ఇద్దరిని బలిగొన్న ‘క్షణికావేశం’
రసూల్‌పురా: క్షణికావేశం రెండు నిండు ప్రాణాలు బలిగొంది. భర్తలో మార్పు రావడంలేదని ఇల్లాలు, తల్లి లేకుండా తాము ఉండలేమని ఇద్దరు కూతుళ్లు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసింది. కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న ముగ్గురిలో తల్లి కవిత మృత్యువుతో పోరాడుతుండగా, ఆమె ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18), భావన (16) మృతిచెందారు. కవిత తండ్రి శ్యాంసుందర్ లోహియా, సోదరుడు ఆనంద్ లోహియాలు శనివారం కార్ఖాన పీఎస్‌లో కవిత భర్త దినేష్‌పై ఫిర్యాదు చేశారు.
మూడు సంవత్సరాలుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వారి మృతికి కారణమైన దినేష్‌ను కఠినంగా శిక్షించాలని వారు సీఐ నాగేశ్వర్‌రావును కోరారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ఉన్న దినేష్, అతడి సోదరుడు నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను శ్యాంసుందర్ లోహియా కుటంబ సభ్యులకు అప్పగించారు.
ముందుగానే పెట్రోల్ తెచ్చుకున్నారు..
దినేష్ ప్రవర్తనను మార్చుకోకపోవడంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ పంప్ నుంచి లీటరున్నర పెట్రోల్ తెచ్చుకున్నారు. శుక్రవారం ఒంటిపై పోసుకుని కవిత నిప్పంటించుకోగానే, తల్లి లేకుండా తాము బతుకలేమని ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో పలు అనుమానస్పద అంశాలపై పోలీసులు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన అనంతరం ఇంట్లోని సీసీ కెమెరాలు మాయమైనట్లు సమాచారం.
కాగా వాచ్‌మెన్‌ను కూడా దినేష్ పంపించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలోని పాత ఇంటిని కొలుగోలు చేసి దానిని కూల్చివేసి తిరిగి భవనాన్ని నిర్మించుకున్నారని, చుట్టు పక్కల వారితో కలసి మెలసి ఉండేవారు కాదని కాలనీ వాసులు పేర్కొన్నారు.