ఇద్దరు టెన్త్‌ విద్యార్థినుల ఆత్మహత్య | Two Tenth students commit suicide | Sakshi
Sakshi News home page

ఇద్దరు టెన్త్‌ విద్యార్థినుల ఆత్మహత్య

Published Sun, Feb 4 2024 4:24 AM | Last Updated on Sun, Feb 4 2024 4:24 AM

Two Tenth students commit suicide - Sakshi

సాక్షి, యాదాద్రి, భువనగిరి క్రైం:  భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్‌ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.

స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్‌లో జూనియర్, సీనియర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు.

విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్‌ టీచర్‌ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. 

యూనిఫాం చున్నీలతో ఉరేసుకుని.. 
గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్‌ టీచర్‌ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు  బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు.  

మమ్మల్ని ఒకే దగ్గర సమాధి చేయాలి 
టెన్త్‌ విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు.  ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నాం. మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది..’ అంటూ భవ్య, వైష్ణవి నోట్‌ రాశారు.

భవ్య 3 వతరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఏడవ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య, వైష్ణవికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వార్డెన్‌ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీనియర్, జూనియర్‌ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement