కరువు అధ్యయనానికి ‘ఉప సంఘాలు’ | To study such a 'sub-groups' | Sakshi
Sakshi News home page

కరువు అధ్యయనానికి ‘ఉప సంఘాలు’

Published Thu, Apr 21 2016 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

To study such a 'sub-groups'

ఈనెల 30న ప్రభుత్వానికి  నివేదిక
కాంట్రాక్ట్స్ కేటాయింపుల్లో  ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్
బెంగళూరులో రెయిన్‌వాటర్  హార్వెస్ట్ ఇక తప్పనిసరి
మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన టీ.బీ జయచంద్ర

 

బెంగళూరు:  రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల అధ్యయనానికి నాలుగు మంత్రి మండలి ఉపసంఘాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో బుధవారం ఉదయం జరిగిన మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు మంత్రి మండలి ఉపసంఘాల్లోని సభ్యులు రాష్ట్ర మంతటా పర్యటించి ఈనెల 30న క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నారు. బెంగళూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని జిల్లాల్లో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి వీ. శ్రీనివాస్ ప్రసాద్, మైసూరు రెవెన్యూ విభాగానికి ఉన్నతవిద్య శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర,  బెళగావి విభాగానికి పరిశ్రమలశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, గుల్బర్గా రెవెన్యూ డివిజన్ పరిధిలో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ నేతృత్వం వహించనున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. అందులో కొన్ని ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు...


⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు వెంటనే రూ.100 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తాగునీటి కోసం విడుదల చేసిన రూ.50 కోట్లకు ఈ నిధులు అదనం.


⇒ బెంగళూరులో ఇకపై నూతనంగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు వ్యక్తిగత ఇళ్లుకు రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఏర్పాటును ఖచ్చితం చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.


⇒రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రూ.50 లక్షల కంటే తక్కువ మొత్తం కాంట్రాక్టు పనుల్లో 17.1 శాతం ఎస్సీలకు, 6.95 శాతం ఎస్టీలకు (మొత్తం 24.05 శాతం) ఎటువంటి టెండర్ లేకుండా నేరుగా కేటాయించడానికి వీలుగా చట్టంలో మార్పులు తీసుకురావడానికి మంత్రి మండలి ఏకగ్రీవంగా అంగీకరించింది. ఒక వేళ ఒకే పనికి ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే లాటరీ రూపంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.


⇒నాయిబ్రాహ్మణ, నాయింద, హజామ అనే పదాలను నిషేధిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ‘సవిత’ సమాజ వర్గం అని ఇకపై ఆ వర్గానికి చెందిన ప్రజలను పిలవాల్సి ఉంటుంది. సవిత సమాజ వర్గం పేరుతోనే జనన ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. 


⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలుకు మంత్రి మండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్రలోని 137 తాలూకాల్లోని విద్యార్థులకు 39 రోజుల పాటు మధ్యాహ్న భోజనం అందుతుంది.


⇒ రామనగర్‌లో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పనుల కోసం రూ.580 కోట్ల విడుదలకు మంత్రి మండలి అంగీకారం. ఈ పనులను నాగార్జున కంపెనీ చేజెక్కించుకుంది.


⇒ కలబుర్గిలో విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల పెంపునకు రూ.109 కోట్లను ప్రజాపనుల శాఖకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.


⇒ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన జీవీకే సంస్థ తన షేర్లను అమ్మకానికి పెట్టిందని అయితే ఆ షేర్లను కొనకూడదని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో సదరు సంస్థ తమ షేర్లను ఇతర ప్రైవేటు సంస్థలకు కాని వ్యక్తులకు గాని అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కెంపేగడ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 13 శాతం షేర్లను కలిగి ఉన్నాయి.


⇒రాష్ట్రంలోని ఓపెన్ యూనివర్శిటీలు బయటి రాష్ట్రాల్లో నూతన కోర్సులు ప్రారంభించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement