ఎక్కడి ‘రేట్లు’ అక్కడే! | Repo rate unchanged at 4percent and 24x7 RTGS from Dec 20 | Sakshi
Sakshi News home page

ఎక్కడి ‘రేట్లు’ అక్కడే!

Published Sat, Oct 10 2020 4:42 AM | Last Updated on Sat, Oct 10 2020 4:47 AM

Repo rate unchanged at 4percent and 24x7 RTGS from Dec 20 - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా సాగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 4 శాతంగానే కొనసాగించాలని శుక్రవారం వరకూ వరుసగా మూడు రోజులుగా సాగిన గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ధరల స్పీడ్‌ (2019 ఇదే కాలంలో పోల్చి) ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డ విధాన ప్రకటన తరువాతి త్రైమాసికాల్లో ఇది దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వడ్డీరేట్లు మరింత తగ్గేందుకే అవకాశం ఉందని మార్కెట్‌కు సూచించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది.

2021 ఏప్రిల్‌–జూన్‌లో 20.6 శాతం వృద్ధి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్‌–2021 మార్చి) ఎకానమీ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. 2020–21 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 23.9 శాతం క్షీణతను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్‌ , డిసెంబర్‌ త్రైమాసికాల్లోనూ క్షీణ రేటే నమోదవుతుందని అంచనా.  ఈ క్షీణ రేట్లను వరుసగా 9.8 శాతం, 5.6 శాతంగా లెక్కగట్టింది. అయితే చివరి త్రైమాసికం అంటే జనవరి–మార్చి త్రైమాసికంలో స్వల్పంగా 0.5 శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్‌–2021 జూన్‌) భారీగా 20.6 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తోంది. ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్‌ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నాయి. అయితే ఇందుకు బేస్‌ ఎఫెక్ట్‌ (2020లో దారుణ పతన స్థితి) మరీ తక్కువగా ఉండడం కారణమని ఆయా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు చక్కటి తోడ్పాటును అందిస్తుందని విధాన కమిటీ అంచనావేసింది. మొత్తంగా చూస్తే, కరోనా వైరస్‌పై పోరులో భారత్‌ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని, కరోనా కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొంది.   

ద్రవ్యోల్బణం దిగివస్తుంది
సెప్టెంబర్‌ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో  లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి అంచనాల ప్రకారం,  సెప్టెంబర్‌ త్రైమాసికంలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8 శాతం. (ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ఈ రేటు మైనస్‌ 2 లేదా ప్లస్‌ 2తో 4 శాతం వద్ద కొనసాగాలి. సరఫరాలు– డిమాండ్‌ మధ్య అసమతౌల్యత కారణంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుంది. దీనికితోడు వ్యవసాయ రంగం పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంది.   వెరసి డిసెంబర్‌ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది.  

చిన్న పరిశ్రమలకు ఊరట
రిటైల్‌ రుణ గ్రహీతలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించింది. ఇందుకు సంబంధించిన పరిమితిని (ఫండ్‌ అండ్‌ నాన్‌–ఫండ్‌ ఆధారిత) రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెంచింది. దీనికితోడు ఈ రుణాల మంజూరీకి సంబంధించి మూడవ పార్టీ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల (సీఆర్‌ఏలు) నుంచి బ్యాంక్‌ లోన్‌ రేటింగ్‌ (బీఎల్‌ఆర్‌)ను బ్యాంకులకు పొందాల్సిన అవసరం లేదు.  

ఎగుమతిదారులకు వరం
ఎగుమతిదారుల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తూ, సిస్టమ్‌ ఆధారిత ఆటోమేటిక్‌ కాషన్‌ లిస్టింగ్‌ను మినహాయించింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులతో ఎగుమతిదారులు మరింత మెరుగైన రీతిన లావాదేవీలు నిర్వహించగలుగుతారు. అలాగే ఎగుమతుల ద్వారా సముపార్జించిన మొత్తాన్ని మరింత సులభతరమైన రీతిలో అందుకోగలుగుతారు. 2016లో ప్రవేశపెట్టిన ఆటోమేషన్‌ ఆఫ్‌ ఎక్స్‌పోర్ట్‌ డేటా ప్రాసెసింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఈడీపీఎంఎస్‌)– ‘కాషన్‌/డీ–కాషన్‌ లిస్టింగ్‌ ప్రకారం... రెండేళ్లు పైబడిన షిప్పింగ్‌ బకాయిల విషయంలో ఎగుమతిదారుడు కొన్ని ప్రతికూల పరిస్థితును ఎదుర్కొనాల్సి ఉంటోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతిదారుపై మరిన్ని  నియంత్రణలు తగదని ఆర్‌బీఐ పాలసీ భావిస్తోంది.  

ద్రవ్య లభ్యతకు ఢోకా ఉండదు
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు ఉంటాయి. వచ్చే వారం  ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (వోఎంవో) వేలం ద్వారా రూ.20,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే రూ.లక్ష కోట్లను అందుబాటులో ఉంచడానికి వీలుగా మూడేళ్ల కాలపరిమితితో దీర్ఘకాలిక రెపో చర్యలను (టీఎల్‌టీఆర్‌ఓ) ఆర్‌బీఐ తీసుకుంటుంది. ఇందుకుగాను ఫ్లోటింగ్‌ రేటును మార్చి 31, 2021 వరకూ ఉండే పాలసీ రెపో రేటుతో అనుసంధానించడం జరుగుతుంది.  

దిశా నిర్దేశం...
విధాన నిర్ణయం వృద్ధి పునరుద్ధరణకు తగిన మార్గదర్శకాన్ని సూచించింది. ఆర్థిక వ్యవస్థను పాలసీ ప్రతిబింబిస్తోంది. ‘అధికారిక నిర్ణయాల’ ప్రాతిపదికన కాకుండా, ‘దిశా నిర్దేశం’ ప్రాతిపదికన వృద్ధికి ఊతం ఇవ్వాలని పాలసీ భావిస్తోంది.  
– దినేష్‌ కుమార్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

మరోదఫా రేటు కోత
విధాన నిర్ణయాలను పరిశీలిస్తే, డిసెంబర్‌లో లేదా ఫిబ్రవరి పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటు కోత అవకాశం ఉంది. ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి ఇబ్బందిలేని పరిస్థితిపై పరపతి విధాన కమిటీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
– అభీక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

రియల్టీకి సానుకూలం
గృహ రుణాలపై రిస్క్‌ వెయిటేజ్‌ హేతుబద్దీకరణ రియల్టీకి సానుకూల అంశం. ఈ రంగంలో రుణ లభ్యత పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. అయితే పరిశ్రమ పురోగతికి, డిమాండ్‌ పెరగడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.    
– సతీష్‌ మగార్, క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌

వృద్ధికి మార్గం...
వృద్ధి రికవరీ దిశలో ఆర్‌బీఐ తగిన నిర్ణయాలను తీసుకుంది. ద్రవ్య లభ్యత, ఎగుమతులు, రుణ వృద్ధి పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆయా రంగాలకు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మరోదఫా రేటు కోతకు అనుగుణమైన విధానం హర్షణీయం.
  – చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

ఆర్టీజీఎస్‌ సేవలు ఇక 24x7
డిసెంబర్‌ నుంచి అమల్లోకి
ముంబై: భారీ స్థాయిలో నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే దిశగా రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ సిస్టమ్‌ (ఆర్‌టీజీఎస్‌) విధానాన్ని ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. డిసెంబర్‌ నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం మినహా వారంలోని అన్ని పని దినాల్లో ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గం. దాకా ఆర్‌టీజీఎస్‌ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ‘భారీ స్థాయి చెల్లింపుల వ్యవస్థను ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో తెచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారత్‌ కూడా నిలుస్తుంది‘ అని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.  రూ. 2 లక్షల పైబడిన ఆర్థిక లావాదేవీలకు ఆర్‌టీజీఎస్‌ విధానాన్ని, రూ. 2 లక్షల లోపు లావాదేవీలకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. 2019 డిసెంబర్‌ నుంచి నెఫ్ట్‌ ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు లైసెన్సింగ్‌ సంబంధ అనిశ్చితిని తగ్గించేందుకు పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లకు ఇచ్చే ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ (సీవోఏ)ను సుదీర్ఘకాలం వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.  

గృహ రుణాలపై రిస్క్‌ వెయిటేజ్‌ హేతుబద్దత
గృహ రుణాలకు సంబంధించి రిస్క్‌ (మొండిబకాయిగా మారే అవకాశాలు) వెయిటేజ్‌ని ఆర్‌బీఐ హేతుబద్దీకరించింది. అన్ని కొత్త గృహ రుణాలకు సంబంధించి రిస్క్‌ వెయిటేజ్‌ ఇకపై ఒకేగాటన కాకుండా, ‘లోన్‌ టూ వ్యాల్యూ నిష్పత్తి’కి అనుసంధానమై ఉంటుంది. ఇందుకు అనుగుణమైన విధంగా రుణ గ్రహీతలు వివిధ సంస్థల నుంచి తగిన వడ్డీరేటు ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త విధానం  2022 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.  

కరోనా.. క్రికెట్‌.. ఆర్‌బీఐ పాలసీ..
ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ప్రకటనలో క్రికెట్‌ పరిభాష
ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పాలసీ ప్రకటనలో ఈసారి క్రికెట్‌ పరిభాష కూడా చోటు దక్కించుకుంది. రికవరీ ప్రక్రియ, వివిధ రంగాల పరిస్థితుల గురించి ఉటంకిస్తూ .. ఆఖరి ఓవర్లు, ఖాతా తెరవడం, ఇన్నింగ్స్‌ కాపాడుకోవడం వంటి పదాలను దాస్‌ ప్రస్తావించారు. కరోనా వైరస్‌ బారిన పడ్డ ఎకానమీ కోలుకునే ప్రక్రియను వివరించే ప్రయత్నం చేస్తూ ‘నా అభిప్రాయం ప్రకారం రికవరీ మూడంచెలుగా ఉండవచ్చు. కరోనాను కూడా తట్టుకుని నిలబడిన రంగాలను అన్నింటికన్నా ముందుగా ’పరుగుల ఖాతా తెరిచిన’ వాటిగా పరిగణించవచ్చు. వ్యవసాయం, ఎఫ్‌ఎంసీజీ, వాహనాలు, ఫార్మా మొదలైనవి ఈ కేటగిరీలోకి వస్తాయి. మాంచి ‘స్ట్రైక్‌ ఫామ్‌’లో ఉన్నవి రెండో కోవలోకి వస్తాయి. కార్యకలాపాలు క్రమంగా మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్న రంగాలు ఇందులో ఉంటాయి. ఇక ‘ఆఖరు ఓవర్లను’ (తీవ్ర ఒత్తిడిని) ఎదుర్కొని బరిలో నిల్చి, ఇన్నింగ్స్‌ను కాపాడే రంగాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. సామాజిక దూరం వంటి నిబంధనలతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలు ఇందులో ఉన్నాయి’ అని దాస్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement