Clay Art
-
ఇష్టాన్నే ఉపాధిగా మార్చుకున్న గృహిణి.. ఆదాయంతో పాటు అవార్డులు కూడా
ఇష్టంగా నేర్చుకోవాలే కానీ మట్టి కూడా పాఠాలు నేర్పుతుంది. కొత్త ఆవిష్కరణలతో పాటు ఉపాధికీ బాటలు వేస్తుంది. హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో ఉంటున్న సంగిశెట్టి సంగీత తన కళ ద్వారా ఈ విషయాన్ని మనందరికీ చాటుతోంది. సరదాగా నేర్చుకున్న కళ ద్వారా ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ‘‘కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్స్.. ఆర్టిస్ట్‌గా నాకు నేను గుర్తింపు సంపాదించుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. నేటి రోజులకు తగినట్టు స్టాచ్యూ, త్రీడీ ఎఫెక్ట్స్, క్యూబిజమ్, జపనీస్ ఆర్ట్, మల్టీపర్పస్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారుచేస్తుంటాను. ఇవన్నీ మట్టితో రూపొందించేవే. ఎకో, పాటరీ క్లే, పాలిమర్ క్లే, మోడలింగ్ క్లేతో కళారూపాల రూపకల్పన ఉంటుంది. ఇవి ఎప్పటికీ పాడవవు. నీటిలో కరగవు, కిందపడినా పగిలిపోవు. ఇల్లు, ఆఫీసులలో అలంకరణ వస్తువులుగా క్లే ఆర్ట్ కళాకృతులను ఎక్కువ వినియోగిస్తుంటారు. డిజైన్ బట్టి ధర ఉంటుంది. రెయిజన్ మెటీరియల్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, షాడో బాక్స్‌లు.. పెళ్లి, పుట్టిన రోజులు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆర్డర్స్‌ని బట్టి డిజైన్స్ చేస్తుంటాను. పెన్సిల్, చార్కోల్, మ్యూరల్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా నా రోజు వారి వర్క్‌లో భాగమే. వర్క్‌షాప్స్ ఎం.కామ్. వరకు చదువుకున్నాను. పెళ్లి, పిల్లలు జీవితంలో ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకొని, హాబీకే టైమ్ కేటాయించాను. ఇదే ఉపాధిగా మారుతుందని ముందు అనుకోలేదు. కానీ, ఇష్టమైన పనే ఆదాయమార్గాన్ని కూడా చూపిస్తుందని వచ్చిన ఆర్డర్స్ ద్వారా అర్థమైంది. ‘డూడుల్ బగ్స్ పేరుతో ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశాను. ఆన్లైన్ ద్వారా అమెరికా, కెనడాలోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు గృహిణులు గ్రూపుగా ఏర్పడి తమకు ఈ క్లే ఆర్ట్ నేర్పించమని అడుగుతారు. ఐదారుగురు గ్రూప్‌గా ఉన్నా వారి కోసం వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటాను. ఇప్పటికి వందల సంఖ్యలో మహిళలు శిక్షణ తీసుకున్నవారున్నారు. ప్రతిరోజూ సాయంకాలాలు క్లే ఆర్ట్ ట్రెయినింగ్ క్లాసులు తీసుకుంటాను. వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు ఇస్తుంటాను. రికార్డులు తెచ్చిన ఆర్ట్ రెండేళ్ళ క్రితం పిస్తా పొట్టుపై చేసిన మైక్రో క్లే ఆర్ట్ మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. పండ్లు, కూరగాయలు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు 150 కంటే ఎక్కువ రకాలు పిస్తాపొట్టుపై 74 గంటలలో చేసి చూపించాను. ఈ సూక్ష్మ కళా నైపుణ్యాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు వచ్చేలా చేసింది. వర్చువల్ అవార్డులూ వరించాయి. సాధనమున.. ఆసక్తి ఉండి, ఫీజు చెల్లించలేం అనుకునేవారికి మెటీరియల్ ఇచ్చి మరీ ఈ వర్క్స్ నేర్పిస్తుంటాను. ఏ కళ అయినా సాధన చేస్తూ ఉంటే కొత్త కొత్త నైపుణ్యాలు వచ్చి చేరుతాయి. అవే ఉపాధికి మార్గం చూపుతాయి. అందుకే, వర్క్ నేర్చుకున్నవాళ్లను మోటివేట్ చేస్తూ, తమను తాము బిల్డ్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తుంటాను. నాకు ఇష్టమైన పని కావడంతో మరింత కొత్తదనం కోసం సాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కళారంగంలో ఇష్టమే పెట్టుబడి అవుతుంది’’ అని వివరిస్తుంది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
Home Decoration: ‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయకండి!
‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయడానికి లేదు. మట్టి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మట్టికి అద్దం కూడా తోడైతే చూడ్డానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. అలాంటి కళ పేరే లిప్పన్ ఆర్ట్. ఇది కచ్ ప్రజల మనసు కళ. మట్టి–అద్దాలతో కలసిన ఈ ఆర్ట్‌పీస్‌లు ఇంటి గోడలను అందంగా చూపిస్తున్నాయి. మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కళ కచ్ శివారు గ్రామాల్లోని బంజరు భూముల గుండా వెళుతున్నప్పుడు అద్దాలతో అలంకరించిన మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇళ్లల్లోని మహిళల చేతుల్లోనే ఈ లిప్పన్ ఆర్ట్ కనపడుతుంది.. ఇలా మట్టి కళా రూపాలుగా. విశేషమేమంటే వీటి తయారీలో ఎలాంటి అచ్చులను, మూసలను ఉపయోగించరు. క్లిష్టమైన సౌందర్యం మడ్ మిర్రర్ వర్క్.. దాని సౌందర్యం ఆధునిక ప్రపంచపు దృష్టినీ ఆకర్షిస్తోంది. పట్టణాల్లోని ఇంటి గోడలపైన అందంగా మెరిసిపోతోంది. నిరాడంబరమైన ఈ ఆర్ట్ ఆడంబరంగా వెలిగిపోతోందిప్పుడు. ఎలా చేస్తారంటే.. లిప్పన్ ఆర్ట్‌కు డిమాండ్ పెరగడంతో తయారీ తీరు మారింది. ఎలాగంటే.. ముందు.. ప్లైవుడ్ పైన పెన్సిల్‌తో డిజైన్ గీస్తారు. తర్వాత మెత్తని మట్టిని నీటితో కలిపి... దాన్ని డిజైన్‌కి అనుగుణంగా పూసి, దానిపై అద్దాలు అతికించి.. రంగులు వేస్తారు. ఇది చాలా నైపుణ్యంతో కూడుకున్న పని కావడంతో ఈ శైలి అరుదైన కళగా ఆకట్టుకుంటోంది. చదవండి: ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు
చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది.. క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్‌కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది. అలంకార వస్తువులు మినియేచర్స్తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్‌లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి. ప్రశంసలే స్ఫూర్తిగా... క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె తయారు చేసిన మినియేచర్స్ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత. అందమైన ఎంపిక మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. – స్ఫూర్తి – ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి -
టైట తళుకులు
విశాఖ వాసులకు సరికొత్త నగలు ‘క్లే ఆర్ట్’లో మాధురి రాణింపు ఇంటి నుంచే మార్కెటింగ్ ఆదర్శంగా నిలుస్తున్న మహిళ విశాఖపట్నం: ఆమె.. అనుబంధాలు పెనవేసుకున్న గృహిణి. పరిణితి చెందిన వ్యక్తిత్వం ఉన్న మహిళ. ఇతరులపై ఆధారపడకుండా జీవించాలని చెబుతున్న ధీరోధాత్త.. మట్టితో అద్భుతాలు సృష్టిస్తున్న కళాకారిణి. సామాజిక మాధ్యమాన్ని మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్న బిజినెస్ వుమెన్. ఆమే దొమ్మేటి మాధురి. ఊరు విజయరామరాజుపేట మండలం బుచ్చెయ్యపేట. మాధురి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర బోడసకుర్రులో జన్మించినప్పటికీ.. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. విశాఖ, హైదరాబాదులో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తిరుమల రెడ్డి జగదీష్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ...కానీ.. ఎక్కడో వెలితి.. తన గమ్యం ఇది కాదనే ఆలోచన ఆమెను అనుక్షణం తొలచివేసేది. ఉద్యోగం చేసే అవకాశం లేదు. అలాగని ఏమీ చేయకుండా ఉండిపోవడం తన నైజం కాదు. అలాంటి సమయంలో ఇంటర్నెట్ ఆమెకు దారి చూపించింది. అంతులేని వెబ్సైట్లలో ఓ ఫొటో ఆమెను కట్టిపడేసింది. లోతుగా చూస్తే ఆ ఫొటోలో కనిపిస్తున్న నగ బంగారం, ఇతర ఖనిజాలతో తయారు చేసింది కాదని అర్థమైంది. తాను చూసిన నగ మట్టితో రూపొందిందని తెలిసి ఆశ్చర్యపోయారామె. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. గంటలు, రోజులు ఆ నగలు ఎలా తయారు చేస్తారనేది తెలుసుకోవడంలోనే గడిపారు. కొంత వరకూ అవగాహన వచ్చింది. తానూ ఆ పని ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతకు అదో మార్గమవుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా దానికి కావాల్సిన ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు తానుగా ప్రయోగాలు చేస్తూ గంటల తరబడి పని చేస్తూ మట్టితో నగలు తయారు చేయడం నేర్చుకున్నారు. వాటిని ముందుగా మిత్రులకు చూపిస్తే వారు ఆశ్చర్యపోయారు. ఇంతటి అద్భుతమైన వాటిని తయారు చేసి వృథాగా పోనివ్వకూడదని.. పది మందికీ పరిచయం చేయమని సలహా ఇచ్చారు. దీంతో ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ అయింది. అక్కడ ఆమె తయారు చేసిన నగల మోడల్స్ ఉంటాయి. వాటిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. తమకు కావాల్సిన రంగుల్లో, డిజైన్ చేయించుకోవచ్చు. చెప్పిన సమయానికి నగలు తయారయై ఇంటి ముంగిటకు వస్తాయి. ఓ విద్యావంతురాలు ఉద్యోగాన్ని వదిలి.. సాధారణ గృహిణిగా జీవిస్తూ ఆత్మ సంతృప్తి కోసం మొదలుపెట్టిన చిన్న పని ఇప్పుడు మన జిల్లాను దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కేరళతో పాటు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి. ‘క్లే ఆర్ట్’ అంటే క్లే ఆర్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ఇదేమి కొత్త కళ కాదు. పూర్వం నుంచి మట్టి పాత్రలు తయారు చేయడం మన సంప్రదాయ వృత్తుల్లో ఓ భాగం. అయితే ఇప్పుడు ఆ పాత్రలను వాడేవారు తగ్గిపోయారు. ఓ ప్రత్యేకమైన మట్టిని తీసుకుని క్లే ఆర్ట్ పేరుతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. ప్రవహించే నదుల అడుగున లభించే ఎర్రని మట్టిని ‘టైట’ అని పిలుస్తుంటారు. ఆ మట్టినే ఈ నగల తయారీకి వాడుతున్నారు మాధురి. ఆన్లైన్ ద్వారా ఈ మట్టిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి లభ్యమవుతోంది.