కంగనా రనౌత్, సమంత, అమలా పాల్, జాక్వెలిన్, అదా శర్మ
అందంగా కనిపించాలి. ప్రేమలో పడాలి. పాటల్లో గ్లామరస్‌గా కనిపించాలి. టైమ్ వచ్చినప్పుడు డైలాగ్స్ చెప్పి సీన్ నుంచి మాయం అవ్వాలి... హీరోయిన్లంటే ఇంతేనా? ఊహూ.. ఆ కాలం పోయింది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ దొరికి, మంచి క్యారెక్టర్ పడితే మేం ఎందులో తక్కవ? అనేలా నటిస్తున్నారు హీరోయిన్లు. అన్నమాటకు కట్టుబడేలా కష్టపడతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు బెదరడం లేదు. పైగా డూప్ లేకండా యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలితే భయపడటం లేదు. సరి కదా లొకేషన్‌లో షాట్ కంప్లీట్ చేసిన తర్వాతనే హాస్పిటల్‌కి పోదాం అంటున్నారు. ఇటీవల అలా గాయాలపాలైన కొందరు కథానాయికల గురించి తెలుసుకుందాం.
బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ఎంతటి ప్రతిభాశాలో అంతే ధైర్యశాలి. ఇందుకు సినిమాల్లో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, ఏదైనా విషయం గురించి బాహాటంగా నిర్భయంగా మాట్లాడే తీరు నిదర్శనం. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనారనౌత్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో రెండు సార్లు గాయపడ్డారామె. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు విరగ్గొట్టుకున్నారు.
ఒకసారి గాయపడ్డ తర్వాత కూడా యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కంగనా బెదరలేదు. మళ్లీ కత్తి పట్టి, షూట్‌లోకి దూకారు. కాంప్రమైజ్ కాలేదు. మళ్లీ గాయపడ్డారు. ఈసారి కత్తి నుదుట మీద తగిలింది. 16 కుట్లు పడ్డాయి. అయినా కంగనా తగ్గడం లేదు. సేమ్ కమిట్‌మెంట్‌తో ఫైట్‌సీన్స్‌లో పాల్గొంటున్నారు. మరి.. కంగనానా? మజాకానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ సెట్‌లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది.
ఇక, ఈ ఏడాది మార్చిలో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్‌కు బర్త్‌డే ముగిసిన రెండు రోజుల్లోనే చేదు అనుభవం ఎదురైంది. బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లొకేషన్‌లో గాయపడ్డారామె. ఓ యాక్షన్ సీన్ చేసే టైమ్‌లో అదుపు తప్పి చేయి విరగ్గొట్టుకున్నారు కానీ ముఖంపై చిరునవ్వును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజంతా షూటింగ్‌లో పాల్గొని, సాయంత్రమే లొకేషన్‌ని వదిలిపెట్టి వెళ్లారు. కమిట్‌మెంట్‌లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పారు. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
మరో బ్యూటీ శ్రద్ధా కపూర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం వెండితెరపై సైనా నెహ్వాల్‌గా చేస్తున్న శ్రద్ధాకపూర్ ఏం చేస్తున్నారో తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఇంతకీ శ్రద్ధాకు జ్వరం రావడానికి కారణం ఏంటంటే.. ‘సైనా’ చిత్రం కోసం శ్రద్ధా బ్యాడ్మింటన్ గేమ్‌కు స్ట్రాంగ్‌గా ప్రిపేర్ కావడమేనట. బాగా అలసిపోయి, జ్వరం తెచ్చుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న ‘సైనా’కు అమోల్ గుప్టే దర్శకత్వం వహిస్తున్నారు.
వీళ్లకన్నా ముందే గాయాల క్లబ్‌లో చేరారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘రేస్ 3’ సినిమా షూటింగ్ టైమ్‌లో ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సామెతను హిందీలో గుర్తు చేసుకుని ఉండి ఉంటారు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే... ఆ సినిమా సెట్‌లో జాక్వెలిన్ కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? కెరీర్ క్లోజ్ అయిపోదూ. కానీ ఇంత కష్టపడ్డ జాక్వెలిన్‌కు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘రేస్3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో దిశా పాట్నీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో జిమ్నాస్టిక్స్ చేసే క్యారెక్టర్‌లో నటిస్తున్నారామె. ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ టైమ్‌లో దిశా గాయపడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఉత్తరాది భామలేనా? మన దక్షిణాది భామలకు కూడా బోలెడంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఒకసారి సౌత్‌కు వస్తే... యాక్షన్ సీన్స్‌లో నవ్వులపాలు కాకూడదని డిసైడ్ అయ్యారు అమలాపాల్. అందుకు ఎందాకైనా తెగించాలని డిసైడ్ అయ్యారు. తమిళ సినిమా ‘అదో అంద పరవై పోల’ కోసం అడవిలో నైట్ షూట్‌కి సై అన్నారు. నాలుగైదు రోజులు షూటింగ్ సజావుగానే సాగిందట. కానీ ఓ బ్యాడ్ డే ఓ ఫైట్ సీన్ కోసం ఆమె చేతిని విరగ్గొట్టుకున్నారు. లొకేషన్‌లో చాలా రక్తం పోయింది. కానీ వెంటనే అమలాపాల్ ఆసుపత్రికి పోలా. ఆ సీన్ షూట్‌ను కంప్లీట్ చేసి, డాక్టర్ రూమ్ డోర్ నాక్ చేశారు. ఈ గాయం గురించి అమలాపాల్ ఏమన్నారో తెలుసా. ‘‘శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోతే హీరో అనిపించుకోలేం’’ అన్నారు. ఇలా అమలాపాల్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారామె. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక అదా శర్మ అయితే పొరపాటున తన చేతివేలిని తానే చితక్కొట్టుకున్నారు. యాక్షన్ సీన్‌లో భాగంగా కారు డోర్‌ని విసురుగా వేసేటప్పుడు మరో చేతిని డోర్ మీద నుంచి తీయడం మరచిపోయారు. ఇది ‘కమాండో 3’ సెట్‌లో జరిగింది. పాపం.. అదాశర్మ నొప్పితో అల్లాడిపోయారు. అయినా టైమ్ వేస్ట్ కానివ్వకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. అదా ధైర్యం ఉన్న యువతి అని చిత్రబృందం మెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా షూట్‌లో పాల్గొంటున్నారు. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారీ సినిమాలో .ఈ సినిమాకు విపుల్ షా డైరెక్టర్. అలాగే రాజమండ్రి షెడ్యూల్‌లో ‘రంగస్థలం’ సినిమా కోసం కంటిన్యూస్‌గా వర్క్ చేయడంతో ఓ రోజు చేతి నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ సినిమా కథానాయిక రామలక్ష్మీ.. అదేనండీ మన సమంత. అంతేనా.. ఈ సినిమా షూట్ వేసవి టైమ్‌లో జరిగినప్పుడు వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయారట.
మొన్నా మధ్య గౌతమ్ హీరోగా నటించిన చిత్రం ‘మను’. ఈ సినిమా సెట్‌ను హైదరాబాద్‌కు దూరంగా వేశారు. ఆ సెట్‌లో దోమలు ఎక్కువగా ఉండటంతో దాదాపు నెల రోజులు వైరల్ ఫీవర్‌తో షూట్‌కు దూరమైయ్యారు చాందినీ చౌదరి. అలాగే ‘నేల టిక్కెటు’్ట సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మాళవికా శర్మ కూడా సెట్‌లో గాయపడ్డారు. కానీ ఇది చిన్న గాయమే కావడంతో వెంటనే కోలుకున్నారు.
ఇలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కి అయినా∙రెడీ అంటున్నారు ఈ తరం హీరోయిన్లు. పాటలకే కాదు.. ఫైట్స్‌కి కూడా పనికొస్తామని నిరూపించుకుంటున్నారు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. మళ్లీ గాయం అయినా ఫర్వాలేదనుకుంటున్నారు.
‘డోంట్ కేర్’.. ఇది మన హీరోయిన్ల కొత్త నినాదం.
అదా శర్మ, అమలా పాల్, కంగనా, జాక్వెలిన్, ఆలియా భట్
Comments
Please login to add a commentAdd a comment