ఒడిదుడుకులను ఎదుర్కొంటాం
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
- భారత్ ఆర్థిక పరిస్థితులు పటిష్టం
- అందుబాటులో తగిన విదేశీ మారక ద్రవ్యం
- రెపో కోతకు ద్రవ్యోల్బణం సహకరించాలి
ముంబై: స్టాక్, కరెన్సీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. దేశంలో ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మన సొంతమని భరోసా ఇచ్చారు. అలాగే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగితే... వృద్ధికి ఊతం ఇచ్చే దిశలో తాజాగా రెపో రేటు తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. రెపో కోత ఎవ్వరో అడిగితే తగ్గించేది కాదని, అది అతి తక్కువ ధరల ద్వారా ఒనగూరే సహజ ఫలితమనీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో. ఈ రేటును ఈ ఏడాది ఇప్పటికే ఆర్‌బీఐ మూడుసార్లు తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.25 శాతంగా ఉంది. ఐబీఏ-ఫిక్కీ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ సమావేశంలో రాజన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
- భారత్ వద్ద ప్రస్తుతం 355 బిలియన్ డాలర్ల భారీ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు ఉన్నాయి. మరో 25 బిలియన్ డాలర్లు అందాల్సిన మొత్తం. ఈ నిల్వలు మన రూపాయి విలువ ఒడిదుడుకులను నియంత్రించడానికి దోహదపడతాయి.
- భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలతోపాటు దిగువస్థాయి కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటుకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, తగిన స్థాయిలో ద్రవ్యోల్బణం, స్వల్ప కాలానికి సంబంధించి విదేశీ కరెన్సీ బకాయిలు తక్కువ స్థాయిలో ఉండడం వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను తెలియజేస్తున్నాయి.
- తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో ఉంచే చర్యలు అమలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ వడ్డీరేట్లపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. బ్యాంకులు ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీరేట్లు తగ్గించి వృద్ధికి దోహదపడాలి.
కరెన్సీ ఒడిదుడుకుల కట్టడి లక్ష్యం...
భారత్ ప్రధాన లక్ష్యం రూపాయి ఒడిదుడుకులను నిరోధించడమేనని అన్నారు. ఒడిదుడుకులు తీవ్ర స్థాయిలో ఉంటే మనకు ఇబ్బందని తెలిపారు. రూపాయి భారీగా బలపడితే- మన ఎగుమతులకు ఇబ్బంది అవుతుందన్నారు. తీవ్ర స్థాయిలో బలహీనపడినా ఇబ్బందేనని అన్నారు. దిగుమతుల ద్రవ్యోల్బణం సమస్య దీనివల్ల పెరుగుతుందని విశ్లేషించారు. అందువల్ల మన రూపాయి మారకం విలువ సమతౌల్యంలో ఉండాలన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.