- మైసూరు దసరా కథ సుఖాంతం
- సంబరాల నిర్వహణపై తొలగిన అనిశ్చితి
- రాజ ప్రాసాదం వెలుపల సంబరాలకు రాణి ప్రమోదా ఓకే
మైసూరు : రాణి ప్రమోదా దేవి రాష్ట్ర ప్రభుత్వంపై అలక వహించారనే వార్తలతో విశ్వ విఖ్యాత దసరా సంబరాల నిర్వహణపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. దసరా నిర్వహణకు తాను వ్యతిరేకం కాదని రాణి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్‌తో కలసి ఆమె గురువారం ఇక్కడ అంబా విలాస్ ప్యాలెస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ ప్రాసాదం వెలుపల దసరా నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాణి తెలిపారు.
దసరా సన్నాహాలపై ఆమెలో అసంతృప్తి చోటు చేసుకుంది. దీనిని పోగొట్టడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున మంత్రి ఆమెతో భేటీ అయ్యారు. దసరా వేడుకలకు హాజరు కావాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆమె మన్నించారని అనంతరం మంత్రి తెలిపారు. జంబూ సవారీకి అంబారీని ఇచ్చేది లేదని రాణి చెప్పలేదని వెల్లడించారు. గత డిసెంబరులో శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ కన్నుమూసినందున, రాజ ప్రాసాదంలో వేడుకలు వద్దని మాత్రమే తాను చెప్పానని రాణి వివరించారు.
రాజ ప్రాసాదంలో వెలుపల దసరా సంబరాల నిర్వహణకు తనకు ఎటువంటి ఆక్షేపణ లేదని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేదని స్పష్టం చేశారు. రాజ ప్రాసాదం విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా దసరా సంబరాలను నిర్వహిస్తామని ఇదే సందర్భంలో మంత్రి తెలిపారు.