ధరలపై పోరు కీలకం కావాలి...
* ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
* ఇదే విధానం కొనసాగుతుందన్న విశ్వాసం
ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే దేశాభివృద్దికి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. తన పదవీ విరమణ తరువాత బాధ్యతలు చేపట్టే ఆర్‌బీఐ కొత్త చీఫ్, అలాగే ఏకాభిప్రాయం ప్రాతిపదికన కీలక రేటు నిర్ణయానికి ఏర్పడబోతున్న ప్రతిపాదిత పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నిలువరించడంపైనే దృష్టి సారిస్తాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను అందుబాటులో ఉంచడం, అలాగే ఏకాభిప్రాయ ప్రాతిపదికన రేటు నిర్ణయానికి ఎంపీసీ ఏర్పాటు కేంద్రం తీసుకున్న కీలక చర్యలుగా వివరించారు. ఇక్కడ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ సంస్థలో ‘ద్రవ్యోల్బణంపై పోరు... పరపతి విధాన వ్యవస్థలో పటిష్టత’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే.. ఒడిదుడుకులను భారత్ తట్టుకుంటుందని వివరించారు.
ఎంపీసీ ఏర్పాటు విప్లవాత్మకం
ఎంపీసీ ఏర్పాటు నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగని రాజన్ అన్నారు. దేశంలో పలు సంవత్సరాల నుంచి అధిక ద్రవ్యోల్బణం సమస్య ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల వాస్తవ వడ్డీరేటు ధోరణి అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. ఈ నేపథ్యంలో తగిన గణాంకాల రూపకల్పన, ఏకాభిప్రాయం ప్రాతిపదికన తగిన రేటు నిర్ణయం దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఎంపీసీల ఏర్పాటు కీలకమని వివరించారు.
గత మూడేళ్లుగా ద్రవ్యోల్బణంపై జరుపుతున్న పోరాటం ఫలితంగా పలు ఆర్థిక అంశాల్లో స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. మన పరపతి విధాన లక్ష్యాల పట్ల పెట్టుబడిదారుల విశ్వాస్వాన్ని పెంపొందించడానికి ‘స్థిర రూపాయి విలువ’ దోహదపడుతుందని రాజన్ ఈ సందర్భంగా వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భారీ పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో భారీ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ద్రవ్యలోటు కట్టడి ఆర్థికవృద్ధిలో కీలకమని అన్నారు.
త్వరలో రాజన్ వారసుని పేరు!
రాజన్ తరువాత ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి పేరును త్వరలో కేంద్రం ప్రకటిస్తుందని సంబంధిత అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కొత్త గవర్నర్ నియామకానికి ప్యానల్ ఏర్పాటు వంటి ఊహాగానాలను ఒక సీనియర్ అధికారి కొట్టిపారేస్తూ... అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేశారు. అనవసర ఊహాగానాలకు తావివ్వకుండా ముందస్తుగానే కొత్త గవర్నర్ ఎవరన్న ప్రకటన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 4న రాజన్ పదవీ విరమణ చేయనున్నారు. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య సహా పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి.