జోగిపేట: సాక్షర భారత్ పథకానికి 2010లో శ్రీకారం చుట్టారు. మండలంలోని 21 గ్రామాలకు గాను కోఆర్డినేటర్లను నియమించి, సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని బాధ్యతలను అప్పగించారు. దీనికోసం గ్రామ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.2వేల వేతనం అందుతోంది. వీరందరినీ సమన్వయపరచడానికి మండల కో ఆర్డినేటర్‌ను నియమించి రూ.5వేల వేతనం చెల్లిస్తోంది.
వీరంతా కలిసి నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం వేళలో చదవడం, రాయడం నేర్పించాలి. కానీ ‘అసలు సెంటర్లు తెరుచుకుంటే కదా.. అక్షరాలు నేర్పేది’ అని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిగ్గా నడుస్తున్నాయో.. లేదో..? అనే విషయాన్ని మండల కో ఆర్డినేటర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసీఓలు తనిఖీకి వచ్చినప్పుడు పంచాయతీ రిజిస్టర్‌లో సంతకం పెట్టాలి. కానీ వీరు ఇవేమీ ఖాతరు చేయడం లేదు.
ఇది వీసీఓలకు అలుసుగా మారింది. పలు గ్రామాల్లో కనీసం సాక్షర భారత్ కేంద్రం బోర్డు కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. గత ఏడాది నవంబర్ మాసంలో ప్రార ంభమైన నాలుగో దశ ఈ సంవత్సరం మే నెలతో ముగిసింది. ప్రస్తుతం ఐదో దశ కొనసాగుతోంది. గ్రామ కోఆర్డినేటర్లకు నెల నెల సమావేశాలు నిర్వహించి ఎంత మంది వయోజనులు వస్తున్నారో తెలుసుకుని మండల కో ఆర్డినేటర్లు బోధనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి.
కేంద్రాల్లో కనిపించని మెటీరియల్...
మండలంలోని ఆయా గ్రామాల్లో గల సాక్షర భారత్ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. కుర్చీలు, క్యారం బోర్డులు, చెస్, కైలాసం, కార్పేట్లు ఇతర ఆట వస్తువులు చాలా కేంద్రాల్లో కనిపించడంలేదు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రాల్లో దినపత్రికల జాడ లేకుండా పోయింది. వీటికి మాత్రం నెలనెలా బిల్లు చెల్లిస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్లు కొనసాగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అక్షరం నేర్పని సాక్షరం
Published Sun, Aug 10 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement