
థాంక్యూ సార్!
* టెన్త్ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల అవిరళ కృషి
* మట్టిలో మాణిక్యాల వెనుక టీచర్ల ఉమ్మడి ప్రణాళిక
* సర్కారు బడుల్లో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించడంలో సక్సెస్
* మారిన సిలబస్.. కొత్త పరీక్ష విధానాన్ని సవాల్‌గా తీసుకున్న టీచర్లు
* ప్రత్యేక దృష్టి.. అంకితభావంతోనే సాధ్యమైందంటున్న ప్రధానోపాధ్యాయులు
* ప్రభుత్వ స్కూళ్లపై చిన్నచూపును కడిగిపారేసిన పంతుళ్ల పట్టుదల
సర్కారీ స్కూళ్లు అనగానే ఓ చిన్నచూపు.. పంతుళ్లు చదువు సరిగ్గా చెప్పరని ఓ అపవాదు! కానీ ఇటీవలి టెన్త్ ఫలితాలు వీటన్నింటినీ కొట్టిపడేశాయి. ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ పాఠశాలలు జైత్రయాత్ర సాగించాయి. విద్యార్థుల దీక్షకు ఉపాధ్యాయుల అవిరళ కృషి తోడవడంతో మట్టిలో మాణిక్యాలు మెరిశాయి. బాగా చదవాలంటూ వెన్నుతట్టడమే కాదు.. అనుక్షణం వారికి ప్రేరణ అందిస్తూ విజయపథంలో సాగేందుకు టీచర్లు పడ్డ తపన ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. టీచర్ల ప్రత్యేక శ్రద్ధ వల్లే తాము ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మంచి మార్కులు తెచ్చుకున్నామంటున్నారు విద్యార్థులు. ఉత్తమ బోధనతో తమను ఉన్నత స్థానంలో నిలిపిన గురువుకు మనస్ఫూర్తిగా ‘థాంక్యూ సార్.. థాంక్యూ టీచర్’ అని చెబుతున్నారు! విద్యార్థుల విజయపథం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేసిన కృషిపై కథనం...
సిర్సవాడ.. 100% పాస్
సాక్షి, హైదరాబాద్: సిర్సవాడ.. మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలంలోని గ్రామం. పరిసరాల్లో మరో ఏడెనిమిది పల్లెల విద్యార్థులంతా సిర్సవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతారు. ఈ స్కూలు ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖరరెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. తోటి ఉపాధ్యాయుల సహకారం, పక్కా ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేందుకు (వంద శాతం ఫలితాల సాధనకు) ఎంతగానో శ్రమించారు. బాగా చదవాలంటూ ప్రోత్సహించడమే కాదు పరీక్షలు రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు స్కూల్లోనే నివాస వసతి ఏర్పాటు చేశారు. అందరూ బాగా చదివారు. వంద శాతం ఫలితాలను సాధించారు. 57 మంది విద్యార్థుల్లో 32 మంది బాలురు, 25 మంది బాలికలు. అంతా ఉత్తీర్ణులయ్యారు. 16 మంది 9 జీపీఏ సాధించారు.
ఫలితాల కోసం ఆత్రుతగా చూసిన హెచ్‌ఎం
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి వెంకట్‌రెడ్డి ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ‘విద్యార్థుల కంటే నేనే ఎక్కువ ఆత్రుతగా చూశాను. ఏడాది పాటు పదో తరగతి విద్యార్థుల కోసం ప్రణాళికాబద్ధంగా సాగించిన ఫలితం రిజల్ట్స్ ద్వారానే తెలిసేది’ అని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో చదివిన సరిత 10 జీపీఏ సాధించి ప్రశంసలు అందుకుంది. స్థానికంగా ఆటో నడుపుకునే వ్యక్తి కూతురు సరిత. ఆమెను ఉన్నతస్థానంలో నిలిపేందుకు టీచర్లు కృషి చేశారు. విద్యార్థులందరికీ బోధన ఒకే తీరులో ఉండేదని, అయితే, బాగా చదివేవారిని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేయడంతో ఊహించినట్లే సరిత 10 జీపీఏ సాధించిందని వెంకట్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
సవాల్‌గా తీసుకున్నాం
నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయరావు మారిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశారు. తోటి ఉపాధ్యాయులను ఉత్తేజపరుస్తూ ఆయన చేసిన కృషి ఫలించింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనేక మంది 8 అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించారు. ‘హిందీ, సోషల్‌కు టీచర్లు లేకున్నా ఉన్న టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పజెప్పి సబ్జెక్ట్ వారీగా ప్రతిరోజు టెస్ట్‌లు పెట్టాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం.’ అని విజయరావు చెప్పారు.
శ్రీరంగాపూర్.. హెచ్‌ఎం, టీచర్ల ఉమ్మడి కృషి
మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలది మరో విజయగాథ. ఈ స్కూల్లో చదివిన ముగ్గురు విద్యార్థులు టెన్త్‌లో 9.5 జీపీఏ సాధించారు. వారి ఫలితాల వెనుక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి దాగుంది. ‘నేను, మా ఉపాధ్యాయులం అందరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. చదువులో ముందున్న వారిని ఒక బ్యాచ్‌గా, కాస్త వెనుకబడ్డ వారిని మరొక బ్యాచ్‌గా చేసి వారి తెలివితేటలకు తగ్గట్టు పాఠ్య ప్రణాళిక సాగించాం. ఈ విజయం వెనుక మా ఉపాధ్యాయుల క్రెడిట్‌తో పాటు విద్యార్థుల శ్రమ కూడా ఉంది’ అని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదో కాదని, అందరిదీ సమాన కృషి అంటూ ఆయన తన పేరు వాడుకునేందుకు కూడా అంగీకరించలేదు. ‘మా పాఠశాలలో హెచ్‌ఎంతో పాటు అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రోత్సాహం అందించారు’ అని 9.5 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ ఆనందంతో చెప్పింది.
చౌటుప్పల్‌లో నూటికి నూరు శాతం
టీచర్ల ఉమ్మడి కృషితో నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాల నూటికి నూరు శాతం ఫలితాలు సాధించింది. ‘విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే నూరు శాతం ఉత్తీర్ణత సాధించాం. 79 మందికి గాను 79 మంది ఉత్తీర్ణులయ్యారు. శివాని సరస్వతి అనే విద్యార్థిని 10కి 10 పాయింట్లు సాధించింది. విద్యార్థులతో కలిసిపోయి, ఉపాధ్యాయులంతా కృషి చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి’ అని పాఠశాల ప్రిన్సిపాల్ పి.విద్యాసాగర్ చెప్పారు.
బుసిరెడ్డిపల్లి.. ప్రణాళికాబద్ధ బోధన
మహబూబ్‌నగర్ జిల్లాలోనే పాన్‌గల్ మండలంలోని బుసిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇక్కడి ప్రధానోపాధ్యాయుడు రాఘవేంద్రరావు విశేష కృషి చేశారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతి ప్రారంభం నుంచే ప్రణాళికబద్ధంగా విద్యాబోధన సాగేలా చూశారు. ఒక్క విద్యార్థి బడికి రాకపోయినా టీచర్లను తోటి విద్యార్థులను పంపి కారణాలు తెలుసుకునేవారు. అనారోగ్యం అయితే తప్ప కావాలని ఎగ్గొడితే బతిమాలి వారిని తీసుకొచ్చేవారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు చెప్పించేవారు. వీరి ఉమ్మడి కృషి కారణంగా ఆ స్కూలు విద్యార్థిని ఎస్.సింధూజ మొన్నటి పదో తరగతి ఫలితాల్లో ఏకంగా 9.8 జీపీఏ సాధించింది. రాష్ట్ర స్థాయిలో మొదటి 500 మందిలో సింధూజ ఒకరుగా నిలిచారు.
టీచర్ల సాయంతో వైకల్యం అధిగమించి..
వరంగల్ జిల్లా దేవరప్పుల మండల దారావత్ తండాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన దారావత్ సజ్జన్ నాయక్ రెండో కుమారుడు దారావత్ స్వామి. పుట్టుకతో చేతులు సరిగా లేవు. వంకర కాళ్లతో జన్మించాడు. మొదట్లో కాళ్లతో కట్టెలను పట్టుకుని భూమిపై గీతలు గీసిన స్వామిని చూసి తల్లిదండ్రులు ఆరో ఏట బడిబాట పట్టించారు. తండాలోనే ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు వెంకన్న, జ్యోతి.. స్వామికి మనోధైర్యం అందించి కాళ్లతో బలపం పట్టించి చదువుకు శ్రీకారం చుట్టించారు.
ఇలా ఏడో తరగతి పూర్తి చేసిన స్వామి పదికిలోమీటర్ల దూరంలోని కడవెండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు. చదువుపై స్వామికి ఉన్న మమకారాన్ని చూసిన అక్కడి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న ‘జాన్‌డీబ్రీట్టో’ అనే ప్రైవేటు స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మూడేళ్ల పాటు ఆ పాఠశాల టీచర్లు వెంకటేశ్వర్లు, కేదారీ, హెచ్‌ఎం ఖదీర్‌మీయా స్వామి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. చేతులు లేకపోయినా కాళ్లతో పరీక్ష రాసి పదో తరగతి పాసయ్యేలా చూడాలన్న ఆ ఉపాధ్యాయుల కల నెరవేరింది. పదో తరగతి పరీక్షల్లో స్వామి 6.7 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.