సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈవో జవహర్‌రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి
తిరుమల : తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజూ అవసరమయ్యే నెయ్యిని దేశవాళీ ఆవుల నుంచి సేకరించడానికి త్వరలో ‘నవనీత సేవ’ పేరుతో నూతన సేవకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, శ్రీవారి ఆలయంలో నైవేద్యానికి వినియోగించే ప్రసాదాల తయారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవసరమవుతుందని.. ఇందుకోసం సుమారు 1,200 లీటర్ల పాలు కావల్సి ఉంటుందన్నారు. తిరుమల ఏడుకొండలకు సూచికగా ఏడు దేశవాళీ రకాల ఆవులతోపాటు స్థానికంగా ఉన్న మరో మూడు రకాలతో తిరుమలలో 250–300 ఆవులను సేకరించి పాల ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవాళీ ఆవుపాల నుంచి తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యిని భక్తుల నుంచి కూడా విరాళంగా తీసుకుంటామని.. భక్తులు వారి శక్తి మేరకు నెయ్యి విరాళంగా ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాధికార మండలి సమావేశం జరిగింది. అనంతరం మండలి చైర్మన్, ఈఓ జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
►శ్రీవారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి తయారీకి పలువురు భక్తులు 25 గిర్ గోవులను విరాళంగా అందించారు.
►గో సంరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గోసంరక్షణ ట్రస్టులో కో–ఆప్షన్ సభ్యులుగా నియమిస్తాం.
►టీటీడీకి ఏటా అవసరమయ్యే ఏడు వేల టన్నుల శనగపప్పును గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దానినే కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాం.
►తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల దాణా తయారీ ప్లాంట్, పశువుల సంతానోత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాలని నిర్ణయించాం.
►తిరుపతి ఎస్వీ గోశాలలో పంచగవ్యాలతో తయారుచేసిన అగరబత్తీలను ఆగస్టు 15 నుండి తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతాం.
►అలాగే, 4 నెలల్లోపు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీనర్ వంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాం.
►టీటీడీ ముద్రణాలయంలో ఏటా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు విలువయ్యే పనులు జరుగుతున్నాయి. పీపీపీ విధానంలో అధునాతన యంత్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారిని ఆహ్వానిస్తాం.
►సప్తగిరి మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డును ఇటీవల నిష్ణాతులైన పండితులతో ఏర్పాటుచేశాం. త్వరలో పత్రికను సరికొత్త రూపంతో పాఠకుల ముందుకు తీసుకొస్తాం.
►తిరుమలలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాలని నిర్ణయించాం. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టీటీడీ సొంతమవుతాయి.
►2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్ డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు ముద్రించేందుకు ఆమోదించాం.
►టీటీడీ పరిపాలనా భవనం, ముద్రణాలయం, రవాణా విభాగంలో సీసీటీవీల ఏర్పాటుకు రూ.2 కోట్ల టెండర్లు ఖరారు చేశాం. 22 బ్యాగేజి స్కానర్ల కొనుగోలు నిమిత్తం రూ.4.27 కోట్ల మంజూరుకు ఆమోదించాం.
►త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామివారి సూచనల మేరకు పలు ఆలయాల అభివృద్ధికి రూ.8.94 కోట్లు అందిçస్తున్నాం. పురాతన విఠలేశ్వరస్వామివారి ఆలయం రాతి కట్టడానికి రూ.6 కోట్లకు పైగా మంజూరు చేశాం.
►‘బర్డ్’ పాత భవనంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న ఎస్వీ చిన్నపిల్లల ఆసుపత్రిలో రూ.6 కోట్లతో అధునాతన ఫ్లాట్ డిటెక్టర్ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించాం. ఈ సమావేశంలో ఏఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవి, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి, అదనపు ఎఫ్‌ఏ అండ్ సీఏఓ రవిప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment