘాల ఆరోపణలూ అంతగా వినిపించడంలేదని పరిశీలకుల అభిప్రాయం.
ఎన్నికల విధుల్లో..
బస్తర్ ప్రాంతంగా చెప్పుకునే ఏడు జిల్లాల పరిధిలో మహిళా కమెండోలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహిళా దళాల్లో చేరే వారికి పద్దెనిమిది నెలల శిక్షణ కాలాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 450 మందికి పైగా మహిళా కమెండోలు ఛత్తీస్‌గఢ్‌లో పని చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. దట్టమైన అడవుల్లో ఉన్న 35 పోలింగ్ బూత్‌ల రక్షణ బాధ్యతను మహిళా కమెండోలకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఆ 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి. ఆదివాసీలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘనత మహిళా కమెండోలదే!
మహారాష్ట్రలో..
ఛత్తీస్‌గఢ్‌లో మహిళా కమెండోలు తెచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలనూ ఆలోచింపచేసింది. దండకారణ్యంలో భాగంగా ఉండే మçహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ మహిళా కమెండో దళాన్ని నెలకొల్పారు. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ దళం గడ్చిరోలి జిల్లా వంగేటూరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, దేశ సైనికదళంలోనూ మహిళా కమెండోలు తమ సత్తా చూపిస్తున్నారు.
మొత్తానికి..
కరకుదనం ఖాకీ సొత్తు. కరడుగట్టిన కాఠిన్యానికి సైన్యం చిరునామా! ఈ రెండిటితో పరిచయమేలేనిది మహిళ! తోటి వాళ్లను వినగలిగే ఓర్పు, అవతలి వాళ్ల కోణంలోంచి ఆలోచించగలిగే నేర్పు, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోగలిగే దయ, వీటన్నిటినీ మించి ఏటికి ఎదురీదగల ధైర్యంతోనే ఆయుధాలకు సాధ్యం కాని మార్పును తీసుకురాగలిగింది. తూటాలతో దద్దరిల్లిన ప్రాంతంలో సంతోషాల సవ్వళ్లు వినిపించేలా చేస్తోంది. ల్యాండ్ మైన్స్ నాటుకున్న ప్రదేశాల్లో శాంతిని పండించగలుగుతోంది.
– కృష్ణగోవింద్
Comments
Please login to add a commentAdd a comment