
నేడు నేషనల్ స్పేస్ డే
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.
‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో అన్నపూరణి పాలుపంచుకుంది.
కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్‌డీ చేసింది. పీహెచ్‌డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.
‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్‌స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.
‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్‌స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా!
Comments
Please login to add a commentAdd a comment