ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం
తరగతులు ఐదు.. గది మాత్రం ఒక్కటే.. ఆ ఒక్క గదిలోనే ఐదు తరగతుల పిల్లలకు విద్యాబోధన. ఇదెక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న బడిలో కాదు.. జీవీఎంసీ పరిధి పరవాడ మండలం మంత్రిపాలెంప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే నడుస్తున్న ఈ బడి కథాకమామిషు ఇదీ!!
సాక్షి, విశాఖపట్నం: నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్ తుపానుకు మంత్రిపాలెం ప్రాథమిక పాఠశాల దెబ్బతింది. అక్కడ చదువుకు వీలుకాక ఊళ్లోనే ఉన్న మరో అదనపు గదికి ఈ స్కూలును తరలించారు. పట్టుమని పదిహేను మంది కూడా కూర్చోడానికి సరిపోని అతి చిన్న ఇరుకు గది అది. అందులోనే ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ స్కూలులో పాఠాలు చెప్పడానికి ఇద్దరు టీచర్లున్నారు. వారికి ఒక్కో కుర్చీ, ఒక్కో టేబుల్ ఉంటాయి. ఇక స్టేషనరీ, రిజిస్టర్లు, రికార్డులు భద్ర పరచుకోవడానికి బీరువా, చిన్నపాటి షెల్ఫ్‌లున్నాయి. ఇవన్నీ ఉన్న ఒకే ఒక్క గదిలో ఈ ఐదు తరగతుల పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు.
ఈ పాఠశాలలో ప్రస్తుతం ఒకటో తరగతి 8 మంది, రెండో తరగతి ఇద్దరు, మూడో తరగతి 12 మంది, నాలుగో తరగతి ఐదుగురు, ఐదో తరగతి 10 మంది వెరసి 37 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ గదిలో ముందు వరసలో ఒకటి, రెండు తరగతులు, వెనక వరసలో మూడు, నాలుగు తరగతుల వారిని కూర్చోబెడుతున్నారు. ఈ పిల్లలతో గది కిక్కిరిసిపోతే ఐదో తరగతి వారిని గది బయట వరండాలోకి పంపిస్తారు. గదిలో ఏ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పినా అందరికీ వినిపిస్తాయి. ఒక క్లాసు పిల్లలకు పాఠాలు చెబుతుంటే ఇతర తరగతుల పిల్లలు మౌనం పాటిస్తారు. ఎంతగా మౌనం పాటించినా ఒకరి పాఠాలు మరొకరు తప్పక వినాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో టీచర్లు ఇతర క్లాసుల వారికి వర్క్ ఇస్తుంటారు. టీచర్లు ఒకే గదిలో ఐదు తరగతులకు చెబుతున్న పాఠాలు ఆ చిట్టి బుర్రలకు అర్థం కావడం లేదు. అలా అని వీరిని మరోచోటకు తరలించే అవకాశం ఉపాధ్యాయులకు ఉండడం లేదు. దీంతో చిన్న వయసులోనే వారి మనసుపై భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితి వల్ల ఆ పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ చిన్నారులు ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తేటతెల్లమవుతోంది.
ప్రైవేటుకు పంపుతున్నారు..
ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా వసతులు కల్పిస్తున్నామని వాటిలో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేస్తోంది. దీంతో మంత్రిపాలెంలో కొంతమంది తమ పిల్లలను చేర్చడానికి ముందుకొచ్చారు. అక్కడ చేరిన పిల్లల పరిస్థితిని చూసి గ్రామానికి ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఇలా ఈ గ్రామం నుంచి 80 మంది వరకు ఎలిమెంటరీ పిల్లలు ప్రైవేటు స్కూ ళ్లకు వెళ్తున్నారు. ఈ స్కూలుకు కొత్త భవనం కడతామని నాలుగేళ్లుగా చెబుతున్నారు. సర్వశిక్షా అభియాన్ ఇంజినీర్లు వచ్చి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే బండారు, విద్యాశాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదు.
వానొస్తే సెలవే..
1999లో నిర్మించిన ఈ అదనపు గది శిథిలస్థితికి చేరుకుంది. వర్షాలకు గదంతా నీటితో తడిసిపోతుంది. దీంతో వానొస్తే విధిలేక ఈ బడికి సెలవు ప్రకటిస్తారు. రాత్రివేళ గది వరండాలో కుక్కలు విశ్రాంతి తీసుకుంటాయి. మర్నాడుకి వాటి విసర్జాలను తొలగించి నీటితో శుభ్రం చేసి అక్కడే ఐదో తరగతి పిల్లలు చదువుకుంటున్నారు. ఇది ఈ పిల్లలకు నిత్యకృత్యంగా మారింది.
కొత్త భవనం నిర్మిస్తేపిల్లలు పెరుగుతారు..
మా పాఠశాలకు కొత్త భవనం నిర్మిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఇతర గ్రా మాల్లో ప్రైవేటు స్కూ ళ్లకు వెళ్లే వారిని మా స్కూలుకే పంపుతారన్న నమ్మ కం ఉంది. ఇప్పుడున్న పిల్లలకే గది చాలక విద్యాబోధనకు ఇబ్బంది అవుతోంది.– జగన్మోహనరావు,ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment