సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల హాస్టళ్లు కూడా వార్షిక పరీక్షల వరకే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, మాస్కు ధరించకుంటే రూ.100 ఫైన్ విధించాలని ఆదేశించారు.
సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం పాటించటాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 9వ తరగతి వరకు స్కూళ్లను మూసివేస్తున్నందున టెన్త్ విద్యార్థులను భౌతిక దూరం పాటించేలా దూర దూరంగా కూర్చోబెట్టి బోధన కొనసాగించవచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా పూర్తి కావస్తున్నందున ఈ దశలో ఆపాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
104 కాల్ సెంటర్‌కు విస్తృత ప్రచారం....
– 104 కాల్ సెంటర్‌కు మరింత విస్తృత ప్రచారం కల్పించాలి. కోవిడ్ సమస్యలన్నిటికీ ఆ నెంబరు పరిష్కార కేంద్రంగా ఉండాలి.
– కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి.
– సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలి.
– ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు, శానిటేషన్ పక్కాగా ఉండేలా చూడాలి.
– గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా సర్వే చేపట్టి ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి. విశాఖలోని ప్లాంట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.
ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందం
రోజూ 310 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 146 ఆస్పత్రులలో 26,446 ఆక్సిజన్ సదుపాయాలున్న బెడ్లు ఉండగా పూర్తిస్థాయిలో సేవలకు రోజూ 347 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 577 కిలోలీటర్ల పూర్తి స్థాయి ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం ఉందని, అది అన్ని ఆస్పత్రులకు ఒకటిన్నర రోజులకు సరిపోతుందన్నారు.
అన్ని కోణాల్లో చర్చించాకే నిర్ణయం: మంత్రి సురేష్
ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని కోణాల్లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. స్కూళ్లలో శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ జరిగే చోట కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment