Srinivasa Prasad
-
మోదీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్ వన్ (భ్రష్టాచారి నెంబర్ వన్) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా తాజాగా సొంత పార్టీ నుంచి కూడా మోదీకి విమర్శలు ఎదురవుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ ఖండించారు. రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా చనిపోలేదని, ఎల్టీటీఈ ఆత్మహుతి దాడిలో చనిపోయారని, ఈ విషయం దేశ ప్రజలందరికి తెలుసని శ్రీనివాస్ అన్నారు. బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ‘రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ నమ్మరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ వాజ్‌పేయి లాంటి గొప్ప నాయకులే పొగిడారని శ్రీనివాస్ గుర్తు చేశారు.శ్రీనివాస ప్రసాద్ 6 సార్లు ఎంపీగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా,ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. -
ఫైవ్ స్టార్ వద్దు.. పశువుల పాక బెస్ట్: మాజీ మంత్రి
బెంగళూరు: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎంతో మంది నేతలు ఆయన శైలిని అనుకరిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సురేశ్ కుమార్ ఫైవ్ స్టార్ హోటల్ లో అన్ని సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తే వాటిని వదులుకుని చిన్న పశువుల పాక వద్ద ఉంటానంటూ పట్టుబట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్ సురేశ్ కుమార్ రాజాజినగర్ ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ క్రమంలో ఏప్రిల్ 9న నంజన్ గఢ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. పార్టీ నేత శ్రీనివాస్ ప్రసాద్ కు మద్ధతుగా, ఆయనతో పాటు పలు ప్రచార కార్యక్రమాలలో సురేశ్ కుమార్ పాల్గొననున్నారు. ఇందుకోసం సురేశ్ కుమార్ అక్కడికి రాగా నందన్ గఢ్ బీజేపీ నేతలు మైసూరులోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఆయనకు వసతి ఏర్పాటు చేశారు. దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకు బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లు, పశువుల పాకలు అంటే ఎంతో ఇష్టమని అలాంటి ప్రదేశాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి తిరుపతికి 2013లో పాదయాత్ర చేసిన సమయంలో బహిరంగ ప్రదేశాలలో నిద్రించినట్లు గుర్తుచేశారు. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల నుంచి కేరళలోని శబరిమలకు 2015లో కాలినడకన వెళ్లాలని.. విలాసాలకు తాను చాలా దూరంగా ఉంటానని సురేశ్ కుమార్ వివరించారు. ఈ ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ ప్రసాద్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. -
టార్గెట్ సిద్ధు
► వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రణాళికలు ► ఆ ఆరుగురి కనుసన్నల్లోనే మంత్రి మండలి పునర్విభజన ► మంత్రి మండలిలో పేమెంట్ సీట్లే ఎక్కువ ! ► హై కమాండ్‌కు డబ్బు మూటలు ► రాజీనామా అనంతరం శ్రీనివాస ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు బెంగళూరు : ‘సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా ఎదుగుదల కోసం నా సహకారం తీసుకున్నారు. అయితే చేసిన సహాయాన్ని మరిచి అత్యంత అవమానకరంగా నన్ను మంత్రి మండలి నుంచి తొలగించారు. చాలా బాధగా ఉంది. సిద్ధును వచ్చే ఎన్నికల్లో ఓడించి నా పగను చల్లార్చుకుంటా. ఇందుకు జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తా.’ అని నంజనగూడు ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి పునఃరచనలో భాగంగా శ్రీనివాస్ ప్రసాద్‌ను రెవెన్యూశాఖ మంత్రిగా తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీఎం సిద్ధుపై గుర్రుగా ఉన్న ఆయన తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. అన ంతరం తన మద్దతుదారులకు కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్యే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. రాజకీయంగా మునిగిపోయే టైటానిక్ పడవలో ప్రయాణిస్తున్న సిద్ధరామయ్యకు తాను సహాయ హస్తం అందించానని పేర్కొన్నారు. అయితే తనతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మంత్రి మండలి నుంచి తొలగించడం ఎంత వరకూ సమంజసమన్నారు. పటిష్టమైన మంత్రి మండలి రచన అని చెబుతూ ఏమాత్రం రాజకీయ అనుభవం, ప్రజాభిమానం లేని నాయకులను మంత్రి మండలిలోకి తీసుకున్నారని విమర్శించారు. మంత్రి మండలి పునఃరచన అంతా ఆ ఆరుగురి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఇంతలో ఆ ఆరుగురు ఎవరో చెబుతారా అన్న మీడియా ప్రశ్నకు చెబుతాను నాకు భయం లేదు అంటూ ద్విగ్విజయ్సింగ్, సిద్ధరామయ్య, పరమేశ్వర్, కే.జే జార్జ్, డీ.కే శివకుమార్, మల్లికార్జున ఖర్గే’ అని తెలిపారు. మహదేవప్ప లేరా అన్న మరో ప్రశ్నకు ఆయన సిద్ధరామయ్య ‘జిరాక్స్’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇక మంత్రి మండలి మొత్తం పేమెంట్ సీట్లతో నిండిపోయిందని మరో సంచలనం వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా హైకమాండ్‌కు ఇక్కడి నుంచి ‘కప్పాలు’ (డబ్బు మూటలు) వెలుతున్నాయని తన మాట తీవ్రతను పెంచారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. ఇక రాజకీయాల నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలనుకున్న తరుణంలో తాను సహాయం చేసిన వ్యక్తి నుంచే అవమానం ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘సిద్ధరామయ్య అండ్ కో’ను ఓడించినప్పుడే తనకు మనఃశాంతి కలుగుతుందని పురరుద్ఘాటించారు. ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నానని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తానా? లేక ఏదైనాపార్టీతో కలిసి రాజకీయ రణరంగాన్ని ఎదుర్కొంటాన్న అన్న విషయం ఇప్పుడే చెప్పలేనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలు ! అంతకు ముందు తన మద్దతుదారులతో కలసి విధానసౌధలోని స్పీకర్ కోడివాళను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోందన్న స్పీకర్ కోడివాళ ప్రశ్నకు ‘సిద్ధరామయ్య ఏకపక్ష నిర్ణయాల వల్ల తన మనస్సుకు బాధ కలిగింది. అందువల్లే రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. సాధ్యమైన ంత త్వరగా అమోదించాలని కోరారు.’ అని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసే సమయంలో మీడియా ముందు సదరు ప్రజాప్రతినిధిని స్పీకర్ ఎంటువంటి ప్రశ్నలు వేయరు. అయితే తాజా ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా నిబంధనలను అనుసరించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ కోడివాళ మీడియాతో పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిని బహిరంగంగా ప్రశ్నించే సంప్రదాయం ఇప్పటి వరకూ లేదు కదా అన్న ప్రశ్నకు ఇక ముందు ఇదే సంప్రదాయమవుతుందని కోడివాళ సమాధానమిచ్చారు. -
21న నల్లగొండ జిల్లా గురుకులాల్లో సర్టిఫికెట్ల పరిశీలన
రామన్నపేట(నల్లగొండ): నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21వ తేదీన రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాలలో ఉంటుందని కన్వీనర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించగా 453 మంది విద్యార్థ్దులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. వారందరి తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్ అందజేసినట్లు వివరించారు. అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం(వార్షికాదాయం 60వేలలోపు ఉండాలి), స్టడీ సర్టిఫికెట్ (3, 4 తరగతులకు సంబంధించిన), ప్రత్యేక కేటగిరీ వారు సంబంధిత ధృవీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. టీసీని తీసుకు రావలసిన అవసరం లేదని చెప్పారు. -
సుగమం
మైసూరు దసరా కథ సుఖాంతం సంబరాల నిర్వహణపై తొలగిన అనిశ్చితి రాజ ప్రాసాదం వెలుపల సంబరాలకు రాణి ప్రమోదా ఓకే మైసూరు : రాణి ప్రమోదా దేవి రాష్ట్ర ప్రభుత్వంపై అలక వహించారనే వార్తలతో విశ్వ విఖ్యాత దసరా సంబరాల నిర్వహణపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. దసరా నిర్వహణకు తాను వ్యతిరేకం కాదని రాణి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్‌తో కలసి ఆమె గురువారం ఇక్కడ అంబా విలాస్ ప్యాలెస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ ప్రాసాదం వెలుపల దసరా నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాణి తెలిపారు. దసరా సన్నాహాలపై ఆమెలో అసంతృప్తి చోటు చేసుకుంది. దీనిని పోగొట్టడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున మంత్రి ఆమెతో భేటీ అయ్యారు. దసరా వేడుకలకు హాజరు కావాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆమె మన్నించారని అనంతరం మంత్రి తెలిపారు. జంబూ సవారీకి అంబారీని ఇచ్చేది లేదని రాణి చెప్పలేదని వెల్లడించారు. గత డిసెంబరులో శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ కన్నుమూసినందున, రాజ ప్రాసాదంలో వేడుకలు వద్దని మాత్రమే తాను చెప్పానని రాణి వివరించారు. రాజ ప్రాసాదంలో వెలుపల దసరా సంబరాల నిర్వహణకు తనకు ఎటువంటి ఆక్షేపణ లేదని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని స్పష్టం చేశారు. రాజ ప్రాసాదం విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా దసరా సంబరాలను నిర్వహిస్తామని ఇదే సందర్భంలో మంత్రి తెలిపారు. -
నెలాఖరుకు అక్రమ-సక్రమ
రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసప్రసాద్ కమిటీల ఏర్పాటుతో క్రమబద్దీకరణకు చర్యలు త్వరలో రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీ వీఏఓ పోస్టుల నియామకం అధికారం కలెక్టర్లకు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి ఈ నెలాఖరులోగా అక్రమ-సక్రమ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. అలాగే ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వడానికి కూడా బగర్ హుకుం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖ పద్దులపై గురువారం శాసన సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించడానికి మార్గదర్శక విలువను ఆధారం చేసుకునే విషయమై సభ ఆమోదం అవసరమవుతుందని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప మార్గదర్శక విలువలు అధికంగా ఉన్నాయని, కనుక ఖుష్కీ ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి సూచించారు. కాగా భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించడానికి వీలైనంత త్వరగా చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని వెల్లడించారు. రెవెన్యూ శాఖలో తహసిల్దార్ సహా అన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. విలేజ్ అకౌంటెంట్ పోస్టులను నేరు నియామకాల ద్వారా భర్తీ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాలూకా కేంద్రాల్లో మినీ విధాన సౌధలు రాష్ర్టంలోని అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో మినీ విధాన సౌధ సముదాయాలను నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. కాల పరిమితితో వీటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు 116 మినీ విధాన సౌధల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ర్టంలోని 26 వేల గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇదో విప్లవాత్మకమైన కార్యక్రమమని, ఆ గ్రామాల్లో తరతరాలుగా పేదలు నివసిస్తూ, ప్రాథమిక సదుపాయాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సదుపాయాలను కల్పించడానికి రెవెన్యూ గ్రామాలుగా మార్చాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. -
కరువు పీడిత తాలూకాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు
నిధులకు కొరత లేదు మంత్రి వి.శ్రీనివాసప్రసాద్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో కరువు పీడిత 125 తాలూకాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక పనులు చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. శాసన సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, కరువు సహాయక పనులకు జిల్లా కలెక్టర్ల వద్ద కావాల్సినంత నిధులున్నాయని వెల్లడించారు. ఆ నిధులను సద్వినియోగం చేయాల్సిందిగా వారికి సూచించామని తెలిపారు. కొందరు అధికారులు ఆ నిధులను పూర్తిగా వినియోగించకపోయి ఉండవచ్చని, అత్యవసర నిధి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఉండవచ్చని చెప్పారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, వారికి అనుకూలమయ్యే పనులు చేపట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో చెక్‌డ్యాంలు భూగర్భ జలాల వృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశల వారీ వరుస చెక్‌డ్యాంలను నిర్మించాలని యోచిస్తున్నట్లు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం అయిదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వరుస చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని చెప్పారు. అవన్నీ పూర్తయిన వెంటనే ఇతర జిల్లాలకూ ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 176కు గాను 90 తాలూకాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని వెల్లడించారు. -
ఇక ఉద్వాసనే!
లోక్‌సభ ఫలితాల ప్రభావం .. విజయానికి సహకరించని, పని తీరు సరిగాలేని మంత్రులపై వేటు! జాబితాలో ఆరుగురు త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అసంతప్తి నేతలకు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు ప్రతిభకు పెద్ద పీట.. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించని, పని తీరు సరిగాలేని అమాత్యులకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని కాంగెస్ భావిస్తోంది. ఒక వేళ అసంతప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సరైన సహాయ సహకారాలు అందించని మంత్రులపై వేటు వేయాలని అధిష్టానం యోచిస్తోంది. వీరితో పాటే పని తీరు బాగా లేని మంత్రులకు కూడా ఉద్వాసన పలకనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేత ృత్వంలో మంత్రుల పని తీరును బేరీజు వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు మంత్రుల నెత్తిపై కత్తి వేలాడుతోంది. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ పదవులను కోల్పోయే అవకాశాలున్నాయని సమాచారం. వీరిలో ప్రకాశ్ హుక్కేరి మొన్న జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో ఇప్పటికే మూడు ఖాళీలున్నాయి. కనుక కొత్తగా తొమ్మిది మందికి అవకాశం లభించవచ్చు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ అసంత ృప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణలో అనుభవం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గం, ప్రాంతం లాంటి వాటిని పక్కన పెట్టి ప్రతిభకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రి వర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కలిగేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎగువ సభల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలపై చర్చించడానికి దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మల్లిఖార్జునకు స్థానం తోటలు, ఉద్యాన వనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప వయో భారంతో బాధ పడుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీని వల్ల కీలకమైన రెవెన్యూ శాఖ అచేతనంగా పడి ఉంది. కరువు, వరదల సమయాల్లో ఆయన పర్యటనలకు వెళ్లే స్థితిలో లేరు. మునిసిపల్ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం అనేక శాఖలతో సతమతమవుతున్నారు. ఆయన పని తీరు బాగా లేదని పార్టీలో పెదవి విరుస్తున్నారు. గుల్బర్గ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు అక్కడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మండ్యలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్య ఓటమి పాలైంది. దీనికి ఆయన బాధ్యత వహించాలనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అతి మంచితనమే ఆయన కొంప ముంచేట్లుంది. విద్యా శాఖ లోటు పాట్లను తెలుసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శివమొగ్గ జిల్లాలోని సొంత నియోజక వర్గం తీర్థహళ్లిలోనే ఎక్కువ రోజులుంటారని సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. -
హిజ్రాలకు ‘మైత్రి’
నెలనెలా రూ. 500 పింఛన్.. లబ్ధిదారులకు బీపీఎల్ కార్డు, ‘యశస్విని’ వర్తింపు పింఛన్‌ను రూ.1000కి పెంచే యోచన పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస ప్రసాద్ సాక్షి, బెంగళూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న హిజ్రాలకు నెలనెలా రూ. 500 పింఛన్ అందించే మైత్రి పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసప్రసాద్ స్థానిక రవీంద్ర కళాక్షేత్రాలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో లాగా ఇక్కడి హిజ్రాలకూ రూ. 1000 పింఛన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మైత్రి లబ్ధిదారులకు బీపీఎల్ కార్డులతో పాటు యశస్విని పథకం ఫలాలు అందిస్తామన్నారు. ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి.. అర్హులకు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వయస్సుపై గందరగోళం.. పథకం ప్రారంభించాలనే తొందరలో అధికారులు అర్హుల వయస్సు విషయంలో తప్పటడుగు వేశారు. బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ కార్యాలయం ముద్రించిన కొన్ని కరపత్రాల్లో అర్హుల వయసు 18 నుంచి 64 అని ఉండగా, మరికొన్ని కరపత్రాల్లో 40 నుంచి 64 అని ఉంది. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు.