చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు మానవతా దృక్పథంతో పాఠాలు చెప్పాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.ప్రతాప్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. బుధవారం ఆయన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్స్ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కొన్ని రంగాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లడంతో రెండు నెలలుగా పాఠశాలలు జరగడంలేదని, ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో 10వ తరగతి విద్యార్థులకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించాలన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్ర జిల్లాల్లోని విద్యార్థులకు సిలబస్ 15 శాతం కూడా పూర్తికాలేదన్నారు. ఇలా అయితే పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ వారికంటే మన విద్యార్థులు వెనుకబడిపోతారన్నారు. బుధవారం చంద్రగిరిలో పాఠాలు చెబుతుంటే కొందరు అడ్డుకున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు టీచర్స్ జేఏసీ నేతలు సైతం అంగీకరించారు.
వద్దు అంటే అన్నీ బంద్ చేయండి
టెన్త్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు మేం ఒప్పుకోం అనే వాళ్లు తమ ప్రాంతాల్లో అన్నీ బంద్ చేయించాలని డీఈవో డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను, ఆటోలను, సినిమా థియేటర్లను, వైన్ షాపులు ఇలా సకలం ఆపివేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇందులో విద్యాశాఖ ముందుం టుందని చెప్పారు. త్రైమాసిక పరీక్షలు వాయి దా పడ్డాయన్నారు.
టీచర్లు సమ్మె విరమించిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా త్రైమాసిక పరీక్షల ప్రశ్నపత్రాలు ఇవ్వలేమని, వాళ్లు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మదనపల్లె డీవైఈవో శామ్యూల్, అధికారులు దినకర్‌నాయుడు, నిరంజన్‌కుమార్, టీచర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ ఏఎం గిరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, మధు, నరేంద్ర, సహదేవనాయుడు పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు పాఠాలు చె ప్పండి
Published Thu, Sep 26 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement