ఆర్నెల్లలో గోవధ, విక్రయాలు నిషేధించండి..!
సిమ్లాః దేశంలో ఆరు నెలల్లో గోవధ నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆవు, దూడలు, గొడ్డు మాంసం వాటి ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులతోపాటు, విక్రయాలను సైతం నిషేధించాలని పేర్కొంది. ఇచ్చిన వ్యవధిలోపు నిషేధంపై పూర్తిశాతం చర్యలు తీసుకోవాలని సూచించింది.
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బీఫ్ బ్యాన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా గోవులు, లేగదూడల అమ్మకాలు, మాంసం ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులపై నిషేధం విధించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. బీఫ్ బ్యాన్ సమస్య ఆయా రాష్ట్రాల పరిథిలోనికి వస్తుందంటూ గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తిరస్కరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 14 అక్టోబర్ 2015 న కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన జస్టిస్ రాజీవ్ శర్మ, కస్టిస్ సురేష్ వార్ థాకుర్ లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి చురకలు వేసింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఇప్పటినుంచీ ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలకు సంబంధించిన ఓ కాపీని జాతీయ లా కమిషన్ కు కూడా పంపించింది.
గోవులు ప్రజలకు ఆహారాన్ని, ఔషధాలను, అవస్థాపనను అందించే గోవులను వధించడం దారుణమని... ఆవుల రవాణాను నిలిపివేయాలని, వాటి రక్షణకోసం ప్రత్యేకంగా గోశాలలు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ హిమాచల్ రాష్ట్రానికి చెందిన హిందూమత సంస్థ భారతీయ గోవంశ్ రక్షణ్ సంవర్థన్ పరిషద్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ విధంగా ప్రతిస్పందించింది. మొత్తం 71 పేజీల తీర్పులో ఆర్థిక, మత పరమైన రెండింటిలోనూ ఆవు యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లు కోర్టు తెలియజేసింది. గోరక్షణలో భాగంగానే హిందువులు సైతం గోవును దైవంగా నమ్ముతారని, పవిత్రంగా భావిస్తారని తెలిపింది.