
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ చిన్నతనంలో ఓసారి మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న చెరకు తోట చూడ్డానికి వెళ్లారు. ఆ రోజుల్లో తోటల్లోనే చెరకు పానకాన్ని కాచి, బెల్లం అమ్ముతుండేవారు. ఆ తోటకు యజమాని ఒక విద్వత్సంపన్నుడైన రాజుగారు. శ్రీపాద, ఆయన స్నేహితుల్ని సాదరంగా ఆహ్వానించి గ్లాసుల్లో పానకాన్ని ఇచ్చారు. అయితే ఆ అతిథి ఎంతకీ తన గ్లాసు తీసుకోకపోయేటప్పటికి శ్రీపాద, ‘‘రాజుగారూ, మీరూ త్రాగండి. అప్పుడే మేమూ త్రాగగలం,’’ అన్నారు. దీనికా రాజుగారికి ఇంతెత్తున కోపం వచ్చింది. కానీ ఎదురుగా ఉన్నది పండితుల వంశంలో ప్రభవించిన శ్రీపాద, మరొకరు కరణం గారి అబ్బాయి. ‘‘శాస్త్రిగారూ, ఎవరైనా మద్యాన్ని త్రాగుతారు, కల్లును త్రాగుతారు. చెరకు పానకం లాంటివాటిని పుచ్చుకుంటారు. ఈమాత్రం భేదం మీలాంటి వాళ్లు పాటించకుండా మాట్లాడితే ఎలాగండీ?’’ అన్నారు. ‘‘అయ్యో! ఏదో తొందరపాటులో అనేశాను. ఏమనుకోకండి’’ అని శ్రీపాద అనడంతో వాతావరణం తేలికపడి అందరూ చెరకు పానకం త్రాగి, సారీ పుచ్చుకుని బయటపడ్డారు. ఆ రోజుల్లో ‘మాట’ పట్టింపులు అంతలా ఉండేవన్నమాట.
- డి.వి.ఎం.సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment