25 సంవత్సరాలు అనేది ఆసక్తికరమైన వయస్సును సూచిస్తుంది. మీరు ఈ వయసులోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అన్ని బార్‌ల తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. మిమ్మల్ని ఎవరూ ఇక అబ్బాయిగా భావించరు. 18 లేదా 21 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీరు ‘యంగ్’ అని పరిగణించుకోవచ్చు. కానీ 25 ఏళ్ల వయసులో మీరు వయోజనుల కిందే లెక్క. గత 25 ఏళ్లుగా నేను కాలమ్ రాస్తూనే ఉన్నాను. ప్రతి వారం నా వ్యాసం వచ్చేది. తాము చదివింది ప్రజలు ఇష్టపడ్డారనే నేను భావిస్తున్నాను. కానీ ఇన్నేళ్లుగా కాలమ్ ఉనికిలో ఉండటం అనేది ఇక ఆశ్చర్యం కలిగించదు. అయితే పాఠకులకు ఇన్నేళ్లు సుపరిచితం కావడం ఎంతో ఇష్టమైన విషయం కదా!
బహుశా ఇన్నేళ్లలో నేను రాస్తూవచ్చిన కంటెంట్ మారుతూ ఉండి ఉండవచ్చు. మొదట్లో నా రాతల్లో శైశవ దశ ఉండేది. నాలో ఒక భాగం వయోజనుడే ఉంటాడు కానీ మరొక భాగం పిల్లాడి గానే ఉంటాడు. కానీ నేను రుషిలాగా నటిస్తుంటాను. సిల్లీ జోక్స్ వేస్తున్నప్పుడు నాలో చిలిపితనం సులువుగా ఆవరిస్తుంటుంది. కాలమ్ ఇంతకాలం కొనసాగినందుకు ఈ జోక్స్, చిలిపితనమే కారణం అయి ఉండవచ్చని నా అనుమానం. ఒక వారం నా వ్యాసం మీకు ఆసక్తి కలిగించకపోతే మరోవారం తప్పక మీకు ఆసక్తికరంగా ఉండి ఉంటుంది.
నేను ఇన్నేళ్లుగా నిత్యం ప్రతివారం ఎలా రాస్తూ వస్తున్నారని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. 1997 జూలై 6న నా కాలమ్ ఒక దినచర్యలా ప్రారంభమైంది. నాటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్‌తో డిన్నర్ చేస్తున్న జ్ఞాపకాలను అది గుర్తు చేసింది. ఆయన నాకు ఆహ్వానం పంపినప్పుడు నేనెంత సంతోషించానంటే దాన్ని అసలు దాచుకోలేకపోయాను. విచారకరమైన విషయం ఏమిటంటే, అరకొర విషయాలే తప్ప దాంట్లో పెద్దగా నివేదించడానికి నా వద్ద సమాచారం ఏదీ లేకుండా పోయింది. నన్ను నేను ప్రదర్శించుకోవడమే నా నిజమైన ఉద్దేశంగా ఉండేది.
సంవత్సరాలు గడిచే కొద్దీ నా కాలమ్ అనేక దిశల్లో మెరుగుపడుతూ వచ్చింది. చాలా కాలంపాటు ఒకే పత్రికలో నా కాలమ్ ప్రయాణించింది (‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికలో ‘సండే సెంటిమెంట్స్’ పేరిట వచ్చింది). వారాంతపు అనుబంధ సంచికల్లో వెనుక పేజీలో అది మొదలైంది. ఆ సమయంలో అది ఒక డైరీగా ఉండేది. తర్వాత ఆ పత్రిక అనుబంధ సంచికను కూడా మెయిన్ పేపర్లో కలిపేయడంతో అప్పటి నుంచి నా కాలమ్ కూడా అక్కడే కొనసాగింది.
ఇక్కడే అనేకమంది జ్ఞానులు నా చుట్టూ ఉండటంతో నా కాలమ్ ప్రస్తుతం రూపంలో మెరుగుపడింది. దాని సైజ్ రీత్యా అది సింగిల్ ఇష్యూ కాలమ్‌గానే ఉంటూ వచ్చింది. స్థలాభావం కారణంగా నా కాలమ్ సైజ్ కూడా తగ్గిపోతూవచ్చింది. దీంతో అది ఒక ‘స్ప్లింట్ ఐడెంటిటీ’ని సాధించింది. ఈ స్కిజోఫ్రెనియా నేను రెండు స్వరాలతో మాట్లాడేలా చేసింది. ఆరోజు ప్రధాన సమస్యలపై సీరియస్ ప్రతిఫలనాలను ఒక స్వరం ప్రకటిస్తే, మరొక స్వరం జోకులతో, అసంబద్ధ ఆలోచనలతో కొనసాగేది.
గత పాతికేళ్లుగా నేను ప్రతి వారమూ నా కాలమ్ రాస్తూ వచ్చాను. ఒక్క వారం కూడా నేను రాయడం మానలేదు. ఒకే ఒక వారం మాత్రం నాటి సంపాదకుడితో చిన్నపాటి గొడవ కారణంగా దాని ప్రచురణ ఆ వారానికి ఆగిపోయింది. దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాన్ని గుర్తుంచు కోకపోతేనే ఉత్తమంగా ఉంటుంది. కానీ నా కారణంగా నా కాలమ్ గత పాతికేళ్లుగా ఆగిపోలేదు అని చెప్పడానికే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఒక అంచనా ప్రకారం నేను ఇప్పటికి నా కాలమ్‌లో పది లక్షల పదాలను రాసి ఉంటాను. నా కాలమ్‌లోని కొన్ని కథనాలను వివిధ ప్రచురణ సంస్థలు సంకలనాలుగా ప్రచురించాయి. రెండు సంకలనాలను విజ్డమ్ ట్రీ వాళ్లు ప్రచురిస్తే, మూడోది హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురించింది.
ప్రశాంతమైన సాయంవేళల్లో ఆ పుస్తకాలను నేను తడుముతూ ఉంటాను. నేను మొదట కాలమ్ రాయడం ప్రారంభించినప్పటికంటే అదే విషయాన్ని ఇప్పుడు ఎంత బాగా రాయగలిగి ఉండేవాడిని అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. వయస్సు నన్ను ఎదిగించి ఉండవచ్చు. ఈ క్రమంలో నేను జ్ఞానినయ్యానని నా నమ్మకం. మొదట్లో చాలా తేలిగ్గా రాస్తూ పోయేవాడిని. కానీ క్రమంగా నా కాలమ్ రాయాలంటే గట్టి కృషి చేయాల్సి వచ్చింది. ఒకోసారి అది నాకు ఎంతో ఇబ్బందికరంగా కూడా మారేది.
సంవత్సరాలపాటు నేను రాస్తూ వచ్చిన ఈ కాలమ్‌ను నామట్టుకూ ఎంతగానో ఆస్వాదించాను. ఎందుకంటే అవి పాఠకుల కోసం రాసినవి కదా! పాఠకుల ప్రశంసను కోరుకోవడం కంటే మించినది నాకు ఏదీ లేదు. పాఠకులతో పాటు నా సహోద్యోగులు కూడా సహకరిస్తూ వచ్చారు కాబట్టే ఇంత సుదీర్ఘ కాలం నా ఈ కాలమ్ కొనసాగింది. ఇంతకాలం నా కాలమ్‌ను చదివి నందుకు ఆదరించినందుకు, నాకు మద్దతి చ్చినందుకు పాఠకులందరికీ ధన్యవాదాలు. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి)
- కరణ్ థాపర్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment