నేల‘రాత’లకు స్వస్తి
- పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
- అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు ఏర్పాటు
- అక్రమాలకు పాల్పడితే జైలుకే
- 25 యాక్ట్ పక్కాగా అమలు
- జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం.. ఇకపై నేల ‘రాత’లకు స్వస్తి పలకనున్నాం. ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. ఫర్నీచరు సదుపాయంపై ప్రత్యేక ప్రాధాన్యత తీసుకున్నాం.. ఇప్పటికే విద్యాశాఖ కమిషనరు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ తదితర అధికారులు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన ‘సాక్షి’ కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
జిల్లాలో మొత్తం 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
సాక్షి : చాలా కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
డీఈఓ : ఫర్నీచరు కొరత వాస్తవమే కొన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ అసలే లేదు. అలాంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క కేంద్రంలోనూ సమస్య ఉత్పన్నం కాదు.
సాక్షి : దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేదు.
విద్యార్థుల సమస్యలపై మీరేమంటారు?
డీఈఓ : ఈ విషయంలో ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కేంద్రానికి ఏఏ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారనే వివరాలు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. విద్యార్థులకు అనుకూలంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సాక్షి : సీఓలు, డీఓలు, ఇన్విజిలేషన్ డ్యూటీలు పూర్తయ్యాయా?
డీఈఓ : చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాం. అవసరం కంటే కూడా పది శాతం అదనంగా నియమించాం. వివరాలను హైదరాబాద్‌కు పంపాం. ఇన్విజిలేటర్ల నియామకాలు పూర్తయ్యాయి. సెంటర్ కాపీలు, వ్యక్తిగత కాపీలు ఆయా ఎంఈఓలకు అందజేశాం. పరీక్ష ముందురోజు వారికి అందజేస్తారు. విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నియామక ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయం.
సాక్షి : మాస్ కాపీయింగ్, చూచిరాతను నియంత్రిస్తారా?
డీఈఓ : ఈ విషయంలో ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. పరీక్షల విధుల్లో ఉన్న ఏ స్థాయివారైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే జైలుకు పంపడం ఖాయం. ఇంతకాలమూ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేయడం.. లేదంటే పరీక్షల విధుల నుంచి తప్పించడం.. మహా అయితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం వంటి చర్యలు ఉండేవి. ఈసారి అలాకాదు..1997 నాటి యాక్ట్ 25 సెక‌్షన్ 10లోని నిబంధనలను అమలు చేయనున్నాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేలు నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది.
సాక్షి : డీఈఓ స్థాయిలో తొలిసారి ‘పది’ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా? ఎలాంటి అనుభూతి ఉంది?
డీఈఓ : డిప్యూటీ డీఈఓగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేకమార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడుతోంది. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూస్తాననే నమ్మకం ఉంది.
సాక్షి : గతేడాది జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. ఈసారి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి?
డీఈఓ : గతేడాదికంటే ఈసారి మెరుగైనా ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎందుకంటే తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలవుతోంది. దీనిపై విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు విస్త్రత అవగాహన కల్పించారు. అది చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది.