రిషీ సునాక్ బ్రిటన్ తదుపరి ప్రధాని కావచ్చు అనే వాస్తవం, ఆ దేశం ఎంతగా మారిందో చెప్పే స్పష్టమైన, తోసిపుచ్చలేని సంకేతంగా నిలుస్తోంది. అయితే వాస్తవానికి చాలామందిలో ఆయన అత్యున్నత పదవిని పొందుతాడా అనే సందేహం ఉంటోంది కూడా! కన్సర్వేటివ్ పార్టీ సభ్యులతో ‘యూగవ్’ సంస్థ నిర్వహించిన పోల్... సునాక్‌కు చివరి అవరోధం ఎదురుకానుందనే ప్రశ్నను బలంగా లేవనెత్తింది. అదింకా కదలకుండా, కనబడకుండా అలాగే ఉందా? బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి టోరీ పార్టీ ఓటు వేస్తుందా అనే ప్రశ్న ఇప్పటికీ ఉదయిస్తోంది.
వాస్తవానికి జాతిపరమైన మైనారిటీలను తన మంత్రిమండలిలో చేర్చుకున్న మొదటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాదు. ఆ ఘనత టోనీ బ్లెయిర్‌కు దక్కింది. అయితే బోరిస్ జాన్సన్ తొలి కేబినెట్‌లో 20 శాతం మంది నల్లజాతి లేదా ఆసియన్ సంతతికి చెందినవారు కావడమే విశేషం. తర్వాత అత్యంత శక్తిమంతమైన రెండు మంత్రిత్వ శాఖలైన హోం శాఖ, ఆర్థిక శాఖలు భారత సంతతికి దక్కాయి. ఇప్పుడు జాన్సన్ గద్దె దిగేనాటికి, ఆయన ప్రభుత్వంలో చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు వ్యక్తులు కూడా ఆసియా సంతతికి చెందినవారే. అంతకుముందు కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్‌గా నల్లజాతి వ్యక్తి పనిచేయడం మరీ విశేషం. ఆయన ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
మార్పు నిజం!
వాస్తవం ఏమిటంటే, బ్రిటన్ సమాజంలో వచ్చిన లోతైన, విస్తృతమైన మార్పును బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప్రతిబింబిస్తోంది. ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణ మీడియా అని చెప్పవచ్చు. ప్రస్తుతం బీబీసీ వరల్డ్‌లోని అనేక మంది ఉద్యోగులు, బ్రిటిష్ పేపర్లలోని చాలామంది బై–లైన్ రచయితలు ఆసియా లేదా నల్లజాతికి చెందినవారే కావడం గమనార్హం. మనం బ్రిటిష్ పత్రికలు పెద్దగా చూడం కానీ బీబీసీని మాత్రం తప్పకుండా చూస్తాం. బీబీసీ చానెల్‌లోని యాంకర్లు, కరస్పాండెంట్ల పాక్షిక జాబితాను చూసినట్లయితే, ఎక్కువమంది ఆసియా లేదా ఆఫ్రికా మూలాలు కలిగిన వారే ఉండటం కొట్టొచ్చినట్లు మనకు కనబడుతుంది. మాథ్యూ అమ్రోలివాలా, గీతా గురుమూర్తి, జేమ్స్ కుమారస్వామి, జార్జి అలిగయ్య, సికిందర్ కిర్మాణీ, నోమియా ఇక్బాల్, సమీరా హుస్సేన్, రజనీ వైద్యనాథన్, అమోల్ రాజన్, యోగితా లిమాయే వంటివి ఈ జాబితాలో కనిపించే కొన్నిపేర్లు మాత్రమే!
కాబట్టి, బ్రిటన్ మారిందని మాజీ కేబినెట్ మంత్రి, గత 30 ఏళ్లుగా టోరీ ఎంపీగా గెలుస్తూ వస్తున్న ఆండ్రూ మిచెల్ చెప్పారంటే ఆయన అభిప్రాయం సరైందేనని చెప్పాలి. కన్సర్వేటివ్(టోరీ) నాయకత్వం కోసం పోటీపడుతున్న ఎనిమిది మంది ముఖ్య అభ్యర్థుల్లో నలుగురు జాతిపరంగా మైనారిటీలకు చెందిన వారే. రిషీ సునాక్ సైతం రిచ్‌మండ్ ప్రాంతంలోని యార్క్‌షైర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఇంగ్లిష్ జాతీయులే. కన్సర్వేటివ్ పార్టీ మాజీ చైర్మన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి అయిన విలియం హేగ్ స్థానంలో సునాక్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీలలో ఆరు రౌండ్ల ఓటింగ్ ముగిసేసరికి అత్యంత జనాదరణ కలిగిన నేతగా రిషీ సునాక్ బరిలో నిలిచారు. ఆయనకు కన్సర్వేటివ్ ఎంపీలలో 137 ఓట్లు రాగా, 113 ఓట్లతో ఆయన సహ మంత్రి లిజ్ ట్రస్ రెండో స్థానంలో నిలిచారు.
‘మూల’ ప్రశ్న
అయితే పార్టీ సభ్యులలో ఎక్కువమంది నివసిస్తున్న టోరీ షైర్స్ ప్రాంతం జాతిపరంగా మైనారిటీ ప్రధానమంత్రికి అనుకూలంగా ఓటు వేస్తుందా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య వర్ణ భేదం, జాత్యభిమానం మాత్రమే కాదు. ఈ అంశాన్ని మనం కొట్టిపారవేయలేం. కానీ వలస వచ్చిన భారతీయ కుటుంబానికి చెందిన మునిమనవడైన సునాక్‌ను గెలిపించడం కంటే, తమ సొంత జాతీయుడినే బ్రిటషర్లు ఎన్నుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారా అన్నదే ప్రశ్న. ఇది స్పష్టమైన, అర్థం చేసుకోదగిన ప్రశ్న. 2004లో భారతదేశంలో మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. సోనియాగాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారు. కానీ ఇటాలియన్ మూలాలు ఉన్న ఒక ప్రధానిని భారత్ ఆమోదించి ఉండేదా అనేది ప్రశ్నే. దీన్ని మరోలా చెప్పనివ్వండి. కన్సర్వేటివ్ సభ్యులతో నిర్వహించిన పోల్స్‌లో రిషీ సునాక్ కంటే లిజ్ ట్రస్ 24 శాతం అధికంగా పాయింట్లు సాధించారని ‘యూగవ్’ ఎందుకు సూచించినట్లు? వాస్తవానికి రిషీ సునాక్ ఆమె కంటే మేధావి, ఉత్తమ ఆర్థికవేత్త, సూపర్ టెలివిజన్ పెర్ఫార్మర్ మాత్రమే కాకుండా ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తి కూడా! పైగా ‘డిషీ రిషీ’(ఆకర్షణీయమైన రిషీ) అని వారు సునాక్‌ని పిలిచి కూడా ఎక్కువ కాలం కాలేదు. కానీ ఈరోజు బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో తాను అండర్‌డాగ్‌గానే ఉంటున్నట్లు రిషి స్వయంగా ఒప్పుకున్నారు కూడా! సునాక్‌ను, ఆయన పార్టీ సభ్యత్వాన్ని ప్రతినిధుల సభలోని సహచరులు ఇంత భిన్నంగా ఎలా చూస్తున్నారు అనేది కూడా ప్రశ్నే.
కొత్త చరిత్ర
బ్రిటన్ ప్రధానిగా రిషీ సునాక్ తప్పక గెలుస్తాడని నమ్మకంగా చెబుతున్న ఆండ్రూ మిచెల్, రెండు కారణాలు ఓట్లను రిషీకి అనుకూలంగా మారుస్తాయని చెప్పారు. మొదటిది ఏమిటంటే – రిషీ సునాక్ గుణగుణాలు, అనుభవం, వ్యక్తిత్వమే ఆయన్ను బ్రిటన్ ప్రధాని పదవికి చేరువ చేస్తాయని ఆండ్రూ అభిప్రాయం. మరో మాటలో చెప్పాలంటే బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు మెరుగైనవారో వారినే పార్టీ సభ్యులు ఎన్నుకుంటారని మిచెల్ భావన. రెండో కారణం ఏమిటంటే – బ్రిటన్‌లోని లేబర్ పార్టీ లీడర్ కెయిర్ స్టార్మర్‌ను, ప్రతిపక్షాన్ని ఓడించే సమర్థత రిషీ సునాక్‌కు మాత్రమే ఉందని ఆండ్రూ చెబుతున్నారు. చరిత్రను సృష్టించేలా వరుసగా అయిదోసారి కన్సర్వేటివ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా లిజ్ ట్రస్‌కి కాదు, రిషీ సునాక్‌కే ఉందని ఆండ్రూ అభిప్రాయం.
బహుశా, ఆండ్రూ మిచెల్ చెబుతున్నది సరైనదే కావచ్చు. పొరుగునే ఉన్న ఐర్లండ్‌కి భారత్ సంతతి వ్యక్తి ప్రధాని అయ్యారు. రెండోసారి కూడా భారత సంతతి వ్యక్తే అక్కడ ప్రధాని కావచ్చు. పైగా పోర్చుగల్‌లో కూడా భారత సంతతి ప్రధానే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు బ్రిటన్ కూడా దీనికి భిన్నంగా ఉండదు. రిషీ సునాక్ ఎన్నిక ‘ఎంపైర్ స్ట్రయికింగ్ బ్యాక్’ అనే భావనను సరిపోలి ఉంటుంది. చివరగా నేను ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. రిషీ సునాక్ బ్రిటన్ ప్రధానిగా గెలిచినా, గెలవకపోయినా సరే బ్రిటన్ మాత్రం మునుపటిలా మాత్రం ఉండదు. అలాంటి మార్పును మనం అభినందించాలి. (క్లిక్: ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి?)
- కరణ్ థాపర్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment