సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు వినోద్‌ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో హెయిర్ సెలూన్లతో పాటు తమ వృత్తికి జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీ ఇవ్వడంతో పాటు పనిముట్లను ఉచితంగా అందించాలని కోరారు. నాయీ బ్రాహ్మణుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వినోద్.. దశల వారీగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన వారిలో నాయీ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మోహన్, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జి జితేందర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment