హైదరాబాద్ : కరువు ప్రాంతాల్లో ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసిందని గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటికే రూ.60 కోట్లు జిల్లాలకు విడుదల చేశామన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13 జిల్లాలోనూ కరువు తాండవిస్తోందని, గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.
బోర్లు ఎండిన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, గత ఏడాది ఇదే సమయంలో 3800 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టగా, ఈ ఏడాది ఇప్పుడు 708 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతుందన్నారు. మే నెలలో గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పశువులకు తాగునీటి అవసరాల కోసమే 114 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతుందన్నారు.
ప్రతి గ్రామంలో మంచి నీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లకు ఆదేశాలు జారీ చేశామని, ప్రతి గ్రామంలో అదనంగా మజ్జిగ పంపిణీకి జిల్లాకు మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. బోర్ల మరమ్మత్తులకు ఏడు కోట్లు కేటాయించామన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో మంచినీటి పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని విషయం ప్రస్తావించగా, ముగిసిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించామని, నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు.
శాఖకు రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉంది
తన మంత్రిత్వ శాఖకు మూడు నెలల కాలంలోనే రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. మూడు నెలల కిత్రం జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అవార్డులు దక్కాయని, ఈ నెల 24న ప్రధాని చేతుల మీదుగా పంచాయతీల అభివృద్దిపై మరో అవార్డు అందుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మరో 11 కేంద్ర అవార్డులు దక్కాయన్నారు.
ఈ ఆర్థిక ఏడాది గ్రామాల్లో 5000 కి.మీ అంతర్గత సిమెంట్ రోడ్లు, మరో ఐదు వేల కి.మీల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కష్ణా పుష్కరాల సందర్భంగా రూ.140 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి అనుమతి తెలిపినట్టు మంత్రి వివరించారు.
జగన్ అంటే ఇలా.. బాబు అంటే అలా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారన్న జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం ఎమ్మెల్యేలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబే అక్కడి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను డబ్బులకు కోనుగోలు చేసిందని అన్నారని గుర్తుచేయగా, ‘రాజకీయాల గురించి ఇప్పుడెందుకు? అభివృద్ది గురించి మాట్లాడుకుందాం' అంటూ జవాబు దాటవేశారు.
ఏపీలో నీటి ఎద్దడి నివారణకు రూ.158 కోట్లు
Published Tue, Apr 26 2016 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement