Sripada Subrahmanya sastry
-
కథాకథన చక్రవర్తి
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపి స్తాయి. దృశ్యమానమైన భాషాపర బంధాలు ఆయన ప్రత్యేకత. బహు గ్రంథ చదువరి. తెలుగు సాహిత్య జగత్తులో ‘శ్రీపాద’ ఏ వర్గా నికి ‘సరిపడని’ వారు. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలినవారు విడివిడిగా తీసుకొని తమ రచనా అజెండాలుగా చేసుకున్నారు. కానీ... శ్రీపాద వాటిని విడివిడిగా చూడలేదు. వేదగిరి రాంబాబు ‘తెలుగు జాతి, భాషల పట్ల అభిమానంతో సాహిత్య సహకారంతో, విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయమూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ అంటారు. శ్రీపాద 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. 1891 ఏప్రిల్ 23న తూర్పు గోదావరి అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. 1961 ఫిబ్రవరి 25న రాజమండ్రిలో మరణించారు. తన అత్త కూతురునే వివాహం చేసుకున్నారు. ఆమె పేరు ‘సీత’. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి ‘మహాలక్ష్మి సోదెమ్మ’. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, స్మార్తం పూర్తి చేసి, తన పెద్దన్న దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు ఊరు విడిచి ‘వల్లూరు’ వెళ్ళారు. ‘తెనుగులో మంచి పాండిత్యం సంపాదించాలి’ అని నిశ్చయించుకొన్న శ్రీపాద పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితి విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే ‘సంస్కరణవాదం’ తెలుగు కథకు సువాసన లద్దింది. ఆయన కథల్లో శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వంటివారి ‘వాదాల’ను పాఠకులు చూస్తారు. శ్రీపాద కథల్లో వివిధ సందర్భాల్లోని సంభాషణలు గమనిస్తే ఆయన స్త్రీల విషయంలో ఎంత బలీయమైన అభి ప్రాయంతో తన రచనల్లో ఆయా పాత్రలను చిత్రించారో అర్థమవుతుంది. శ్రీపాద రాసిన 75 చిన్న కథల్లో ప్రతీదీ సమాజ దర్పణంగానే నిలిచింది. ‘కలుపు మొక్కలు’, ‘గులాబి అత్తరు’, ‘అరికాళ్ళ క్రింద మంటలు’, ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, ‘గుర్రప్పందేలు’, ‘గూడు మారిన కొత్తరికం’, ‘విమానం ఎక్కబోతూనూ’, ‘తాపి మేస్త్రీ’, ‘రామదీక్షితులు బి.ఎ.’, ‘పుల్లంపేట జరీచీర’, ‘జూనియర్ కాదు’, ‘అల్లుడు’, ‘రామలక్ష్మి’ ఇలా ప్రతీ కథకూ దాని గొప్పతనం దానిదే అని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనుసు, మెదడు విశాలమవుతాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి ‘తెలుగు వాళ్ళకి మాత్రమే శ్రీపాద వారి కథలు చదివే అదృష్ట ముంద’న్నారు. గొప్ప సత్యమిది. ‘వైదిక పరిభాష’, ‘ఆయుర్వేద యోగ వైద్య ముక్తావళి’ లాంటి వైద్య గ్రంథాలు; భాషకి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశారు. ‘ప్రేమపాశం’, ‘నిగళ బంధనం’, ‘రాజ రాజు’, ‘కలం పోటు’ వంటి నాటకాలు, నాటికలు రాసారు. రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రస్మాతకంగా తీర్చిది ద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన అత్మ కథను ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’గా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికను నిర్వహించారు. ‘గిడుగు’ లాగానే భాషావాది. అనేక ‘అష్టా వధానాలు’ చేశారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం) ‘మనసు ఫౌండేషన్’ వారు శ్రీపాద వారి సర్వ లభ్య రచలనూ నాలుగు సంపుటాలుగా వెలువరించి తెలుగు పాఠకలోకానికి మేలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. - భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి) -
త్రాగడం–పుచ్చుకోవడం
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ చిన్నతనంలో ఓసారి మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న చెరకు తోట చూడ్డానికి వెళ్లారు. ఆ రోజుల్లో తోటల్లోనే చెరకు పానకాన్ని కాచి, బెల్లం అమ్ముతుండేవారు. ఆ తోటకు యజమాని ఒక విద్వత్సంపన్నుడైన రాజుగారు. శ్రీపాద, ఆయన స్నేహితుల్ని సాదరంగా ఆహ్వానించి గ్లాసుల్లో పానకాన్ని ఇచ్చారు. అయితే ఆ అతిథి ఎంతకీ తన గ్లాసు తీసుకోకపోయేటప్పటికి శ్రీపాద, ‘‘రాజుగారూ, మీరూ త్రాగండి. అప్పుడే మేమూ త్రాగగలం,’’ అన్నారు. దీనికా రాజుగారికి ఇంతెత్తున కోపం వచ్చింది. కానీ ఎదురుగా ఉన్నది పండితుల వంశంలో ప్రభవించిన శ్రీపాద, మరొకరు కరణం గారి అబ్బాయి. ‘‘శాస్త్రిగారూ, ఎవరైనా మద్యాన్ని త్రాగుతారు, కల్లును త్రాగుతారు. చెరకు పానకం లాంటివాటిని పుచ్చుకుంటారు. ఈమాత్రం భేదం మీలాంటి వాళ్లు పాటించకుండా మాట్లాడితే ఎలాగండీ?’’ అన్నారు. ‘‘అయ్యో! ఏదో తొందరపాటులో అనేశాను. ఏమనుకోకండి’’ అని శ్రీపాద అనడంతో వాతావరణం తేలికపడి అందరూ చెరకు పానకం త్రాగి, సారీ పుచ్చుకుని బయటపడ్డారు. ఆ రోజుల్లో ‘మాట’ పట్టింపులు అంతలా ఉండేవన్నమాట. - డి.వి.ఎం.సత్యనారాయణ -
చిత్తుకు పైఎత్తు..!
చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపుచేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ! ‘‘రాజద్వారే, రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా–’’ ద్వారంలోంచే ఆశీర్వచనం ప్రారంభించిన తంగిరాల శంకరప్పకు ఠాణేదారు గభీమని అడ్డం వచ్చి ‘‘ఫో– మళ్లీ వచ్చావూ?’’ అంటూ ‘‘ఏయ్, జవాన్లూ?’’ అని కరుగ్గా పిలిచాడు. ‘‘చిత్తం బాబయ్యా, మేమడ్డుపెడుతూనే వుండగా, జలగలాగ జారి వచ్చేస్తున్నారండి’’ అంటూ శంకరప్ప అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నారు. ‘‘దివాన్జీగా రుండగా మధ్య మీరు ఎవరయ్యా?’’ అంటూ శంకరప్ప బింకంగా ముందుకు రాబోయాడు. ‘‘నేను డబ్బు కోసం రాలేదు’’ అని యేదో చెప్పబోయాడు. అప్పటికి తెరిపయిన దివాన్జీ ‘‘యేమిటా అల్లరి?’’ అని నిదానంగా అడిగాడు. ‘‘ఎవరో పిచ్చిబ్రాహ్మడు మహాప్రభూ! ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరీ చేస్తున్నా డండి.’’ ‘‘ఒక రూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేక పోయావా?’’ ‘‘నేను కార్యార్థిని గాని, పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ!’’ శంకరప్ప కేక వేశాడు. ‘‘యెదటికి రప్పించు’’ అన్నాడు దివాన్జీ. శంకరప్ప మొగంమీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది. ‘‘ఏమిటి పని?’’ ‘‘మహారాజులుంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను.’’ ‘‘ఈ వేషంతోటే?’’ అనే మాటలు దివాన్జీ నాలుక చివరనుంచి జారిపోయాయి. ‘‘విద్వత్తు వున్నచోట వేషం అక్కర్లేదండి’’ శంకరప్ప బదులు చెప్పాడు. ‘‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్ధంతులు ఘోష పెడుతూ వుండడం వల్ల– ఒక్క ఆట వారితో ఆడాలని–’’ దివాన్జీకి అభిజాత్యం తోచింది. ‘‘చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభువు’’ అని మాట జారి వచ్చేసింది. ‘‘ఎంచేతో?’’ ‘‘తగిన వుజ్జీ దొరక్క... ఆట కట్టడం మాట దేవు డెరుగును, నాలుగైదు యెత్తులయినా పొంకంగా వెయ్యగలవాడు కనబడలేదు పృథివి మీద.’’ ‘‘విపులా చ ప్రృథ్వీ!’’ దివాన్జీ వులిక్కిపడ్డాడు. వుగ్రుడైనాడు. ‘‘బతకతలుచుకోలేదూ?’’ ‘‘నా విద్వత్తుకి వినియోగం కనబడలేదు. ఇక బతికేం ప్రయోజనమూ? మొండిపట్టు పట్టి ఆటలో కూచుని వోడిపోతే, మహారాజులుంగారు వచ్చినవాడి తలకొట్టించి కోట కొమ్ములకు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు. సిద్ధపడే వచ్చేశాను.’’ తన అంతస్తు స్మరించుకుని ఈ దరిద్రుడి మీద పడి మొట్టాలన్నంత ఆవేశం వచ్చింది దివాన్జీకి. ‘‘ఇక దయ చెయ్యి.’’ ‘‘నాకేమి చెప్పినట్టూ?’’ ముదలకించాడు శంకరప్ప. ‘‘ఏయ్ జవాన్లూ!’’ దురుసుగా పిలిచాడు దివాన్జీ. ∙∙ ‘‘ఏం జరిగింది నాయనా?’’ ఆత్రంగా అడిగింది పేదరాసి పెద్దమ్మ. ‘‘వ్యవహారం అంతా తల్లకిందులయి పోయింది పెద్దమ్మా’’ అంటూ చతికిలబడ్డాడు శంకరప్ప. నిరాశా, వుడుకుమోత్తనమూ, దుఃఖమూ అతని శరీరంలో ప్రతీ అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ వున్నాడు. ముప్ఫయేళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయినాడు. ‘‘విద్వాంసుల మంటూ వచ్చేవాళ్లని చాలామందిని చూశాను; అందరూ యిలాగే లౌక్యం సుతరామూ లేక...’’ ‘‘ఆ పెద్దమనిషి మొదటే హేళనలోకి దిగాడు.’’ ‘‘మరి విను. ఇప్పటిదాకా రాజదర్శనానికి నువు తిప్పలుపడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలుపడాలి.’’ ‘‘నీళ్లముంచినా పాలముంచినా– పెద్దమ్మా, నేను నీ కొడుకుని’’ అంటూ ఆమె పాదాలు పట్టుకున్నాడు. ‘‘ఇంత వెర్రిబాగుల నాయనవు, చదరంగంలో నీకింత నేర్పెలా వచ్చిందోయ్?’’ ‘‘దాని కంతకీ కారణం యీశ్వరానుగ్రహం.’’ ఒక్కమాటు పైకి చూసి ‘‘పెద్దాపురప్పట్నం అంతా యెప్పుడైనా చూశావా?’’ అని అడిగింది. ‘‘సెబాస్’’ అంటూ లేచి, గుమ్మంలోకి వొక్కటే వురక. అక్కణ్ణుంచి వీధిలోకి వొక్కటే అంగ. ∙∙∙ శంకరప్ప సందు మళ్లాటప్పటికొక పెద్ద భవంతి కనపడింది. మండువా వాకట్లోనుంచి చదరంగానికి సంబంధించిన ఘర్షణ వినవచ్చింది. లోపల యిద్దరు బ్రాహ్మణ యువకులు చదరంగం ఆడుతున్నారు. వారికిద్దరికీ చెరో సలహాదారూ దగ్గిరసా కూచుని వున్నారు. ఒక్కమాటు నలుగురి మొగాలూ చూశాడు. బలమున్నూ చూశాడు. స్తంభానికానుకు నుంచున్నాడు. అరగడియ గడిచినా యెత్తు పడలేదు. శంకరప్ప విసిగిపోయాడు. ‘‘ఏమండీ, యెత్తు వెయ్యరేం?’’ అని సరసంగానే అడిగాడు. ‘‘నీకెందుకయ్యా మా గొడవ’’ అని సలహాదారు మిడుతూ చూసి కొంచెం విసుక్కున్నాడు. ‘‘మీ గొడవ నా కెందుకూ? ఆట గొడవ అడుగుతున్నాను.’’ ‘‘నాలుగ్ఘళ్ల పొద్దెక్కేటప్పటికి ఆట యీ స్థితికి వచ్చింది.’’ ‘‘ఇంతమంది– యింతసేపు– యిందులో యేం వుందీ?’’ ఆటకాడి కిది కొట్టినంత పని చేసింది. బుస్సుముంటూ మొగం పైకెత్తి ‘‘చదరంగం అంటే మీ కేమయినా తెలుసా?’’ అని అడిగాడు. ఆటగాడి మొగం మీద చక్కని వర్ఛస్సు కనపడింది శంకరప్పకి. ‘‘ఇతగాణ్ణి భృత్యుణ్ణి చేసుకుతీరాలి’’ అని నిశ్చయించుకున్నాడు. ‘‘వారి ఆట నేను కట్టిస్తాను. నేను చెప్పినట్టెత్తు వెయ్యండి’’ అన్నాడు. ‘‘అయితే సలహా చెప్పు’’ అని బల్లకేసి తిరిగా డాటగాడు. ‘‘ఎన్ని యెత్తుల్లో ఆట కట్టమంటారు?’’ ‘‘సొరకాయలు నరుకుతున్నావే!’’ ‘‘మీ నల్లగది శకటు వారి గుర్రం ముందు వెయ్యండి’’అన్నాడు శంకరప్ప. చెప్పినట్టు వేశాడు ఆటకాడు. ‘‘వోస్! అయితే, మరి, గుర్రం యిక్కడ వేశాను’’ అన్నాడు ప్రతిపక్షి. ‘‘ఆ బంటుతో మీరు తోసిరాజనండీ!’’ ‘‘అరే, అరే’’ అంటూ ఆటగాడు ఆశ్చర్యపడ్డాడు. ‘‘మహానుభావా’’ అని శంకరప్పను కౌగిలించుకున్నాడు. ‘‘అయ్యా, యీపూట మీరు భోజనానికి మా యింటికి దయచెయ్యాలి’’ అని ఆహ్వానించాడు సలహాదారు. ‘‘మీ అనుగ్రహానికి సంతోషం. నే నింతలో యీవూరు విడిచివెళ్లను. ఇప్పటికి నన్ను విడిచి పెట్టండి.’’ అని శంకరప్ప చెయ్యి విడిపించుకున్నాడు. దాంతో రామశాస్త్రీ, యాజులూ ఆయన సహచరులయ్యారు. ∙∙∙ తర్వాతి ఆట పంతులుతో. మరో ఆట రాజుతో. ఒక తెలగా, ఒక వైశ్యుడూ, ఒక బ్రాహ్మడూ. ‘‘మూడెత్తుల్లో ఆట కట్టేస్తారు వీరు’’ అని శంకరప్పను పరిచయం చేయసాగారు శాస్త్రీ, యాజులూ. ‘‘అంత సమర్థులా వారు’’ అని ఎదుటివారు అనుమానపడటమూ, తర్వాత నోరు కుట్టేసుకోవడమూ. మరో ఆట భీమరాజుతో. ఇంకో ఆట కృష్ణంరాజు గారితో. అటుపై దుర్వాసుల ఆదివారాహ మూర్తితో. ‘‘కుడివైపునున్న మన యేనుగుని వారి శకటు దగ్గిరగా వేయించండి.’’ ‘‘మన యెర్రగది శకటు రాజుకి అయిమూల గదిలో పడెయ్యండి.’’ పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు చిత్తయిపోయారు. తంగిరాల శంకరప్ప పేరు చుట్టుపట్ల రామనామం అయిపోయింది. అనేకులు పట్టంచుల చాపు లివ్వ వచ్చారు. ఉప్పాడ జరీజామార్లు కట్టబెట్టపోయారు. బరంపురం తాపితాలు సమర్పించపోయారు. కాశ్మీర శాలువాలు కప్పపోయారు. శంకరప్ప వొకటీ పుచ్చుకోలేదు. సామంతులూ, సేనాధిపతులూ, రాజబంధువులూ, రాజపురుషులూ, సంపన్నులూ, సరసులూ కోరి శంకరప్పతో ఆడి, ఆట కట్టించుకుని, అదే తమకొక గొప్పగా ఆనందించసాగారు. పాలకీ, పదహారుగురు బోయీలు, పది పదిహేనుగురు భటులు ‘‘చామర్లకోట శ్రీ రావు రాయడప్ప రంగా రాయణింగారి మనుష్యులం’’ అంటూ వచ్చారు. రాజనర్తకి అలివేణి, మహారాజు సన్నిధిని వుండవలసిన నలుగురు వేశ్యలలోనూ వొకతె రంగనాయిక కూడా శంకరప్ప ప్రతిభను చూసి ‘ధన్యులు’ అయినారు. ∙∙∙ ‘‘పట్నంలో కెవరో అసాధ్యపు ఆటకాడు వచ్చారుట, మీ కేమయినా జాడ?’’ ‘‘లేదు మహాప్రభూ!’’ రాజ కార్యాలన్నీ ముగించుకుని, పెద్దాపురం కోటలో, మహా రాజాధిరాజ, పేషణి హనుమంత, నెలవోలు గండాంక శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు లక్కమేడ వసారాలో పచారుజేస్తున్నారు. కాగితాలు చేత పట్టుకుని దివాన్జీ మాట్టాడుతున్నాడు. ‘‘ఊరంతా కోడయికూస్తోందిట– మీకు తెలవకపోవడం యేమిటండీ?’’ మహారాజు అసంతృప్తి కనపరిచాడు. దివాన్జీ వెళ్లిపోయిన తర్వాత, ఆట దగ్గర కూర్చోకుండానే ‘‘గోడ అవతల నుంచుని నాలుగెత్తుల్లో’’ ఆట కట్టించిన శంకరప్ప గొప్పతనాన్ని వివరించింది ‘రంగి’. ఈలోగా దాట్ల అప్పలనరసింహరాజు లోగిట్లో వత్సవాయి విజయరామరాజుతో ఆడుతుండగా– ప్రౌఢ, మధ్య, ముగ్ధలు చిలకలు చుడుతూ, విసనకర్ర విసురుతూ, బంగారపు గంధపు గిన్నెలతో యేకాగ్రత భంగపరిచేందుకు ప్రయత్నించినా వికారం యేమీ కనబరచకుండా శంకరప్ప నెగ్గాడు. ‘‘తమ రొక్కమాటు మహారాజులుంగారితో ఆడాలండీ!’’ ∙∙∙ పాలకీ కోటగుమ్మంలోకి వెళ్లింది. శంకరప్పకు ఠాణేదారు నమస్కరించాడు. దివాన్జీ ఆహ్వానించాడు. మహారాజుకి శంకరప్ప దగ్గిర మహేశ్వరాంశ కనబడింది. మహారాజు దగ్గిర శంకరప్పకి విష్ణ్వంశ ద్యోతకం అయింది. రంగ నాయిక బలం సద్ది వుంది. ఒక పక్షానికి కెంపులూ, వొక పక్షానికి పచ్చలూ పొదిగిన బంగారపు బలం అది. పచ్చల వేపు శంకరప్ప, కెంపుల వేపు మహారాజు. ఆ నడకే కొత్తగా సాగింది. దిగ్ధంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే. అయినా ద్రష్టలకు దర్శనీయమే. తాపీగా ప్రారంభం అయిన ఆట నాలుగ్ఘడియలు గడిచేటప్పటికి ‘‘యెత్తు పడదేం?’’ అన్న స్థితికి వచ్చింది. మరో గడియ. మన్నాడు. తరువాత. వారాలు, మాసాలు. ‘‘నెగ్గేశాం పెద్దమ్మా. ఆరుమాసాలకయినా ఆట కట్టిందని మహారాజు వొప్పుకోవలసిందే.’’ ∙∙∙ ఠాణేదారుకి దేవిడిమన్నా అయిపోయింది. పెద్దాపురంలో ఉండటానికే లేదు. దివాన్జీ మీద వీరభద్రావతారం తాల్చేశారు మహారాజు. చివరికి ఒకరోజు మహారాజు శంకరప్పని కౌగలించుకున్నాడు. ‘‘చదరంగంలో నాకిదే మొదటి వోటమి. ఇంతటి ఉత్కటానందం నాకింతవరకు కలగలేదు. పెద్దాపురం రాజ్యంలో వున్నది యేమయినా సరే తమకి సమర్పించుకుంటాను, సెలవిప్పించండి.’’ ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపుచేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ!’’ విషయం ఎవరికీ బోధపడినట్టులేదు. ∙∙∙ ‘‘ఏమి, లెక్క తేలిందా?’’ అడిగాడు మహారాజు. ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అంటూ షరాబు కాగితం మహారాజు కందించాడు. రాజ్యమే సమర్పించుకునేందుకు మహారాజు సిద్ధపడ్డాడు. శంకరప్ప అంగీకరించలేదు. చివరకు సర్వలక్షణ సంపన్నమైన అగ్రహారం, పెద్దమ్మకు సాలీనా నూటాపదహారు రూపాయల బహుమానం, శాస్త్రీ, యాజుళ్లకు చెరొక నూటపదహారు రూపాయల బహుమానం ఏర్పాటు చేసి, శంకరప్పను దగ్గిర వుండి గజారోహణం చేయించాడు మహారాజు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (1891–1961) ‘వడ్లగింజలు’ ఇది. 1941లో ప్రచురితమైంది. 73 పేజీల కథని కేవలం 950 పదాల్లో చెప్పే ప్రయత్నం జరిగింది. కథక చక్రవర్తి అనిపించుకున్న శ్రీపాద ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ తెలుగులోని గొప్ప పుస్తకాల్లో ఒకటి. -
మాతృభాషను శ్వాసించిన మాననీయుడు!!
సందర్భం మాతృమూర్తి మీద ఎం త ప్రేమ ఉందో, మాతృ భాష మీద అంతే ప్రేమ ఉండేది శ్రీపాద సుబ్రహ్మ ణ్యశాస్త్రిగారికి. తన రచన ల ద్వారా స్త్రీలలో ఆలోచ నాశక్తిని పెంపొందించాల నే ఉద్దేశంతో మధ్యతరగ తి ఆడవాళ్లు ఇళ్లలో మాట్లా డుకునే భాషనే, తన రచనా భాషగా ఎంచుకున్నారా యన. హిందీని వ్యతిరేకించడంలో ఉద్దేశం ఆ భాష మీద కోపం కాదు. ఆ భాష వల్ల తెలుగుకి అపకారం జరుగుతోందనే! తమ ప్రబుద్ధాంధ్ర పద్యరచనలు పంపించవద్దన్నది వాటి మీద కోపంతో కాదు! వచ న రచనైతే ఎక్కువ మందికి చేరుతుందనే అభి లాషతో! సంస్కృతాంధ్రాలు తప్ప ఆయనకి పాశ్చా త్య భాషలతో సంబంధం లేకపోవడం మన అదృ ష్టం. అందుకే చక్కటి, చిక్కటి తెలుగు సాహిత్యాన్ని అందించారు. ‘తెలుగువాళ్లకు మాత్రమే శ్రీపాద రచనలు చదివే అదృష్టం’ ఉంది అన్నారు మల్లాది రామకృష్ణశాస్త్రి. తెలుగు ఆప్యాయతలు తెలుసుకోవా లన్నా ఆయన రచనలే ఆధారాలు అన్నారు. ‘కొత్త చూపు’ చిన్న కథ నిజంగా మనకు కొత్త చూపును కలిగిస్తుంది. ఆ కథలో మగపెళ్లివారు ఆడ పెళ్లివారిని రకరకాల కోరికలు కోరుతారు. ఆడపెళ్లి వారు అన్నింటికీ అంగీకరిస్తారు. అప్పు డు పెళ్లికూతురు అన్నపూర్ణ ఏమని ప్రశ్నిస్తుందంటే, ‘నాకు జవాబు చెప్పం డి. ఉత్తర భారత భూముల్లో మన వాళ్లెందరికో అలాంటిది తటస్థపడుతోంది. తెలుగు స్త్రీలకిది చావుబతుకుల సమస్య. మేమిది చూసీ చూడకుండా విడిచి పెట్టడానికి వల్లకాదు. మరి మీ కళ్ల ఎదుట మీఆత్మీయులకున్నూ అలాంటిదే తట స్థపడితే, తరవాత మాట ఏదయినా ముందు కళ్లు మూసుకుని శత్రువుల మీద పడగలరా?’ అంతేకాదు, అన్నపూర్ణ ‘తెనుగు కన్యలం మేమి ప్పుడు చూసుకోవలిసిన సరియోగ్యత చక్కదనం కాదు. చదువూ కాదు. ఐశ్వర్యం అసలు కానేకాదు. ఇవన్నీ తెనుగు యువతిని బానిసను చేశాయి’ అంటుంది. వారు ఎంతటి స్త్రీ పక్షపాతో తెలుసుకోవ డానికి ఈ రెండు విషయాలు చాలు. ఆయనకు వీరేశలింగం పంతులు గారంటే వల్ల మాలిన అభిమానం. తన ‘అరికాళ్ల కింద మంటలు’ రచనలో కం దుకూరి సంస్కరణకు అక్షర ప్రోత్సాహ మిచ్చారు. పుట్టింటిలోని బాధల్ని భరిం చలేక ఒక వితంతువు రాత్రిపూట ఇంటి బయటికొచ్చి జట్కా అతడితో కందు కూరి ఉంటున్న తోటకు వెళ్లాలని చెబు తుంది. తల చెడిన తన కూతురుకు పంతులు గారు పునర్జన్మ ఇచ్చారన్న కృతజ్ఞతతో, అక్కడికి వెళ్లడానికి తనకేమీ ఇవ్వవద్దంటాడతను. పైగా నీకూ ఆయన దగ్గర మేలు జరుగుతుందని హామీ ఇస్తాడు. వీరేశ లింగంనే పాత్రగా చేసి రచనలు చేశారు శ్రీపాద. ‘కలుపు మొక్కలు,’ ‘జూనియర్ కాదు అల్లుడు,’ ‘జాగ్రత్తపడవలసిన ఘట్టాలు,’ ‘తులసి మొక్క’ వంటి శాస్త్రిగారి కథలు స్త్రీకి మంచి భవిష్యత్తు కోరు తూ రాసినవే. ఆయన దిగిన ఫొటోలో భార్య కూర్చు ని ఉండటం, ఆయన నిల్చుని ఉండటమే ఆయన సంస్కరణకి తార్కాణం. స్త్రీల పట్ల ఇంతటి అభిమా నం పెంచుకోవడానికి తల్లీ, భార్యే కారణం. శ్రీపాదవారికి తల్లి అంటే దేవత కంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే వైదిక విద్యను వ్యతి రేకించడంతో ఎన్నోసార్లు తండ్రి ఆగ్రహానికి గురైతే తల్లి అనేక విధాలా సహకరించి, కల్లోల సమయంలో కూడా ఆయన కవితా సాధనకి బలం చేకూర్చారు. ఇక భార్య సంగతి చెప్పనే అక్కరలేదు. జీవిత చరమాంకంలో మిత్రుడు పురిపండా వారికి ఉత్తరం రాస్తూ ‘నా భార్య నన్ను అనేక విధా లా కాపాడింది. చిన్నప్పట్నుండి దాన్ని కష్టపెట్టాను, సుఖపెట్టలేకపోయాను, ఈ అంతిమ దశలో ఇక ఆ ఊసే లేదు కదా... సాపు చేసిన నా రచనలన్నింటినీ ఏదో ఒక ధరకు అమ్మేసి నాగేశ్వరరావు గారికి బాకీ ఉన్న రూ. 4 వేల చిల్లర ఇచ్చేసి, అదనంగా ఏమన్నా మిగిలితే దానిని నా భార్యకివ్వండి. నా కుటుంబం చెట్టుకింద ఉంది..’ అంటూ బాధపడ్డారు. తెలుగు భాషా సాహిత్యాలకి ఎన్నో సేవలు అం దించిన ఆ మహనీయుడి చివరి ఘడియలు అలా గడిచాయంటే తెలుగు భాషా సాహిత్యాభిమానులం దరం తలలు వంచుకోవలసిందే! (నేడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 124వ జయంతి) (వ్యాసకర్త రచయిత, విమర్శకుడు మొబైల్: 9391343916) డా. వేదగిరి రాంబాబు -
జాతి కోసం తపించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
సందర్భ రచయిత: ‘ముందు గ్రంథాలు పట్టు, తపస్సు చెయ్యి, ఆ తరువాత కలం పట్టు’ అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సాహితీ రంగంలో కృషి చేసే యువకులకు చేసిన హెచ్చరిక ఇది గ్రంథాలు చదివితే పదసంపద పెరుగుతుంది. గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి. జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాదవారి విశ్వాసం. లోకుల సంభాషణలు వింటూ ఉండడమూ, గ్రంథాలు చదువుతూ వుండడమూ, ఎడతెగకుండా రచనలు సాగిస్తూ వుండడమూ- ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారాయన. శ్రీపాద దృష్టిలో రచన అనేది ఒక తపస్సు. కవి సమాధిలో కూచున్నాడా సరియైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీదికి దృష్టి పోదు. కష్టాలు కనబడవు. రచనలో మునిగిన కవి మానసిక స్థితి అలా ఉంటుంది అంటారాయన. కవి హృదయం అతి సున్నితమట. సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతడు చూడగలడట. ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు కావ్యం రచిస్తాడని శాస్త్రిగారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని చెప్పారు. కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత, చరిత్రలు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు- ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టి ఓహో అనిపించుకున్నారు. వ్యాఖ్యానాలు రాశారు. అవధానాలు చేశారు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రిక స్థాపించి సంపాదకత్వం వహించారు. గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు. కళాభివృద్ధినీ పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలూ, సన్మానాలూ నిర్వహించారు. నాటకాలు ఆడారు. సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు. నిజాయితీ, నియమబద్ధతా, నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు. దేనిలోనూ రాజీ ఉండదు. ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’ పేరుతో రాసిన వారి ఆత్మకథ ఎన్నో ప్రశంసలు అందుకుంది. అన్నింటినీ మించి ఆయనకు తెలుగుజాతి అన్నా అభిమానం ఎక్కువ. ఏమాత్రం కల్తీలేని అసలు సిసలైన తెలుగు రచయిత ఆయన. సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని పొలమూరులో 1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. స్వగ్రామం మహేంద్రవాడ. వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం. ఎన్నో నియమాలు. సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికే వీలులేదు ఆ కుటుంబంలో. క్రాపింగుతో ఉండాలని సరదా ఆయనకి. పనికిరాదంటారు కుటుంబసభ్యులు. చొక్కా తొడుక్కోవాలని ఉబలాటం. పనికిరాదంటారు పెద్దలు. దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రిగారు. ఈ లక్షణమే వారి రచనల్లో దర్శనమిస్తుంది. వరకట్నం, అస్పృస్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది. మహిళలపై సానుభూతి చోటుచేసుకుంటుంది. నా తెలుగుపై నాకు నిషేధం ఏమిటీ? అనుకుని ఓం ప్రథమంగా నన్నయ భారతాన్ని తెరిచారు. తెలుగు గడ్డపైనే తెలుక్కి అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన తెలుసుకోగలిగారు. ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన్ని అంకితం చేసింది. తెలుగుభాషకూ, తెలుగు జాతికీ జరుగుతున్న అపకారాన్ని శాస్త్రిగారు ఎదిరించారు. తమ ప్రబుద్ధాంధ్ర పత్రికద్వారా పోరాటాలే జరిపారు. గ్రాంథికం నుంచి వ్యావహారికభాషకు మళ్ళి దానికి అండగా నిలిచారు. వ్యావహారికభాష తియ్యదనాన్ని రుచి చూశారు. రచనల ద్వారా రుచి చూపించారు. తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి: ‘‘ నా తెనుగు భాష శాస్త్రీయం, తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహినిగా వుండినదిగాని, యివాళ ఆ భాషలోంచి వొక మాటా యీ భాషలోంచి ఒక మాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగు సరప్వతికే తేనె చినుకు లందించిందిగాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలిగిందిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందికాదు. అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీకాదు’’. తెలుగు మాగాణి నాలుగు చెరగులా తిరిగి అక్కడక్కడి పలుకుబళ్లు ఒంట బట్టించుకున్నాక తనకు ఐదు ప్రాణాలూ సంక్రమించినట్టు అయిందంటారు శ్రీపాదవారు. తన ప్రాంతపు పలుకుబడిలో యెంత శక్తి వుందో అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది అంటారు ఆయన. ఒక్కొ సీమలో ఒక్కొక్క జీవకణం ఉందట. అన్నీ ఒకచోటికి చేర్చగల, అన్నీ ఒక్క తెనుగు రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి అని అసలు విషయం వెల్లడించారు. అవునుకదా, నిజానికి ఇప్పుడదే జరగాలి. మాతృభాషపట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లిభాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడూ తల్లిభాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడూ తల్లిభాషలోకాక ఇతరభాషలో ఆనందించేవాడూ- తల్లి లేని బిడ్డ అంటారు. శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం. తెలుగుభాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం. ఇది కొంచెం తీవ్రంగా తోచినా కచ్చితంగా వాస్తవం. విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం. ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం. కాబట్టి అలా భావించడం చాలా అవసరం. ‘భారత దేశం అంతా వీరవిహారంగా చేసుకుని, మహాసామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాలవారిని పరిపాలించి, - అయ్యో! నేడు భృత్యునిగా, అనుచరునిగా, మట్టి తలకాయవానిగా యాసడింపబడుతున్నానే’ అనే అవేశం కలిగించాలి. అంతేకాదు ‘నే నాంధ్రుణ్ణి. నా పూర్వుల రక్తమే నన్ను నడిపిస్తోంది. భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి. ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి’ అని కూడా శ్రీ పాదవారు ఉద్భోదించారు. ఈ పరిస్ధితుల్లో చేయవలసిందాన్ని శాస్త్రిగారు సూచించారు. ‘తెలుగులో విజ్ఞానం కలిగించే వాఞ్మయం నిర్మించాలి . నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం యిచ్చే కార్యక్రమం నెరవేర్చాలి. ఇది ప్రయోజనకరమైన సందేశం? ఏ జాతి ఎదటా ఏ సందార్భంలోనూ ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు. అంచేత ప్రపంచానికిది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికే మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదవారు ప్రతిజ్ఞలాంటిదే చేశారు. దానికి కట్టుబడి కృషి చేశారు కూడాను. అయితే, చేయవలసింది ఇంకా ఉండగానే తెలుగుజాతి దురదృష్టంవల్ల శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1961 ఫిబ్రవరి 25 మరణించారు. ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తపించే ఒక పెద్ద అండ కరువైంది. వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన విధి. - పున్నమరాజు నాగేశ్వరరావు