- నిధులకు కొరత లేదు
- మంత్రి వి.శ్రీనివాసప్రసాద్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో కరువు పీడిత 125 తాలూకాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక పనులు చేపట్టినట్లు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. శాసన సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, కరువు సహాయక పనులకు జిల్లా కలెక్టర్ల వద్ద కావాల్సినంత నిధులున్నాయని వెల్లడించారు.
ఆ నిధులను సద్వినియోగం చేయాల్సిందిగా వారికి సూచించామని తెలిపారు. కొందరు అధికారులు ఆ నిధులను పూర్తిగా వినియోగించకపోయి ఉండవచ్చని, అత్యవసర నిధి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఉండవచ్చని చెప్పారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, వారికి అనుకూలమయ్యే పనులు చేపట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
అన్ని జిల్లాల్లో చెక్‌డ్యాంలు
భూగర్భ జలాల వృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశల వారీ వరుస చెక్‌డ్యాంలను నిర్మించాలని యోచిస్తున్నట్లు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రస్తుతం అయిదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వరుస చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని చెప్పారు. అవన్నీ పూర్తయిన వెంటనే ఇతర జిల్లాలకూ ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 176కు గాను 90 తాలూకాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని వెల్లడించారు.