చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది..
క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్‌కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్‌కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది.
విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్‌లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది.
దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు
మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది.
అలంకార వస్తువులు
మినియేచర్స్‌తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్‌లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి.
ప్రశంసలే స్ఫూర్తిగా...
క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆమె తయారు చేసిన మినియేచర్స్‌ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత.
అందమైన ఎంపిక
మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి.
– స్ఫూర్తి
– ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment