ఫైవ్ స్టార్ వద్దు.. పశువుల పాక బెస్ట్: మాజీ మంత్రి
బెంగళూరు: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎంతో మంది నేతలు ఆయన శైలిని అనుకరిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సురేశ్ కుమార్ ఫైవ్ స్టార్ హోటల్ లో అన్ని సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తే వాటిని వదులుకుని చిన్న పశువుల పాక వద్ద ఉంటానంటూ పట్టుబట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్ సురేశ్ కుమార్ రాజాజినగర్ ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత‍్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ క్రమంలో ఏప్రిల్ 9న నంజన్ గఢ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
పార్టీ నేత శ్రీనివాస్ ప్రసాద్ కు మద్ధతుగా, ఆయనతో పాటు పలు ప్రచార కార్యక్రమాలలో సురేశ్ కుమార్ పాల్గొననున్నారు. ఇందుకోసం సురేశ్ కుమార్ అక్కడికి రాగా నందన్ గఢ్ బీజేపీ నేతలు మైసూరులోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఆయనకు వసతి ఏర్పాటు చేశారు. దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకు బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లు, పశువుల పాకలు అంటే ఎంతో ఇష్టమని అలాంటి ప్రదేశాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
బెంగళూరు నుంచి తిరుపతికి 2013లో పాదయాత్ర చేసిన సమయంలో బహిరంగ ప్రదేశాలలో నిద్రించినట్లు గుర్తుచేశారు. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల నుంచి కేరళలోని శబరిమలకు 2015లో కాలినడకన వెళ్లాలని.. విలాసాలకు తాను చాలా దూరంగా ఉంటానని సురేశ్ కుమార్ వివరించారు. ఈ ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ ప్రసాద్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.