భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులుండవ్‌  | Hyderabad: KTR Inaugurates Tukaramgate RUB | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులుండవ్‌ 

Mar 5 2022 3:56 AM | Updated on Mar 5 2022 8:53 AM

Hyderabad: KTR Inaugurates Tukaramgate RUB - Sakshi

 ఆర్‌యూబీని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మేయర్‌ విజయలక్ష్మి 

చిలకలగూడ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్‌ తరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ)ద్వారా నగరంలో అద్భుతమైన రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన తుకారాంగేట్‌ ఆర్‌యూబీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ పథకం ద్వారా అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లు, ఆర్‌ఓబీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే సిగ్నల్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. 

సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో రైల్వేలైన్లు ఉన్నందున రైల్వే అధికారులతో చర్చించి స్థానిక ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని వివరించారు. లాలాగూడ రైల్వేగేట్‌ పడడంతో 2003లో కేసీఆర్‌తోపాటు తాను, పద్మారావులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.  తుకారాంగేట్‌ ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజల కల నెరవేరిందన్నారు.  

పద్మారావు దొరకడం మీ అదృష్టం 
డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నేతృత్వంలో సికింద్రాబాద్‌ అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలను కడుపులో పెట్టుకుని ఆదరించే పద్మారావు వంటి నాయకుడు దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ప్రజల చిరకాలవాంఛ నేటికి నెరవేరిందని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు అన్నారు. ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో మల్కాజ్‌గిరి, మారేడుపల్లి, మెట్టుగూడ, లాలాపేట, మౌలాలీ, తార్నాక, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల మధ్య రవాణా సదుపాయం మెరుగుపడిందన్నారు. ఉద్యమ కాలంలో ఇక్కడే పలుమార్లు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్నామని వివరించారు.

బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్, డిప్యూటీ మేయర్‌ శ్రీలతరెడ్డి, కార్పొరేటర్లు లింగాని ప్రసన్నలక్ష్మి, సామల హేమ, కంది శైలజ, సునీత, ఎస్‌ఆర్‌డీపీ సీఈ దేవానంద్, ఎస్‌ఈ రవీందర్‌రాజు, ఈఈ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement