Commando
-
Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..!
"బస్తర్.. కొండకోనల్లో.. వాగువంకల్లో ఒదిగిన ఈ ప్రాంతానికి లోకం పోకడలతో పెద్దగా పరిచయం లేదు! కాని దానికి సంబంధించిన ఏదో ఒక వార్తను ఈ ప్రపంచం నిత్యం వింటూనే ఉంటుంది! బస్తర్‌ను కమ్యూన్స్కి నమూనాగా మలచాలని మావోయిస్ట్‌లు.. మోడర్న్ వరల్డ్‌కి అనుసంధించాలని ప్రభుత్వాలు.. ఏ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తోందో.. ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అక్కడి జనమే చెప్పాలి! కానీ రెండు పరస్పర విరుద్ధమైన తీరులు.. తరీఖాల మధ్యనున్న బస్తర్ వాసులు గుంభనంగానే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే భయంగా ఉంటారు! ఆ భయాన్ని పోగొట్టి.. వారి మంచిచెడులను అడిగే దళం ఒకటి అక్కడి గూడేల తలుపులు తడుతుంది! ఆ దళంలో ఉన్నవాళ్లంతా ఆదీవాసీల కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లే! వాళ్లకు శిక్షణనిచ్చి సాయుధులుగా పంపిస్తోంది ప్రభుత్వమే! అయినా ఆ బిడ్డలను చూస్తే ఆ గిరిజనులకు ఒక భరోసా.. భద్రత! ఆ విశ్వాసం పొందడానికి ఈ బిడ్డలు సర్కారు నమూనాను అనుసరించట్లేదు.. ఆత్మీయతను పంచుతున్నారు! అనునయిస్తున్నారు. తమ జనానికి ఏం కావాలో.. ఏం అవసరమో తెలుసు కాబట్టి ఆ దిశలో నడుస్తున్నారు.. నడిపిస్తున్నారు! ఇది జనతన సర్కార్‌కి.. సర్కార్‌కి మధ్య పోరును వివరించే వ్యాసం కాదు! ఆ రెండిటి నడుమ ఘర్షణకు గురై.. తలుపులు మూసేసుకున్న జనాలను అక్కున చేర్చుకుని సర్కారు అభివృద్ధిలో తమ వాటాను వారు అందుకునేలా చేస్తున్న ఆ కూతుళ్లు.. అక్కాచెల్లెళ్ల గురించి! మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఈ విమెన్ పవర్ గురించి! వివరాల్లోకి వెళ్లేముందు బస్తర్ చరిత్రనూ తెలుసుకుందాం క్లుప్తంగా.." రామాయణంలో దండకారణ్యంగా చెప్పుకునే దట్టమైన అటవీ ప్రాంతం తెలంగాణకు ఆవల ఛత్తీస్‌గఢ్‌లో గోదావరి, ఇంద్రావతి, శబరి నదుల నడుమ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనే అంశాలపై రెండు దశాబ్దాల కిందటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. అక్బర్ కాలంలో తొలిసారి, ఆ తర్వాత బ్రిటిష్ హయాంలో మరోసారి ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకునేందుకు కొంత ప్రయత్నం జరిగింది. అయితే దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రయత్నాలు తుదివరకు సాగలేదు. ఇక్కడి ఆదివాసీ తెగ ప్రజలకు అడవే లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. వీళ్లకు దేవుడైనా, దయ్యమైనా ప్రకృతే! ఆ తర్వాత బ్రిటిష్ వారి రాక, వారు రూపొందించిన కఠినమైన చట్టాల ఆసరాతో అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి అడుగు పెట్టారు. దీంతో ఆదివాసీలపై అటవీశాఖ ఆగడాలు శ్రుతి మించాయి. అటవీశాఖ సిబ్బంది అంటే అడవుల్లో ఆదివాసీల జీవనానికి అడ్డుతగిలే వారుగా ముద్ర పడిపోయారు. జనతన సర్కార్.. తెలంగాణలో 1980వ దశకంలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెలు అన్నలకు అడ్డాలుగా మారాయి. ఇదే క్రమంలో 1982లో కొందరు మావోయిస్ట్‌లు ఏటూరునాగారం వద్ద గోదావరి తీరం దాటి బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయారు. అటవీశాఖ సిబ్బంది అణచివేతతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచారు. వారు మాట్లాడే భాష నేర్చుకున్నారు. వారి తిండికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆదివాసీలను ఐక్యం చేసి, అటవీశాఖ సిబ్బంది ఆగడాలను నిలదీయడం నేర్పారు. ఫలితంగా ఈ శతాబ్దం ఆరంభానికి వచ్చేసరికి ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 92 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించిన బస్తర్ ఏరియా అన్నల నీడలోకి వెళ్లింది. గ్రామాల వారీగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన విద్య, వైద్య, రక్షణ కమిటీలు పరిపాలనలో చురుగ్గా వ్యవహరించసాగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యేటప్పటికి బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అనధికారిక పాలకులుగా మారారు. బస్తర్‌తో బంధం.. 'ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయులు తమ రాజధాని ఏకశిలా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గోదావరి తీరం దాటి ఇంద్రావతి ఒడ్డున విస్తరించిన అడవుల్లోకి వెళ్లి, బస్తర్ కేంద్రంగా మరో రాజ్యాన్ని స్థాపించారు. రాచరిక పాలన అంతమైనా నేటికీ అక్కడ మన కాకతీయుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడే భావజాల వ్యాప్తిలో భాగంగా ఆనాటి అన్నలు గోదావరి తీరం దాటి బస్తర్లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సహకారంతో జనతన సర్కార్‌ను నడిపించడం ప్రారంభించారు. కాలాలు మారినా అలా బస్తర్‌తో తెలుగువారికి బంధం కొనసాగుతూనే ఉంది.' సల్వాజుడుం.. ఆరంభంలో బాగున్నా, బస్తర్ అడవులు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. అడవుల్లోని గ్రామాలకు సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆధునాతన విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ్స అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అడవుల్లోకి అభివృద్ధిని తెస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అడవుల్లోని సహాజ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు అడవుల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయంటూ మావోయిస్ట్‌లు ఎదురుతిరిగారు. దీంతో మావోయిస్ట్‌ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిదశలో 2005లో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అప్పటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. అయితే అది వికటించి, అడవుల్లో అన్నలకు మరింత పట్టు పెరిగింది. దాంతో అటవీశాఖ సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీన్‌హంట్.. 2012లో బస్తర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ గిరిజనులు మావోయిస్ట్‌లనే తమ పాలకులుగా భావిస్తున్నారని తేలింది. ఈ ఫలితం సంచలనం రేపింది. దాంతో మావోయిస్ట్‌లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. కేవలం మావోయిస్ట్‌ల కోసమే కోబ్రా దళాలను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)ని ఏర్పాటు చేసింది. బస్తర్ పరిధిలో ఉన్న సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు ఎలాగైనా అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంగా ఉక్కుపాదాలతో ముందుకు సాగింది ప్రభుత్వ యంత్రాంగం. ఫలితంగా గత పదిహేనేళ్లుగా గోదావరి, ఇంద్రావతి, శబరి నదులు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని పచ్చని అడవులు మరింతగా రక్తసిక్తమయ్యాయి. ఇబ్బంది లేదు.. 'చిన్నప్పుడే మావోయిస్టుల్లో కలసిపోయాను. ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవితం గడచింది. అక్కడ అనారోగ్యం పాలయ్యాను. నేనక్కడ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇక్కడ నా కుటుంబానికి అండగా ఎవరూ లేరు. దాంతో అడవుల్లోంచి బయటకు వచ్చాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్‌లో మహిళా కమెండోగా పని చేస్తున్నాను. నా కుటుంబానికి అండగా ఉంటున్నాను. అలవాటైన పని కావడంతో ఆయు«ధంతో అడవుల్లో పని చేయడం ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు.' – సబిత (పేరు మార్చాం) మహిళా కమెండో భయం నీడన.. మైదానప్రాంత గిరిజనులు సైతం ఇతరులతో అంత సులువుగా కలసిపోరు. ఇక కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలైతే తమ గ్రామాల దగ్గరికి ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే ముడుచుకుపోతారు. అలాంటిది ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్ ధరించి ఆయుధాలతో వచ్చిన భద్రతా దళాలను చూసేసరికి మరింతగా కుంచించుకుపోయారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు గిరిజనుల నుంచి కనీస సమాచారం అందడం కూడా దుర్లభమైంది. అడవుల్లో తమను చూసి బెదిరిపోయే ఆదివాసీలు.. మావోయిస్ట్‌లకు అండగా ఉంటున్నారనే అపోహ భద్రతా దళాల్లో పెరిగిపోయింది. బలవంతంగా తమ నోరు విప్పించేందుకు భద్రతా దళాలు చేసే ప్రయత్నాలు ఆదివాసీలను మరింతగా బెదరగొట్టాయి. దాంతో ఇటు భద్రతా దళాలు, అటు ఆదీవాసీలు ఒకనొకరు విశ్వసించుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎదురు కాల్పులు, కోవర్టుల ఘాతుకాలు, ఇన్ ఫార్మర్ల హత్యలతో హింసాకాండ పెరిగింది. హక్కుల ఉల్లంఘన దట్టమైన అడవుల్లోకి వెళ్లినప్పుడు సెర్చింగ్ పేరుతో ఆదివాసీ గూడేలపై అకృత్యాలకు, అమానవీయ చర్యలకు పాల్పాడుతున్నారనే ఆరోపణలు భద్రతా దళాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా కమెండోల (మగవాళ్లు) చర్యలు ఉంటున్నాయనే విమర్శలు పెల్లుబికాయి. భద్రతా దళాలను చూస్తేనే ఆదివాసీ గూడేలు గడగడలాడిపోతున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అప్పటికే చెలరేగుతున్న హింసకు మానవ హక్కుల హననం అనే ఆరోపణలు తోడవడంతో ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. మానవీయ కోణం.. భద్రతా దళాల సంఖ్యను పెంచినా, అధునాతన ఆయుధాలు అందించినా.. సరికొత్త వ్యూహాలను అమలు చేసినా అడవుల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యపడలేదు ప్రభుత్వాలకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఆయుధాలతో ఆదివాసీల మనసులను గెలుచుకోవడం కష్టమని భావించారు అధికారులు. దాంతో తమ పట్ల, తాము వినిపిస్తున్న అభివృద్ధి నినాదం పట్ల గిరిజనానికి విశ్వాసం కలగాలంటే వారిపట్ల సహానుభూతి అవసరమని గ్రహించారు. మానవీయకోణం లేని ప్రయత్నాలు వ్యర్థమని అర్థం చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనే నినాదానికి మానవీయ కోణం జత చేయాలనే వ్యూహానికి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చారు. దంతేవాడలో తొలి అడుగు! పారా మిలటరీ దళాల్లో మహిళలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నంత ఈజీగా అమలు సాగలేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కష్ట సాధ్యమైంది. అప్పటికే మావోయిస్ట్‌లు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో వందల మంది చనిపోయారు. దాంతో ఆలివ్‌గ్రీన్ దుస్తులు ధరించి, భుజాన తుపాకి మోసేందుకు ముందుకొచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంతే మిగిలారు. ఆ వచ్చిన కొద్దిమంది కూడా అప్పటికే అక్కడ చెలరేగుతున్న హింసలో పెద్దదిక్కును కోల్పోయిన వారు, లొంగిపోయిన మావోయిస్టులే! అలా 2019లో దంతెవాడ జిల్లాలో తొలి విమెన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళం ఏర్పడింది. మూడు నెలల శిక్షణ ఫ్రంట్ లైన్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్‌లో భాగంగా ప్రారంభమైన తొలి దళంలో పదిమంది లొంగిపోయిన మహిళా మావోయిస్టులు, పదిమంది సల్వాజుడుం పూర్వసభ్యులు ఉండగా మిగిలిన పదిమంది రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నియమితులయ్యారు. అలా మొత్తం ముపై ్ప మందిని తీసుకున్నారు. మావోయిస్ట్‌లకు వ్యతిరేకంగా చేపట్టే జంగిల్ వార్ఫేర్లో వారికి మూడు నెలల కఠిన శిక్షణ ఇచ్చారు. దాంతోపాటుగా దట్టమైన అడవుల్లో సురక్షితంగా వాహనాలు నడపడం, మ్యాప్ రీడింగ్, కౌంటర్ ఆంబుష్ స్ట్రాటజీ, ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ నేతల ప్రొఫైల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారువేషాల్లో మెరుపుదాడులు చేయడంలోనూ మెలకువలు నేర్పించి, కార్యక్షేత్రంలోకి దింపారు. అర్థం చేసుకోవడం తేలిక.. 'నేను ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ మహిళను. గతంలో మా గ్రామంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వస్తే గ్రామమంతా వణికిపోయేది. ఆ భయం నుంచే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అడవిబాట పట్టాం. ఇప్పుడు భద్రతాదళంలో మహిళా కమెండోగా పని చేస్తున్నా. భద్రతా దళాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజల మానసిక స్థితి ముఖ్యంగా మహిళలు ఎలా భయపడతారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టి భరోసా కల్పించడం ఎలాగో మాకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అందువల్లే మహిళా కమెండోలు వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు, భద్రతా దళాలకు మధ్య సంబంధాలు∙మెరుగవుతున్నాయి గతంతో పోలిస్తే!' – జయంతి (పేరు మార్చాం) మహిళా కమెండో మహిళా కమెండోలు.. ఈ మహిళా దళ సభ్యులను బృందాలుగా వేరు చేస్తారు. వీరు మెన్ స్క్వాడ్ కూంబింగ్‌కు వెళ్లినప్పుడు వారి వెంట అడవుల్లోకి వెళ్తారు. ఉదాహరణకు పాతిక మంది కమెండోల బృందం అడవుల్లోకి వెళితే అందులో నలుగురైదురుగు మహిళా కమెండోలు ఉండేలా కూర్పు చేశారు. వీరు అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు, దారిలో ఏదైనా గూడెం వస్తే మహిళా కమెండోలు గూడెం లోపలికి వెళ్తారు. అక్కడున్న వారితో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తీర్చగలిగే సమస్య అయితే అక్కడిక్కడే తమ సామర్థ్యం మేరకు పరిష్కారం చూపుతారు. అక్కడికి రావడం వెనుక తమ ఉద్దేశం ఏంటో చెబుతారు, సహకరించాలని కోరుతారు. స్త్రీల సమస్యలు.. మహిళా కమెండోలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లిళ్లు, పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడే ఛత్తీస్‌గఢ్ మహిళలు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత, గైనిక్ సమస్యలపై తమకున్న అవగాహన మేరకు వారికి తోడ్పాటును అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి తమ కిట్లలో ఉండే మాత్రలు, టానిక్స్‌ను వారికి అందిస్తుంటారు. దీంతో బస్తర్ ప్రాంతంలోని ప్రజలకు భద్రతా దళాలపై ఉండే అపారమైన భయం స్థానంలో క్రమంగా నమ్మకం చిగురించసాగింది. మార్పు మొదలైంది.. మహిళా కమెండోలు వచ్చాక మార్పు మొదలైందంటున్నారు ఛత్తీస్‌గఢ్ గ్రామీణులు. ‘ఇంతకుముందు భద్రతా దళాలు మా ఊళ్లవైపు వస్తున్నాయని తెలిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం అడవుల్లోకి పరుగెట్టేవాళ్లం. ఆరోగ్యం బాగాలేని వారు, ముసలి వాళ్లు మాత్రమే ఊళ్లల్లో ఉండేవారు. భద్రతా దళాలు మా ఊళ్లను విడిచిపెట్టాయని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. అయితే వాళ్లు వస్తున్నారని తెలిసి ఉన్నపళంగా ఊరంతా ఖాళీ అయ్యేసరికి ఏదో జరగబోతోందనే అనుమానంతో జవాన్లు ఊళ్లల్లోనే తిష్టవేసే వాళ్లు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారంటూ ఊళ్లల్లో ఉన్న వారిని గదమాయించే వారు. దాంతో మా పల్లెల్లో ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ మహిళా కమెండోలు వచ్చిన తర్వాత భద్రతా దళాల మాటతీరులో మార్పు వచ్చింది. మా మీద భద్రతా దళాలకు చెందిన మగ కమెండోలు దాష్టీకాలు చేయకుండా అడ్డుకునే మహిళా కమెండోలు ఉన్నారనే నమ్మకం కలిగింది. మా బాధలు చెబితే అర్థం చేసుకునే మనుషులకు భద్రతా దళాల్లో స్థానం ఉందనే భరోసా వచ్చింది. రోజులు గడిచే కొద్దీ, నెలలు ముగిసే కొద్దీ భద్రతా దళాలను చూసి అడవుల్లోకి పారిపోయే పరిస్థితి తగ్గిపోయింది. సర్కారుకు, మాకు మధ్య వారధిగా నిలుస్తున్నారు మహిళా జవాన్లు’ అని చెప్పుకొచ్చారు స్థానిక జనం. పట్టాలపైకి అభివృద్ధి! చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజలతో భద్రతా దళాలు మమేకం అవడం మొదలైన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ముందుగా మహిళా జవాన్లతో కూడిన భద్రతా దళాలు అడవుల్లోకి వెళ్లి, వాళ్లు అక్కడి ప్రజలతో కలసిపోతారు. ఆ తర్వాత అక్కడ భద్రతా దళాల క్యాంప్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఆ గ్రామానికి కరెంటు వస్తుంది. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు మొదలవుతాయి. వీటికి సమాంతరంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ కొంతమంది సభ్యులను ఉంచేసి మిగిలిన దళ సభ్యులు ముందుకు సాగుతారు. రోడ్డు, కరెంటు సౌకర్యాలు వచ్చిన గ్రామాల్లోకి దశల వారీగా స్కూళ్లు, ఆస్పత్రులు తదితర వసతులూ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. మానవ హక్కుల సంఘాల ఆరోపణలూ అంతగా వినిపించడంలేదని పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల విధుల్లో.. బస్తర్ ప్రాంతంగా చెప్పుకునే ఏడు జిల్లాల పరిధిలో మహిళా కమెండోలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహిళా దళాల్లో చేరే వారికి పద్దెనిమిది నెలల శిక్షణ కాలాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 450 మందికి పైగా మహిళా కమెండోలు ఛత్తీస్‌గఢ్‌లో పని చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. దట్టమైన అడవుల్లో ఉన్న 35 పోలింగ్ బూత్‌ల రక్షణ బాధ్యతను మహిళా కమెండోలకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఆ 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి. ఆదివాసీలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘనత మహిళా కమెండోలదే! మహారాష్ట్రలో.. ఛత్తీస్‌గఢ్‌లో మహిళా కమెండోలు తెచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలనూ ఆలోచింపచేసింది. దండకారణ్యంలో భాగంగా ఉండే మçహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ మహిళా కమెండో దళాన్ని నెలకొల్పారు. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ దళం గడ్చిరోలి జిల్లా వంగేటూరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, దేశ సైనికదళంలోనూ మహిళా కమెండోలు తమ సత్తా చూపిస్తున్నారు. మొత్తానికి.. కరకుదనం ఖాకీ సొత్తు. కరడుగట్టిన కాఠిన్యానికి సైన్యం చిరునామా! ఈ రెండిటితో పరిచయమేలేనిది మహిళ! తోటి వాళ్లను వినగలిగే ఓర్పు, అవతలి వాళ్ల కోణంలోంచి ఆలోచించగలిగే నేర్పు, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోగలిగే దయ, వీటన్నిటినీ మించి ఏటికి ఎదురీదగల ధైర్యంతోనే ఆయుధాలకు సాధ్యం కాని మార్పును తీసుకురాగలిగింది. తూటాలతో దద్దరిల్లిన ప్రాంతంలో సంతోషాల సవ్వళ్లు వినిపించేలా చేస్తోంది. ల్యాండ్ మైన్స్ నాటుకున్న ప్రదేశాల్లో శాంతిని పండించగలుగుతోంది. – కృష్ణగోవింద్ ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
‘కమాండో కాంపిటీషన్స్’లో సత్తా చాటిన ఏపీ
విశాఖ స్పోర్ట్స్: 14వ ఆల్ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్‌గా నిలిచింది. విశాఖలోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీల్లో విజేతలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీపీ మ హేష్ దీక్షిత్ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి. ఆర్పీఎఫ్కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్‌గా మహారాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్ రన్నరప్‌గా రాజస్థాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్ కోర్స్ బెస్ట్ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది. స్మాల్ టీమ్ ఆపరేషన్స్‌కు ఇచ్చే రణ్నీతి ట్రోఫీని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్ హాక్ ఫైరింగ్ ట్రోఫీని 93 మార్కులతో(110కిగానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టులోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్ బోర్డ్ ప్రకటించింది. -
విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు
-
విశాఖలో పోలీస్ కమాండో పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు. విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్‌పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్‌సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్‌లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్‌లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్‌నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. -
అదరం.. బెదరం
అందంగా కనిపించాలి. ప్రేమలో పడాలి. పాటల్లో గ్లామరస్‌గా కనిపించాలి. టైమ్ వచ్చినప్పుడు డైలాగ్స్ చెప్పి సీన్ నుంచి మాయం అవ్వాలి... హీరోయిన్లంటే ఇంతేనా? ఊహూ.. ఆ కాలం పోయింది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ దొరికి, మంచి క్యారెక్టర్ పడితే మేం ఎందులో తక్కవ? అనేలా నటిస్తున్నారు హీరోయిన్లు. అన్నమాటకు కట్టుబడేలా కష్టపడతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు బెదరడం లేదు. పైగా డూప్ లేకండా యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలితే భయపడటం లేదు. సరి కదా లొకేషన్లో షాట్ కంప్లీట్ చేసిన తర్వాతనే హాస్పిటల్‌కి పోదాం అంటున్నారు. ఇటీవల అలా గాయాలపాలైన కొందరు కథానాయికల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో కంగనా రనౌత్ ఎంతటి ప్రతిభాశాలో అంతే ధైర్యశాలి. ఇందుకు సినిమాల్లో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, ఏదైనా విషయం గురించి బాహాటంగా నిర్భయంగా మాట్లాడే తీరు నిదర్శనం. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనారనౌత్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో రెండు సార్లు గాయపడ్డారామె. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు విరగ్గొట్టుకున్నారు. ఒకసారి గాయపడ్డ తర్వాత కూడా యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కంగనా బెదరలేదు. మళ్లీ కత్తి పట్టి, షూట్‌లోకి దూకారు. కాంప్రమైజ్ కాలేదు. మళ్లీ గాయపడ్డారు. ఈసారి కత్తి నుదుట మీద తగిలింది. 16 కుట్లు పడ్డాయి. అయినా కంగనా తగ్గడం లేదు. సేమ్ కమిట్మెంట్తో ఫైట్సీన్స్లో పాల్గొంటున్నారు. మరి.. కంగనానా? మజాకానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది మార్చిలో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్‌కు బర్త్‌డే ముగిసిన రెండు రోజుల్లోనే చేదు అనుభవం ఎదురైంది. బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లొకేషన్లో గాయపడ్డారామె. ఓ యాక్షన్ సీన్ చేసే టైమ్‌లో అదుపు తప్పి చేయి విరగ్గొట్టుకున్నారు కానీ ముఖంపై చిరునవ్వును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజంతా షూటింగ్లో పాల్గొని, సాయంత్రమే లొకేషన్ని వదిలిపెట్టి వెళ్లారు. కమిట్మెంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పారు. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరో బ్యూటీ శ్రద్ధా కపూర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం వెండితెరపై సైనా నెహ్వాల్‌గా చేస్తున్న శ్రద్ధాకపూర్ ఏం చేస్తున్నారో తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఇంతకీ శ్రద్ధాకు జ్వరం రావడానికి కారణం ఏంటంటే.. ‘సైనా’ చిత్రం కోసం శ్రద్ధా బ్యాడ్మింటన్ గేమ్‌కు స్ట్రాంగ్‌గా ప్రిపేర్ కావడమేనట. బాగా అలసిపోయి, జ్వరం తెచ్చుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న ‘సైనా’కు అమోల్ గుప్టే దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్లకన్నా ముందే గాయాల క్లబ్లో చేరారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘రేస్ 3’ సినిమా షూటింగ్ టైమ్‌లో ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సామెతను హిందీలో గుర్తు చేసుకుని ఉండి ఉంటారు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే... ఆ సినిమా సెట్లో జాక్వెలిన్ కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? కెరీర్ క్లోజ్ అయిపోదూ. కానీ ఇంత కష్టపడ్డ జాక్వెలిన్‌కు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘రేస్3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో దిశా పాట్నీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో జిమ్నాస్టిక్స్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారామె. ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ టైమ్‌లో దిశా గాయపడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాది భామలేనా? మన దక్షిణాది భామలకు కూడా బోలెడంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఒకసారి సౌత్‌కు వస్తే... యాక్షన్ సీన్స్‌లో నవ్వులపాలు కాకూడదని డిసైడ్ అయ్యారు అమలాపాల్. అందుకు ఎందాకైనా తెగించాలని డిసైడ్ అయ్యారు. తమిళ సినిమా ‘అదో అంద పరవై పోల’ కోసం అడవిలో నైట్ షూట్‌కి సై అన్నారు. నాలుగైదు రోజులు షూటింగ్ సజావుగానే సాగిందట. కానీ ఓ బ్యాడ్ డే ఓ ఫైట్ సీన్ కోసం ఆమె చేతిని విరగ్గొట్టుకున్నారు. లొకేషన్లో చాలా రక్తం పోయింది. కానీ వెంటనే అమలాపాల్ ఆసుపత్రికి పోలా. ఆ సీన్ షూట్‌ను కంప్లీట్ చేసి, డాక్టర్ రూమ్ డోర్ నాక్ చేశారు. ఈ గాయం గురించి అమలాపాల్ ఏమన్నారో తెలుసా. ‘‘శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోతే హీరో అనిపించుకోలేం’’ అన్నారు. ఇలా అమలాపాల్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్లో కనిపిస్తారామె. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అదా శర్మ అయితే పొరపాటున తన చేతివేలిని తానే చితక్కొట్టుకున్నారు. యాక్షన్ సీన్లో భాగంగా కారు డోర్‌ని విసురుగా వేసేటప్పుడు మరో చేతిని డోర్ మీద నుంచి తీయడం మరచిపోయారు. ఇది ‘కమాండో 3’ సెట్లో జరిగింది. పాపం.. అదాశర్మ నొప్పితో అల్లాడిపోయారు. అయినా టైమ్ వేస్ట్ కానివ్వకుండా షూటింగ్లో పాల్గొన్నారు. అదా ధైర్యం ఉన్న యువతి అని చిత్రబృందం మెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా షూట్లో పాల్గొంటున్నారు. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారీ సినిమాలో .ఈ సినిమాకు విపుల్ షా డైరెక్టర్. అలాగే రాజమండ్రి షెడ్యూల్లో ‘రంగస్థలం’ సినిమా కోసం కంటిన్యూస్‌గా వర్క్ చేయడంతో ఓ రోజు చేతి నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ సినిమా కథానాయిక రామలక్ష్మీ.. అదేనండీ మన సమంత. అంతేనా.. ఈ సినిమా షూట్ వేసవి టైమ్‌లో జరిగినప్పుడు వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయారట. మొన్నా మధ్య గౌతమ్ హీరోగా నటించిన చిత్రం ‘మను’. ఈ సినిమా సెట్‌ను హైదరాబాద్‌కు దూరంగా వేశారు. ఆ సెట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో దాదాపు నెల రోజులు వైరల్ ఫీవర్‌తో షూట్‌కు దూరమైయ్యారు చాందినీ చౌదరి. అలాగే ‘నేల టిక్కెటు’్ట సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మాళవికా శర్మ కూడా సెట్లో గాయపడ్డారు. కానీ ఇది చిన్న గాయమే కావడంతో వెంటనే కోలుకున్నారు. ఇలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కి అయినా∙రెడీ అంటున్నారు ఈ తరం హీరోయిన్లు. పాటలకే కాదు.. ఫైట్స్‌కి కూడా పనికొస్తామని నిరూపించుకుంటున్నారు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. మళ్లీ గాయం అయినా ఫర్వాలేదనుకుంటున్నారు. ‘డోంట్ కేర్’.. ఇది మన హీరోయిన్ల కొత్త నినాదం. అదా శర్మ, అమలా పాల్, కంగనా, జాక్వెలిన్, ఆలియా భట్ -
ప్రేమలో పడ్డారా?
‘కమాండో 3’ సినిమా సెట్లో డాక్టర్ అవతారం ఎత్తారు హీరో విద్యుత్ జమాల్. అదేంటీ... కమాండో సిరీస్‌లో యాక్షన్ హీరోగా చేస్తున్న జమాల్ సడన్‌గా డాక్టర్ పాత్ర చేయడం ఏంటీ? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ఆయన డాక్టర్‌గా మారింది ‘హార్ట్ ఎటాక్’ మూవీ హీరోయిన్ అదా శర్మ కోసం. ఇటీవల ‘కమాండో 3’ సినిమా సెట్లో అదా శర్మ గాయపడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొంటున్నారనుకోండి. కానీ ఆమెకు గాయం అయితే తనకు గాయం అయినట్లుగా విద్యుత్ విలవిలలాడిపోయారట. ఓ డాక్టర్లా జాగ్రత్తలు చెప్పారట. అంతేనా? సెట్లో కెమెరా కోసమే కాదు.. కెమెరా వెనక కూడా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ టాక్. కో–స్టార్స్ అంటే ఆ మాత్రం క్లోజ్‌నెస్ ఉండటంలో తప్పు లేదు. కానీ అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని, అది ప్రేమేనని అంటున్నారు బాలీవుడ్ ఔత్సాహికరాయుళ్లు. మరి.. విద్యుత్, అదా మధ్యలో నిజంగా ప్రేమ చిగురించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. -
బ్యాడ్ లక్
సిల్వర్ స్క్రీన్‌పై యాక్షన్ సన్నివేశాలను చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ యాక్షన్ సీన్స్ వెనక ఆర్టిస్టుల కష్టం దాగి ఉంటుంది. టైమ్ బాగా లేకపోతే యాక్టర్స్‌కి గాయాలు తప్పవు. అలా అదా శర్మ టైమ్ బాగోలేదు. అందుకే ఆమె ‘కమాండో 3’ సెట్లో గాయపడ్డారు. కమాండో ఫ్రాంచైజీలో రూపొందుతున్న థర్డ్ పార్ట్ ఇది. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోని ఓ యాక్షన్ సీన్లో భాగంగా కార్ డోర్ క్లోజ్ చేయబోయే ప్రాసెస్‌లో అదా శర్మ గాయపడ్డారు. ఆమె చిటికెన వేలు చితికిపోయింది. ఈ విషయాన్ని అదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘రెండు చేతులకు కలపి తొమ్మిది వేళ్లు ఉన్నా కూడా నన్ను లవ్ చేస్తారు కదూ. దేవుడి దయ వల్ల ఆ మిగిలిన వేలు కూడా ఇంకా నా బాడీలో భాగమై ఉంది’’ అని పేర్కొన్నారు అదా శర్మ. ‘‘నిజానికి అదా శర్మ గాయపడ్డప్పుడు చాలా రక్తం పోయింది. కానీ ఆమె వెంటనే హస్పిటల్‌కి వెళ్లకుండా లొకేషన్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షూట్లో పాల్గొన్నారు. అదాకి ఇలా గాయం కావడం బ్యాడ్‌లక్’’ అని టీమ్ పేర్కొంది. -
ఆర్మీ కమాండర్ గోస్వామి మృతి
శ్రీనగర్: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భారత ఆర్మీకి చెందిన కమాండర్ లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి తన ప్రాణాలు కోల్పోయాడు. పదకొండు రోజుల్లో 10 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ ప్రత్యేక దళాల కమాండర్ నాయక్ గోస్వామి.. మరికొంతమంది ఉగ్రవాదులన్ని మట్టుబెట్టే యత్నంలో హంద్వారాలో గురువారం తుదిశ్వాస విడిచాడు. మొత్తం మూడు ఎన్ కౌంటర్లలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాడు. అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు. భారత రక్షణ దళాలు గోస్వామికి ఘనమైన నివాళులు అర్పించాయి. 2002 లో ఆర్మీలో పెరా కమాండోల విభాగంలో జాయిన్ అయిన గోస్వామి.. ఆ తరువాత ప్రమోషన్ పై ఆర్మీ ప్రత్యేక దళాల కమాండోల విభాగంలోకి మారాడు. గత నెల 23 వ తేదీ నుంచి జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ లో గోస్వామి చురుగ్గా పాల్గొన్నాడు. పదకొండు రోజుల్లో పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు. -
అగ్నిశక్తి!
వారి చేతల్లో శక్తిసామర్థ్యాలు కనిపిస్తాయి. వారి మాటల్లో పట్టుదల ప్రతిధ్వనిస్తుంది. ఇటీవలే జార్ఖండ్‌లోని కాన్కెర్ జిల్లాలో ‘సిటిజెడబ్ల్యూసి’(కౌంటర్ టైజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 44 మంది మహిళలతో మాట్లాడితే నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్లే అనిపిస్తుంది. ఇందులో చాలామంది మహిళలు గ్రామాలు, పేదకుటుంబాల నుంచి వచ్చిన వారే. నలభై అయిదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకొని ‘కమెండో’ సర్టిఫికెట్ తీసుకున్న ఒక మహిళా ఆఫీసర్‌ను కదిలిస్తే-‘‘అడవిలోని గెరిల్లాలతో గెరిల్లాగా పోరాడడానికి మాలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు’’ అన్నారు. నాయకత్వ లక్షణాలలాంటి మానసిక విషయాలతో పాటు లైట్ మెషిన్ గన్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్, ఎకె-47 రైఫిల్స్, అండర్-బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, మోర్టార్స్, లైట్ వెపన్స్, హ్యాండ్గ్రానేడ్స్... తదితర అంశాల్లో ఆయుధశిక్షణ తీసుకున్నారు మహిళా కమెండోలు. - ‘‘నేను శ్రీమతి సరస్వతి నిషాద్ నుంచి కమెండో నిషాద్గా మారిపోయాను’’ అన్నారు ఇరవై ఆరు సంవత్సరాల సరస్వతి గర్వంగా. - సరస్వతి మాత్రమే కాదు మిగిలిన 43 మంది కూడా తమను తాము కొత్తగా చూసుకుంటున్నారు. - ‘సబల’ అని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కృతజ్ఞతాభివందనాలు శనివారం... హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జెఆర్సి కన్వెన్షన్ హాలులో సాక్షి మీడియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ‘ఉమెన్స్ డే సెలబ్రేషన్స్’లో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించిన పురస్కారాలను (అమ్మ, అర్ధాంగి, మహిళా రైతు) ‘ఉమెన్స్ వరల్డ్’ సమర్పించి, సహాయసహకారాలను అందించింది. వీరితోపాటు 91.1 ఎఫ్.ఎం. రేడియో సిటీ, జెఆర్సి కన్వెన్షన్స్ అండ్ ట్రేడ్ ఫేర్స్, నేచురల్స్ (ఇండియాస్ నెం.1 హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్), అనూస్... వేడుకల విజయానికి తమవంతు తోడ్పాటు అందించారు. వీరందరికీ ‘సాక్షి’ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తోంది.