
సాక్షి, బెంగళూరు: ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతివృత్తులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి జరగవని.. ఆ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందన్నారు. అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాంటి విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను నిరంతరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
గ్రామీణ ప్రజల జీవితాల నుంచే జానపద కళలు పుట్టాయని చెప్పారు. వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పగటి వేషాలు వంటి వందలాది జానపద కళారూపాలు ఆ రోజుల్లో పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాయని చెప్పారు. తన బాల్యంలో పండుగ రాగానే తోలుబొమ్మలాట, కోలాటాలు, సంక్రాంతి సమయంలో హరిదాసులు, గంగిరెద్దులతో ఊరంతా కోలాహలంగా ఉండేదన్నారు. సినిమా, టీవీ, రేడియోల్లో జానపదాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ప్రముఖ జానప ద గాయకుడు దామోదరం గణపతి రావు, జానపద పరిశోధకులు డాక్టర్ సగిలి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.