టార్గెట్ సిద్ధు
► వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రణాళికలు
► ఆ ఆరుగురి కనుసన్నల్లోనే మంత్రి మండలి పునర్విభజన
► మంత్రి మండలిలో పేమెంట్ సీట్లే ఎక్కువ !
► హై కమాండ్‌కు డబ్బు మూటలు
► రాజీనామా అనంతరం శ్రీనివాస ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు : ‘సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా ఎదుగుదల కోసం నా సహకారం తీసుకున్నారు. అయితే చేసిన సహాయాన్ని మరిచి అత్యంత అవమానకరంగా నన్ను మంత్రి మండలి నుంచి తొలగించారు. చాలా బాధగా ఉంది. సిద్ధును వచ్చే ఎన్నికల్లో ఓడించి నా పగను చల్లార్చుకుంటా. ఇందుకు జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తా.’ అని నంజనగూడు ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి పునఃరచనలో భాగంగా శ్రీనివాస్ ప్రసాద్‌ను రెవెన్యూశాఖ మంత్రిగా తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీఎం సిద్ధుపై గుర్రుగా ఉన్న ఆయన తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. అన ంతరం తన మద్దతుదారులకు కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్యే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. రాజకీయంగా మునిగిపోయే టైటానిక్ పడవలో ప్రయాణిస్తున్న సిద్ధరామయ్యకు తాను సహాయ హస్తం అందించానని పేర్కొన్నారు. అయితే తనతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మంత్రి మండలి నుంచి తొలగించడం ఎంత వరకూ సమంజసమన్నారు.
పటిష్టమైన మంత్రి మండలి రచన అని చెబుతూ ఏమాత్రం రాజకీయ అనుభవం, ప్రజాభిమానం లేని నాయకులను మంత్రి మండలిలోకి తీసుకున్నారని విమర్శించారు. మంత్రి మండలి పునఃరచన అంతా ఆ ఆరుగురి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఇంతలో ఆ ఆరుగురు ఎవరో చెబుతారా అన్న మీడియా ప్రశ్నకు చెబుతాను నాకు భయం లేదు అంటూ ద్విగ్విజయ్‌సింగ్, సిద్ధరామయ్య, పరమేశ్వర్, కే.జే జార్జ్, డీ.కే శివకుమార్, మల్లికార్జున ఖర్గే’ అని తెలిపారు. మహదేవప్ప లేరా అన్న మరో ప్రశ్నకు ఆయన సిద్ధరామయ్య ‘జిరాక్స్’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇక మంత్రి మండలి మొత్తం పేమెంట్ సీట్లతో నిండిపోయిందని మరో సంచలనం వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా హైకమాండ్‌కు ఇక్కడి నుంచి ‘కప్పాలు’ (డబ్బు మూటలు) వెలుతున్నాయని తన మాట తీవ్రతను పెంచారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. ఇక రాజకీయాల నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలనుకున్న తరుణంలో తాను సహాయం చేసిన వ్యక్తి నుంచే అవమానం ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘సిద్ధరామయ్య అండ్ కో’ను ఓడించినప్పుడే తనకు మనఃశాంతి కలుగుతుందని పురరుద్ఘాటించారు. ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నానని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తానా? లేక ఏదైనాపార్టీతో కలిసి రాజకీయ రణరంగాన్ని ఎదుర్కొంటాన్న అన్న విషయం ఇప్పుడే చెప్పలేనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏకపక్ష నిర్ణయాలు !
అంతకు ముందు తన మద్దతుదారులతో కలసి విధానసౌధలోని స్పీకర్ కోడివాళను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోందన్న స్పీకర్ కోడివాళ ప్రశ్నకు ‘సిద్ధరామయ్య ఏకపక్ష నిర్ణయాల వల్ల తన మనస్సుకు బాధ కలిగింది. అందువల్లే రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. సాధ్యమైన ంత త్వరగా అమోదించాలని కోరారు.’ అని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసే సమయంలో మీడియా ముందు సదరు ప్రజాప్రతినిధిని స్పీకర్ ఎంటువంటి ప్రశ్నలు వేయరు. అయితే తాజా ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా నిబంధనలను అనుసరించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ కోడివాళ మీడియాతో పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిని బహిరంగంగా ప్రశ్నించే సంప్రదాయం ఇప్పటి వరకూ లేదు కదా అన్న ప్రశ్నకు ఇక ముందు ఇదే సంప్రదాయమవుతుందని కోడివాళ సమాధానమిచ్చారు.