మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!! | Mother of the great man breath | Sakshi
Sakshi News home page

మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!

Published Thu, Apr 23 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!

మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!

సందర్భం
 
మాతృమూర్తి మీద ఎం త ప్రేమ ఉందో, మాతృ భాష మీద అంతే ప్రేమ ఉండేది శ్రీపాద సుబ్రహ్మ ణ్యశాస్త్రిగారికి. తన రచన ల ద్వారా స్త్రీలలో ఆలోచ నాశక్తిని పెంపొందించాల నే ఉద్దేశంతో మధ్యతరగ తి ఆడవాళ్లు ఇళ్లలో మాట్లా డుకునే భాషనే, తన రచనా భాషగా ఎంచుకున్నారా యన. హిందీని వ్యతిరేకించడంలో ఉద్దేశం ఆ భాష మీద కోపం కాదు. ఆ భాష వల్ల తెలుగుకి అపకారం జరుగుతోందనే! తమ ప్రబుద్ధాంధ్ర పద్యరచనలు పంపించవద్దన్నది వాటి మీద కోపంతో కాదు! వచ న రచనైతే ఎక్కువ మందికి చేరుతుందనే అభి లాషతో! సంస్కృతాంధ్రాలు తప్ప ఆయనకి పాశ్చా త్య భాషలతో సంబంధం లేకపోవడం మన అదృ ష్టం. అందుకే చక్కటి, చిక్కటి తెలుగు సాహిత్యాన్ని అందించారు. ‘తెలుగువాళ్లకు మాత్రమే శ్రీపాద రచనలు చదివే అదృష్టం’ ఉంది అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. తెలుగు ఆప్యాయతలు తెలుసుకోవా లన్నా ఆయన రచనలే ఆధారాలు అన్నారు.

‘కొత్త చూపు’ చిన్న కథ నిజంగా మనకు కొత్త చూపును కలిగిస్తుంది. ఆ కథలో మగపెళ్లివారు ఆడ పెళ్లివారిని రకరకాల కోరికలు కోరుతారు. ఆడపెళ్లి వారు అన్నింటికీ అంగీకరిస్తారు. అప్పు డు పెళ్లికూతురు అన్నపూర్ణ ఏమని ప్రశ్నిస్తుందంటే, ‘నాకు జవాబు చెప్పం డి. ఉత్తర భారత భూముల్లో మన వాళ్లెందరికో అలాంటిది తటస్థపడుతోంది. తెలుగు స్త్రీలకిది చావుబతుకుల సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచి పెట్టడానికి వల్లకాదు. మరి మీ కళ్ల ఎదుట మీఆత్మీయులకున్నూ అలాంటిదే తట స్థపడితే, తరవాత మాట ఏదయినా ముందు కళ్లు మూసుకుని శత్రువుల మీద పడగలరా?’

అంతేకాదు, అన్నపూర్ణ ‘తెనుగు కన్యలం మేమి ప్పుడు చూసుకోవలిసిన సరియోగ్యత చక్కదనం కాదు. చదువూ కాదు. ఐశ్వర్యం అసలు కానేకాదు. ఇవన్నీ తెనుగు యువతిని బానిసను చేశాయి’ అంటుంది. వారు ఎంతటి స్త్రీ పక్షపాతో తెలుసుకోవ డానికి ఈ రెండు విషయాలు చాలు.

ఆయనకు వీరేశలింగం పంతులు గారంటే వల్ల మాలిన అభిమానం. తన ‘అరికాళ్ల కింద మంటలు’ రచనలో కం దుకూరి సంస్కరణకు అక్షర ప్రోత్సాహ మిచ్చారు. పుట్టింటిలోని బాధల్ని భరిం చలేక ఒక వితంతువు రాత్రిపూట ఇంటి బయటికొచ్చి జట్కా అతడితో కందు కూరి ఉంటున్న తోటకు వెళ్లాలని చెబు తుంది. తల చెడిన తన కూతురుకు పంతులు గారు పునర్జన్మ ఇచ్చారన్న కృతజ్ఞతతో, అక్కడికి వెళ్లడానికి తనకేమీ ఇవ్వవద్దంటాడతను. పైగా నీకూ ఆయన దగ్గర మేలు జరుగుతుందని హామీ ఇస్తాడు. వీరేశ లింగంనే పాత్రగా చేసి రచనలు చేశారు శ్రీపాద. ‘కలుపు మొక్కలు,’ ‘జూనియర్ కాదు అల్లుడు,’ ‘జాగ్రత్తపడవలసిన ఘట్టాలు,’ ‘తులసి మొక్క’ వంటి శాస్త్రిగారి కథలు స్త్రీకి మంచి భవిష్యత్తు కోరు తూ రాసినవే. ఆయన దిగిన ఫొటోలో భార్య కూర్చు ని ఉండటం, ఆయన నిల్చుని ఉండటమే ఆయన సంస్కరణకి తార్కాణం. స్త్రీల పట్ల ఇంతటి అభిమా నం పెంచుకోవడానికి తల్లీ, భార్యే కారణం.

శ్రీపాదవారికి తల్లి అంటే దేవత కంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే వైదిక విద్యను వ్యతి రేకించడంతో ఎన్నోసార్లు తండ్రి ఆగ్రహానికి గురైతే తల్లి అనేక విధాలా సహకరించి, కల్లోల సమయంలో కూడా ఆయన కవితా సాధనకి బలం చేకూర్చారు. ఇక భార్య సంగతి చెప్పనే అక్కరలేదు.

 జీవిత చరమాంకంలో మిత్రుడు పురిపండా వారికి ఉత్తరం రాస్తూ ‘నా భార్య నన్ను అనేక విధా లా కాపాడింది. చిన్నప్పట్నుండి దాన్ని కష్టపెట్టాను, సుఖపెట్టలేకపోయాను, ఈ అంతిమ దశలో ఇక ఆ ఊసే లేదు కదా... సాపు చేసిన నా రచనలన్నింటినీ ఏదో ఒక ధరకు అమ్మేసి నాగేశ్వరరావు గారికి బాకీ ఉన్న రూ. 4 వేల చిల్లర ఇచ్చేసి, అదనంగా ఏమన్నా మిగిలితే దానిని నా భార్యకివ్వండి. నా కుటుంబం చెట్టుకింద ఉంది..’ అంటూ బాధపడ్డారు.

తెలుగు భాషా సాహిత్యాలకి ఎన్నో సేవలు అం దించిన ఆ మహనీయుడి చివరి ఘడియలు అలా గడిచాయంటే తెలుగు భాషా సాహిత్యాభిమానులం దరం తలలు వంచుకోవలసిందే!
(నేడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 124వ జయంతి)  (వ్యాసకర్త రచయిత, విమర్శకుడు  మొబైల్: 9391343916)
 
 డా. వేదగిరి రాంబాబు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement