ఇది కరోనా నై‘పుణ్యమే’ | Reading And Writing Skills Have Dropped In School Due To Corona | Sakshi
Sakshi News home page

ఇది కరోనా నై‘పుణ్యమే’

Published Wed, Dec 22 2021 3:54 AM | Last Updated on Wed, Dec 22 2021 9:24 AM

Reading And Writing Skills Have Dropped In School Due To Corona - Sakshi

సర్వే నివేదిక ప్రతులను విడుదల చేస్తున్న బి.వినోద్‌కుమార్, నిసా, ట్రాస్మా ప్రతినిధులు 

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల చదువును కరోనా అల్లకల్లోలం చేసింది. చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను దెబ్బతీసింది. తల్లిభాషలోనూ తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి విస్మయం కలిగించే నిజాలెన్నో నేషనల్‌ ఇండిపెండెన్స్‌ స్కూల్స్‌ అలయెన్స్‌(నిసా), తెలంగాణ రిజిస్టర్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రాస్మా) సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా తర్వాత క్లాస్‌లకు హాజరవుతున్న 44.6 శాతం విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మందిలో ఆత్మవిశ్వాసం లోపించిందని నిసా, ట్రాస్మా సర్వేలో వెలుగుచూశాయి.

ఆన్‌లైన్‌ విధానంలో నష్టపోయిన విద్యను నేర్చుకునేందుకు 45.1 శాతం మంది తిరిగి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని కోరుతున్నట్టు తేలింది. సర్వే నివేదికను ట్రాస్మా మంగళవారం వెల్లడించింది. కరోనాకాలంలో నెలకొన్న విద్యారంగం నష్టంపై ఈ రెండుసంస్థలు కలసి దేశవ్యాప్తంగా ఇటీవల సర్వే జరిపాయి. అన్నిప్రాంతాల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులను కలిశారు. 3–5 తరగతులు, 8వ తరగతి విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.

సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది మాతృభాషలో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం మందిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడి ఉన్నట్టు తేలింది. 

పట్టుతప్పిన చదువు...
ఆంగ్లభాషలో విద్యార్థుల ప్రమాణాలు 35 శాతం మేర పడిపోయాయి. 3వ తరగతి విద్యార్థులు ఒకటో తరగతి నైపుణ్యాల స్థాయికి తగ్గిపోయారు. పట్టణాల్లో ఆంగ్ల భాషలో చదివే నైపుణ్యం కొరవడింది. 40% మంది 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోలేనిస్థితిలో ఉన్నారు. ఐదో తరగతి పట్టణ విద్యార్థులు ఇంగ్లిష్‌ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు.

44 శాతం విద్యార్థులు గణితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 42 శాతం 5వ తరగతి విద్యార్థులు గణితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గణితంలో ప్రతి ముగ్గురు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ఆన్‌లైన్‌ బోధనలో 83.9 శాతం మంది యూట్యూబ్, దూరదర్శన్, టీ–శాట్‌కు ప్రాధాన్యమిచ్చారు. 12 శాతం మందికి ఇంటర్నెట్‌ లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయారు. ఆన్‌లైన్‌ బోధనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది. 44.6 శాతం విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో తరగతిగదుల్లో చదవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. 

కరోనా వల్ల 32.8 శాతం మంది ఆత్మ విశ్వాసంతో చదువు కొనసాగించడంలేదు.

ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేస్తాం: వినోద్‌కుమార్‌
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యా ర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్‌ ఇండిపెండెన్స్‌ స్కూల్స్‌ అలయెన్స్‌ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ట్రాస్మా) ఇటీవల కరోనా కాలంలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వే నివేదికను వినోద్‌ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా గ్రామీణ ప్రాంతాలకు విద్య చేరువ కాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో గత రెండేళ్లుగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూడ్చాలని, బ్రిడ్జ్‌ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ట్రాస్మా సలహాదారు డాక్టర్‌ ప్రసాదరావు మాట్లాడుతూ 98 శాతం గ్రామీణ విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యపై మక్కువ చూపడం లేదన్నారు.

కరోనా మూలంగా విద్యార్థులకు ఆంగ్ల భాష మీద పట్టు తగ్గిందని, రాత నైపుణ్యానికి దూరమయ్యారని, ఈ నష్టాన్ని పూడ్చకపోతే భవిష్యత్‌లో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement