![Head Master Bumper Offer To Tenth Students Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/21/hm.jpg.webp?itok=NqKv_Fk-)
విమానాశ్రయంలో వీడ్కోలు పలుకుతున్న హెచ్‌ఎం శివాజీ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సాధారణంగా టెన్త్ టాపర్లకు వివిధ రకాల బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ ఎక్కువగా కార్పొరేట్ విద్యార్థులకే. ప్రభుత్వ చదువులు చదివిన వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే. అలాటిది.. ప్రభుత్వ హైస్కూల్‌లో చదివిన విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం ఉంటుందని ఎవరు ఊహిస్తారు? బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు స్కూలు హెడ్ మాస్టర్ ఆ అవకాశం కల్పిస్తారని ఎవరు అనుకుంటారు? అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు దానిని సాధ్యం చేశారు. పేద పిల్లలు తమ ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించేట్టు వారికి ప్రోత్సహించడానికి, ఉన్నత లక్ష్యాలు అందుకునే దిశగా వారిని ఉత్తేజపరచడానికి చింతలగ్రహారం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివాజీ ఈ ఆఫర్ పెట్టారు.
తమ హైస్కూల్‌లో టెన్త్ టాపర్లుగా 10/10 సాధించుకున్న విద్యార్థులను ఆయన ఏటా ప్రోత్సహిస్తుంటారు. గతేడాది రూ. 5 వేల వంతున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన ఆయన ఈసారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10/10 గ్రేడ్లు వచ్చిన వారందరినీ విమానంలో హైదరాబాద్ టూర్‌కు పంపిస్తానని విద్యార్ధులను ఉత్తేజపరిచారు. దాంతో విద్యార్థులు పోటాపోటీగా చదివారు. గత టెన్త్ పరీక్షల్లో పొలమరశెట్టి కుశలవర్ధన్, దాడిరూప, వడ్డీది సింధు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. వీరు విజయవాడలో ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా సాధించారు. మాట ఇచ్చిన శివాజీ వాగ్దానం ప్రకారం వీరిని శుక్రవారం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్‌కు టూర్‌కు పంపారు. రూప టికెట్ ఉన్నా అనివార్యకారణాల వల్ల ఈ అవకాశాన్ని చివరి నిమిషంలో పొందలేదు. కుశలవర్ధన్, సింధులకు హైదరాబా ద్ చూపించడానికి తోడుగా నాగమణి టీచర్‌ను కూడా పంపారు. ఇలా రెండురోజుల పాటు హైదరాబాద్‌లో ముఖ్య పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించి తిరిగి గరీబ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకుంటారు. శుక్రవారం విమానాశ్రయంలో ఈవిజేతలకు హ్యాపీ జర్నీ అంటూ హెచ్‌ఎం శివాజీ వీడ్కోలు పలకడాన్ని అక్కడి ప్రయాణికులంతా చూసి,మంచి మాస్టారని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment