హిజ్రాలకు ‘మైత్రి’
- నెలనెలా రూ. 500 పింఛన్..
- లబ్ధిదారులకు బీపీఎల్ కార్డు, ‘యశస్విని’ వర్తింపు
- పింఛన్‌ను రూ.1000కి పెంచే యోచన
- పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస ప్రసాద్
సాక్షి, బెంగళూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న హిజ్రాలకు నెలనెలా రూ. 500 పింఛన్ అందించే మైత్రి పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసప్రసాద్ స్థానిక రవీంద్ర కళాక్షేత్రాలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో లాగా ఇక్కడి హిజ్రాలకూ రూ. 1000 పింఛన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మైత్రి లబ్ధిదారులకు బీపీఎల్ కార్డులతో పాటు యశస్విని పథకం ఫలాలు అందిస్తామన్నారు. ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి.. అర్హులకు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వయస్సుపై గందరగోళం..
పథకం ప్రారంభించాలనే తొందరలో అధికారులు అర్హుల వయస్సు విషయంలో తప్పటడుగు వేశారు. బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ కార్యాలయం ముద్రించిన కొన్ని కరపత్రాల్లో అర్హుల వయసు 18 నుంచి 64 అని ఉండగా, మరికొన్ని కరపత్రాల్లో 40 నుంచి 64 అని ఉంది. దీంతో అర్హులు అయోమయంలో పడ్డారు.