విశాఖ వాసులకు సరికొత్త నగలు
‘క్లే ఆర్ట్’లో మాధురి రాణింపు
ఇంటి నుంచే మార్కెటింగ్ ఆదర్శంగా నిలుస్తున్న మహిళ
విశాఖపట్నం: ఆమె.. అనుబంధాలు పెనవేసుకున్న గృహిణి. పరిణితి చెందిన వ్యక్తిత్వం ఉన్న మహిళ. ఇతరులపై ఆధారపడకుండా జీవించాలని చెబుతున్న ధీరోధాత్త.. మట్టితో అద్భుతాలు సృష్టిస్తున్న కళాకారిణి. సామాజిక మాధ్యమాన్ని మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్న బిజినెస్ వుమెన్. ఆమే దొమ్మేటి మాధురి. ఊరు విజయరామరాజుపేట మండలం బుచ్చెయ్యపేట. మాధురి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర బోడసకుర్రులో జన్మించినప్పటికీ.. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. విశాఖ, హైదరాబాదులో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తిరుమల రెడ్డి జగదీష్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
...కానీ..
ఎక్కడో వెలితి.. తన గమ్యం ఇది కాదనే ఆలోచన ఆమెను అనుక్షణం తొలచివేసేది. ఉద్యోగం చేసే అవకాశం లేదు. అలాగని ఏమీ చేయకుండా ఉండిపోవడం తన నైజం కాదు. అలాంటి సమయంలో ఇంటర్నెట్ ఆమెకు దారి చూపించింది. అంతులేని వెబ్‌సైట్లలో ఓ ఫొటో ఆమెను కట్టిపడేసింది. లోతుగా చూస్తే ఆ ఫొటోలో కనిపిస్తున్న నగ బంగారం, ఇతర ఖనిజాలతో తయారు చేసింది కాదని అర్థమైంది.
తాను చూసిన నగ మట్టితో రూపొందిందని తెలిసి ఆశ్చర్యపోయారామె. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. గంటలు, రోజులు ఆ నగలు ఎలా తయారు చేస్తారనేది తెలుసుకోవడంలోనే గడిపారు. కొంత వరకూ అవగాహన వచ్చింది. తానూ ఆ పని ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతకు అదో మార్గమవుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా దానికి కావాల్సిన ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు తానుగా ప్రయోగాలు చేస్తూ గంటల తరబడి పని చేస్తూ మట్టితో నగలు తయారు చేయడం నేర్చుకున్నారు. వాటిని ముందుగా మిత్రులకు చూపిస్తే వారు ఆశ్చర్యపోయారు. ఇంతటి అద్భుతమైన వాటిని తయారు చేసి వృథాగా పోనివ్వకూడదని.. పది మందికీ పరిచయం చేయమని సలహా ఇచ్చారు. దీంతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీ క్రియేట్ అయింది. అక్కడ ఆమె తయారు చేసిన నగల మోడల్స్ ఉంటాయి. వాటిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. తమకు కావాల్సిన రంగుల్లో, డిజైన్ చేయించుకోవచ్చు. చెప్పిన సమయానికి నగలు తయారయై ఇంటి ముంగిటకు వస్తాయి. ఓ విద్యావంతురాలు ఉద్యోగాన్ని వదిలి.. సాధారణ గృహిణిగా జీవిస్తూ ఆత్మ సంతృప్తి కోసం మొదలుపెట్టిన చిన్న పని ఇప్పుడు మన జిల్లాను దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కేరళతో పాటు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి.
‘క్లే ఆర్ట్’ అంటే
క్లే ఆర్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ఇదేమి కొత్త కళ కాదు. పూర్వం నుంచి మట్టి పాత్రలు తయారు చేయడం మన సంప్రదాయ వృత్తుల్లో ఓ భాగం. అయితే ఇప్పుడు ఆ పాత్రలను వాడేవారు తగ్గిపోయారు. ఓ ప్రత్యేకమైన మట్టిని తీసుకుని క్లే ఆర్ట్ పేరుతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. ప్రవహించే నదుల అడుగున లభించే ఎర్రని మట్టిని ‘టైట’ అని పిలుస్తుంటారు. ఆ మట్టినే ఈ నగల తయారీకి వాడుతున్నారు మాధురి. ఆన్‌లైన్ ద్వారా ఈ మట్టిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి లభ్యమవుతోంది.