Pradesh
-
రేవంత్ చైర్మన్‌గా ప్రదేశ్ ఎన్నికల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార సాధనే థీమ్‌గా ఎలక్షన్ టీమ్‌ను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో 25 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ మేరకు గురు వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామో దర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మె ల్యేలు జగ్గా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేతలు రేణుకా చౌదరి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్, ప్రేమ్‌సాగర్ రావు, సునీతా రావులను సభ్యులుగా నియమించారు.యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, సేవాదళ్ రాష్ట్ర ముఖ్య నిర్వాహకుడు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. -
గ్యాంగ్‌రేప్‌పై భగ్గుమన్న హిమాచల్‌ప్రదేశ్
షిమ్లా: పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి హిమాచల్‌ప్రదేశ్‌లో ఆందోళనలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అసలైన కారకులు ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం, తప్పించుకొని హాయిగా తిరుగుతుండటంతో కడుపుమండిన బాధితులకు తోడు పలువురు తోడై పెద్ద మొత్తంలో ఆందోళన లేవనెత్తారు. షిమ్లాలో పాఠశాలకు వెళ్లొస్తున్న ఓ బాలికను లిఫ్ట్ కావాలా అని అడిగి మరీ వాహనంలో ఎక్కించుకొన్న కొంతమంది యువకులు అనంతరం ఆ యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఈ నెల (జూలై 4)న చోటుచేసుకోగా రాష్ట్రాన్ని కుదిపేసింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, అనూహ్యంగా పోలీసులు ఆరుగురుని అరెస్టు చేయగా అందులో నలుగురు కూలీలు. వారిలో ఇద్దరు ఉత్తరాఖండ్ వారు కాగా, మరో ఇద్దరు నేపాల్‌కు చెందినవారు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా సంఘాలు మాత్రం అసలు దోషులను వదిలేసి మిగితా వారిని అరెస్టు చేస్తున్నారని, అసలైన దోషులు ఉన్నత కులాలకు చెందినవారు కావడం వల్లే వారిని ఏమనలేకపోతున్నారని, వారిని అరెస్టు చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వెయ్యిమంది నిరసనల్లో పాల్గొన్నారు. -
ఆర్నెల్లలో గోవధ, విక్రయాలు నిషేధించండి..!
సిమ్లాః దేశంలో ఆరు నెలల్లో గోవధ నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆవు, దూడలు, గొడ్డు మాంసం వాటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులతోపాటు, విక్రయాలను సైతం నిషేధించాలని పేర్కొంది. ఇచ్చిన వ్యవధిలోపు నిషేధంపై పూర్తిశాతం చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బీఫ్ బ్యాన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా గోవులు, లేగదూడల అమ్మకాలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బీఫ్ బ్యాన్ సమస్య ఆయా రాష్ట్రాల పరిథిలోనికి వస్తుందంటూ గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2015 న కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన జస్టిస్ రాజీవ్ శర్మ, కస్టిస్ సురేష్ వార్ థాకుర్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఇప్పటినుంచీ ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలకు సంబంధించిన ఓ కాపీని జాతీయ లా కమిషన్ కు కూడా పంపించింది. గోవులు ప్రజలకు ఆహారాన్ని, ఔషధాలను, అవస్థాపనను అందించే గోవులను వధించడం దారుణమని... ఆవుల రవాణాను నిలిపివేయాలని, వాటి రక్షణకోసం ప్రత్యేకంగా గోశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ హిమాచల్ రాష్ట్రానికి చెందిన హిందూమత సంస్థ భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్థన్ పరిషద్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ విధంగా ప్రతిస్పందించింది. మొత్తం 71 పేజీల తీర్పులో ఆర్థిక, మత పరమైన రెండింటిలోనూ ఆవు యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లు కోర్టు తెలియజేసింది. గోరక్షణలో భాగంగానే హిందువులు సైతం గోవును దైవంగా నమ్ముతారని, పవిత్రంగా భావిస్తారని తెలిపింది. -
అక్షరం నేర్పని సాక్షరం
జోగిపేట: సాక్షర భారత్ పథకానికి 2010లో శ్రీకారం చుట్టారు. మండలంలోని 21 గ్రామాలకు గాను కోఆర్డినేటర్లను నియమించి, సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని బాధ్యతలను అప్పగించారు. దీనికోసం గ్రామ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.2వేల వేతనం అందుతోంది. వీరందరినీ సమన్వయపరచడానికి మండల కో ఆర్డినేటర్‌ను నియమించి రూ.5వేల వేతనం చెల్లిస్తోంది. వీరంతా కలిసి నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం వేళలో చదవడం, రాయడం నేర్పించాలి. కానీ ‘అసలు సెంటర్లు తెరుచుకుంటే కదా.. అక్షరాలు నేర్పేది’ అని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిగ్గా నడుస్తున్నాయో.. లేదో..? అనే విషయాన్ని మండల కో ఆర్డినేటర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసీఓలు తనిఖీకి వచ్చినప్పుడు పంచాయతీ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. కానీ వీరు ఇవేమీ ఖాతరు చేయడం లేదు. ఇది వీసీఓలకు అలుసుగా మారింది. పలు గ్రామాల్లో కనీసం సాక్షర భారత్ కేంద్రం బోర్డు కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. గత ఏడాది నవంబర్ మాసంలో ప్రార ంభమైన నాలుగో దశ ఈ సంవత్సరం మే నెలతో ముగిసింది. ప్రస్తుతం ఐదో దశ కొనసాగుతోంది. గ్రామ కోఆర్డినేటర్లకు నెల నెల సమావేశాలు నిర్వహించి ఎంత మంది వయోజనులు వస్తున్నారో తెలుసుకుని మండల కో ఆర్డినేటర్లు బోధనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. కేంద్రాల్లో కనిపించని మెటీరియల్... మండలంలోని ఆయా గ్రామాల్లో గల సాక్షర భారత్ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. కుర్చీలు, క్యారం బోర్డులు, చెస్, కైలాసం, కార్పేట్లు ఇతర ఆట వస్తువులు చాలా కేంద్రాల్లో కనిపించడంలేదు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రాల్లో దినపత్రికల జాడ లేకుండా పోయింది. వీటికి మాత్రం నెలనెలా బిల్లు చెల్లిస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్లు కొనసాగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.